గొప్ప వక్తగా, రాజనీతిజ్ఞత కలిగిన నాయకుడిగా, మంచి కవిగా విశేషగుర్తింపు పొందిన అటల్ బీహారీ వాజ్ పేయి జీవన ప్రస్థానం ముగిసింది. సుదీర్ఘ రాజకీయ జీవితంలో ఎన్నో ఆటుపోట్లు, ఉత్థాన పతనాలు, అంతే స్థాయిలో చిరస్మరణీయ విజయాలూ సాధించిన ఓ అసమాన రాజకీయ వేత్త అటల్ బిహారీ వాజ్ పేయి. 10సార్లు లోక్ సభ సభ్యునిగా, 2 సార్లు రాజ్యసభ సభ్యునిగా పని చేసిన వాజ్ పేయి మూడుసార్లు ప్రధానమంత్రిగా బాధ్యతలు చేపట్టారు. భారతదేశ రాజకీయ చరిత్రలో ఐదేళ్ళు ప్రభుత్వాన్ని నడిపిన తొలి కాంగ్రెసేతర ప్రధానిగా చిరస్థాయిగా నిలిచిపోతారు వాజ్ పేయి. స్వాతంత్ర్యానికి పూర్వమే ఆరెస్సెస్ తో ప్రారంభమైన వాజ్ పేయి రాజకీయ ప్రస్థానం వయా జనసంఘ్ బీజేపీని అధికారంలోకి తెచ్చేవరకు సాగింది.
వాజ్ పేయి 1924 డిసెంబర్ 25న గ్వాలియర్ లో జన్మించారు. గ్వాలియర్ సరస్వతి శిశు మందిర్ లో పాఠశాల విద్యను, అదే నగరంలో విక్టోరియా కళాశాలలో డిగ్రీని పూర్తి చేసిన వాజ్ పేయి… కాన్పూర్ డిఎవి కళాశాలలో ఎంఎ (పొలిటిల్ సైన్స్) అభ్యసించారు. చిన్న వయసులోనే హిందూత్వ రాజకీయాలకు ఆకర్షితులయ్యారు. 1939లో ఆరెస్సెస్ లో చేరారు. ఆర్యసమాజ్ యువజన విభాగమైన ఆర్య కుమార్ సభలో ఆయన చురుగ్గా పని చేశారు. ఆరెస్సెస్ క్యాంపులకు హాజరై 1944లో ప్రచారక్ గా మారారు.
క్విట్ ఇండియా ఉద్యమంలో…
ఈలోగా 1942 క్విట్ ఇండియా ఉద్యమ సమయంలో వాజ్ పేయిని, ఆయన సోదరుడిని పోలీసులు అరెస్టు చేశారు. తాము బ్రిటిష్ వ్యతిరేక ఉద్యమంలో పాల్గొనబోమని రాసి ఇచ్చిన తర్వాత వారిద్దరినీ పోలీసులు విడుదల చేశారు. 23 రోజులు పోలీసు కస్టడీలో ఉన్న వాజ్ పేయి వయసు అప్పుడు కేవలం 17 సంవత్సరాలు. అలా రాసి ఇచ్చిన విషయం ఆ తర్వాత కాలంలో వెలుగులోకి వచ్చి వివాదాస్పదమైనా… తన రాజకీయ చతురతతో వాజ్ పేయి ఆ విషయాన్ని మరిపించారు.
పీజీ తర్వాత వాజ్ పేయి న్యాయవిద్యలో చేరారు. అయితే.. 1947లో దేశవిభజన, స్వాతంత్య్రం సందర్భంగా జరిగిన అల్లర్ల తర్వాత ఆరెస్సెస్ అవసరాలకోసం న్యాయవిద్యను మధ్యలోనే వదిలేశారు. హిందుత్వ వాదాన్ని బలంగా వినిపించేందుకు ఆరెస్సెస్ ప్రయత్నం చేస్తున్న రోజులవి. ఆయా కార్యకలాపాల్లో వాజ్ పేయి చురుగ్గా పాల్గొన్నారు. 1948లో మహాత్మా గాంధీ హత్యలో ఆరెస్సెస్ పాత్ర ఉందనే ఆరోపణలతో ఆ సంస్థపై దేశవ్యాప్త నిషేధం అమలైంది.
గాంధీ హత్య తర్వాత జనసంఘ్ ద్వారా…
కాంగ్రెస్ వాదిగా నేపథ్యమున్న శ్యామాప్రసాద్ ముఖర్జీ 1951లో భారతీయ జనసంఘ్ ను స్థాపించారు. ఆరెస్సెస్ ప్రోత్సాహంతో ఏర్పాటైన జనసంఘ్ లో పని చేయడానికి దీన్ దయాళ్ ఉపాధ్యాయతోపాటు వాజ్ పేయి కూడా నియమితులయ్యారు. జనసంఘ్ జాతీయ కార్యదర్శి హోదాలో ఉత్తరాది రాష్ట్రాలకు ఇన్ఛార్జిగా పని చేశారు. హిందీ, ఇంగ్లీషు, సంస్ర్కుతం చదివిన వాజ్ పేయికి ఉత్తరాది రాజకీయాల్లో అవి బాగా ఉపయోగపడ్డాయి. జనసంఘ్ ను స్థాపించిన రెండేళ్ల తర్వాత శ్యామాప్రసాద్ ముఖర్జీ మరణించడంతో నాయకత్వ బాధ్యతలు దీన్ దయాళ్ ఉపాధ్యాయకు బదిలీ అయ్యాయి.
అయితే, ఉపన్యాస కళలో దిట్ట అయిన వాజ్ పేయి.. జనసంఘ్ స్వరం, స్వరూపం తానే అనుకునేంతగా ఆకట్టుకున్నారు. 1957 లోక్ సభ ఎన్నికల్లో పోటీ చేసిన వాజ్ పేయి మధుర నుంచి ఓడిపోయి బలరాంపూర్ నుంచి ఎన్నికయ్యారు. అలా స్వతంత్ర భారతంలో రెండో లోక్ సభలో అడుగు పెట్టిన వాజ్ పేయి సుదీర్ఘ కాలం పార్లమెంటులో ప్రతిపక్ష నేతగా ఉన్నారు. దీన్ దయాళ్ ఉపాధ్యాయ మరణం తర్వాత జనసంఘ్ అధ్యక్ష బాధ్యతను వాజ్ పేయికి అప్పగించారు.
ప్రధాని అవుతారని ఊహించిన నెహ్రూ!
దేశమంతా కాంగ్రెస్ విశేషాదారణ పొందుతున్న ఆ రోజుల్లో… ఏ మాత్రం బలంలేని ఓ ప్రతిపక్షానికి చెందిన వాజ్ పేయిలో నెహ్రూ భావి ప్రధానిని చూశారట. పార్లమెంట్ లో వాజ్ పేయి మాట్లాడే విధానానికి ఆకర్షితులైన నెహ్రూ వాజ్ పేయిని ఉద్దేశించి ‘దేశానికి నేతృత్వం వహించగల సామర్ధ్యం ఈ యువకుడికి ఉంది’ అని వ్యాఖ్యానించారు. ఈ సందర్భం అందరినీ ఆశ్చర్య చకితులను చేసింది. దశాబ్దాల తర్వాత అది వాస్తవ రూపం దాల్చింది.
ఆనాటి తరం నేతలందరి రాజకీయ జీవితం ఇందిరాగాంధీ విధించిన ఎమర్జెన్సీ తర్వాత మలుపులు తిరిగింది. అప్పటిదాకా ప్రతిపక్షానికే పరిమితమయిన నేతలకు 1977 సార్వత్రిక ఎన్నికలు అధికారం అందించాయి. ఇందిరాగాంధీ నాయకత్వంలోని కాంగ్రెస్ పార్టీపై జనతా పార్టీ విజయం సాధించింది. ఎమర్జెన్సీలో నెలల తరబడి జైలు జీవితం గడిపిన వాజ్ పేయి…1977లో మొరార్జీ దేశాయ్ క్యాబినెట్ లో విదేశీవ్యవహారాల శాఖ మంత్రిగా బాధ్యతలు స్వీకరించారు. విదేశాంగ మంత్రిగా భారత వాణిని అంతర్జాతీయ వేదికలపై సమర్ధంగా వినిపించారు అటల్. ఐక్యరాజ్యసమితి జనరల్ అసెంబ్లీ లో హిందీలో ప్రసంగించిన తొలినేత వాజ్ పేయి.
జనసంఘ్ విచ్ఛిన్నం
ఎన్నో ఆశలతో ఏర్పడ్డ జనతా ప్రభుత్వం కూలిపోయినప్పడు దేశమంతా ఓ నిస్సత్తువ, నిర్వేద వాతావరణం నెలకొంది. మొరార్జీ దేశాయ్ రాజీనామా చేసిన తర్వాత జనతాపార్టీ కనుమరుగైంది. సంకీర్ణాన్ని కాపాడటానికి ప్రయత్నించి విఫలమైన జనసంఘ్ దిక్కుతోచని స్థితిలో పడింది. ఆసమయంలో జనసంఘ్, ఆరెస్సెస్ లోని తన సహచరులతో సహా వాజ్ పేయి హిందూత్వ రాజకీయాల కొత్త వేదికను స్థాపించారు. అదే బీజేపీ. 1980లో బీజేపీని స్థాపించే సమయానికి…వాజ్ పేయి ఒక అనుభవమున్న పరిణతిగల రాజకీయ నేతగా గుర్తింపు పొందారు. బీజేపీ తొలి జాతీయ అధ్యక్షుడు ఆయనే.
బీజేపీతో ప్రయాణం
ఆరెస్సెస్ వెన్నుదన్ను, జనసంఘ్ నేతల రాజకీయ అనుభవంతో 1984 నాటికి బీజేపీ తన కార్యకలాపాలను విస్తరించింది. ఆ ఏడాది జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో గణనీయంగా సీట్లు సంపాదించుకుంటామని బీజేపీ నేతలు ఆశించారు. అయితే, దేశం మొత్తంమీద రెండే సీట్లు వచ్చాయి. ఇందిరాగాంధీ హత్య తర్వాత జరిగిన ఎన్నికలు కావడంతో సానుభూతి పవనాలు దేశమంతా వీచి కాంగ్రెస్ చారిత్రాత్మక విజయాన్ని సొంతం చేసుకుంది. 1989లో కాంగ్రెస్ పార్టీ ఓటమి పాలైనా బీజేపీకి అధికారం దక్కలేదు. అయితే, 85 సీట్లు సంపాదించింది.
వాజ్ పేయి నాయకత్వం, హిందూత్వ ఎజెండాతో అద్వానీ దుందుడుకు రాజకీయాలు బీజేపీ బలపడటానికి కారణమయ్యాయి. 1991లో 120 సీట్లు సంపాదించిన బీజేపీ 1996 ఎన్నికల్లో మరో 40 సీట్లను పెంచుకోగలిగింది. బాబ్రీ మసీదు స్థానంలో రామమందిర నిర్మాణానికంటూ అద్వానీ చేపట్టిన రథయాత్రతో బీజేపీ తొలిసారిగా అతిపెద్ద పార్టీగా అవతరించింది. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయేగలమన్న నమ్మకంతో వాజ్ పేయి ప్రధానమంత్రిగా ప్రమాణం చేశారు. అయితే, 544 లోక్ సభ సీట్లలో బీజేపీకి ఉన్న 161కి తోడయ్యేవారు చాలా తక్కువ కావడంతో విశ్వాస పరీక్షలో విఫలమయ్యారు.
1996లో కాంగ్రెస్, బీజేపీయేతర పార్టీలు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయగా… కాంగ్రెస్ పార్టీ మద్ధతు ఇచ్చింది. అయితే, ఆ ప్రభుత్వాలను కాంగ్రెస్ మననీయకపోవడంతో తిరిగి బీజేపీకి అవకాశం వచ్చింది. 1998 ఎన్నికల నాటికి వాజ్ పేయి మిత్రులను కూడగట్టడంలో సఫలమయ్యారు. తెలుగుదేశం వంటి పార్టీలు కూడా ఎన్నికల తర్వాత బీజేపీకి మద్ధతు ప్రకటించాయి. దీంతో వాజ్ పేయి సంకీర్ణ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు. అయితే, 13 నెలల తర్వాత జయలలిత మద్ధతు ఉపసంహరించుకోవడంతో విశ్వాస పరీక్షలో విఫలమైన వాజ్ పేయి మరోసారి అర్ధాంతరంగా రాజీనామా చేశారు. మధ్యంతర ఎన్నికలు ఖాయమయ్యాయి.
అణు పరీక్షలు, కార్గిల్ యుద్ధం
1998లో వాజ్ పేయి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన కొద్ది నెలలకే అణు పరీక్షలు (పోఖ్రాన్ 2) నిర్వహించడం ద్వారా జాతీయవాద భావోద్వేగాన్ని రగిలించారు. ఆ మరుసటి సంవత్సరం పాకిస్తాన్ తో కార్గిల్ కేంద్ర బిందువుగా జరిగిన యుద్ధం ప్రభుత్వం పట్ల ప్రజల్లో సానుకూలతకు కారణమైంది. ఈ రెండు పరిణామాల నేపథ్యంలో వాజ్ పేయి ప్రభుత్వానికి మద్ధతు ఉపసంహరించిన జయలలిత విమర్శల పాలయ్యారు.
ప్రభుత్వాన్ని పడగొట్టడానికి పెద్దాయన ఏం తప్పు చేశారనే ప్రశ్నతో బీజేపీ చేసిన ప్రచారం మంచి ఫలితాన్నిచ్చింది. ఫలితంగా 1999లో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీ మరోసారి అతి పెద్ద పార్టీగా అవతరించింది. అయితే, సొంతగా మెజారిటీ రాకపోవడంతో మరోసారి సంకీర్ణ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయక తప్పలేదు. తొలిసారి 13 రోజుల్లో, రెండోసారి 13 నెలల్లో రాజీనామా చేసిన వాజ్ పేయి మూడోసారి ఐదేళ్ళూ ప్రధానమంత్రిగా కొనసాగారు. మిత్రులను కూడగట్టడంలో వాజ్ పేయి చూపిన చొరవ, లౌక్యమే ఈ సంకీర్ణ విజయానికి కారణం.
రైట్ పర్సన్ ఇన్ ద రాంగ్ పార్టీ
అంటరాని దశనుంచి బీజేపీ డజన్లకొద్దీ పార్టీలను కలుపుకొని సంకీర్ణాన్ని నడిపేవరకు రావడానికి వాజ్ పేయే కారకులు. జీవిత కాలం హిందూత్వ రాజకీయాల్లోనే ఉన్నా వాజ్ పేయిని ఇతర పార్టీల నేతలు కొందరు ‘రైట్ పర్సన్ ఇన్ రాంగ్ పార్టీ’గా అభివర్ణించేవారు. బీజేపీలోనే లిబరల్ గా వాజ్ పేయికి ఉన్న పేరు, లౌక్యం, సందర్భానికి అనుగుణంగా వ్యవహరించే నేర్పు… ఆయనను కాంగ్రెస్, బీజేపీయేతర పార్టీల నేతలకు కూడా ఆమోదయోగ్యుడిగా మార్చింది.
బీజేపీ వెనుక ఉన్న ఆరెస్సెస్ ఆదేశాల ప్రకారమే పని చేయవలసి ఉన్న రోజుల్లో కూడా ప్రధానిగా సొంత నిర్ణయాలు తీసుకునేవారు వాజ్ పేయి. లౌకికవాదానికి అనుకూలంగా మాట్లాడే బీజేపీ నేత కూడా వాజ్ పేయి ఒక్కరే. బాబ్రీ మసీదు కూల్చివేత జరిగి ఉండకూడదని ఆయన వ్యాఖ్యానించారు. కూల్చివేత సమయంలో తన సహచరులు అద్వానీ, మరుళీమనోహర్ జోషి కరసేవకులకు దన్నుగా ఉన్నప్పుడు వాజ్ పేయి హాజరు కాలేదు.
మోడీ చరిత్ర అప్పుడే ముగిసేది!
ప్రస్తుత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉండగా 2002లో గోధ్రా అల్లర్లలో 2000 మందికి పైగా ఊచకోతకు గురైనప్పుడు ‘రాజధర్మాన్ని పాటించు’ అంటూ సుతిమెత్తగా మందలించారు. నిజానికి ఆ సమయంలో మోడీని ముఖ్యమంత్రి పదవినుంచి తప్పించాలని వాజ్ పేయి భావించినా అప్పటి ఉప ప్రధాని ఎల్.కె. అద్వానీ అడ్డుపడ్డారు. వాజ్ పేయి నిర్ణయం ప్రకారమే అయితే… మోడీ రాజకీయ చరిత్ర అప్పటితో ముగిసేది.
ఐదేళ్ల పదవీకాలం పూర్తిచేసుకున్న తొలి కాంగ్రెసేతర ప్రధానమంత్రిగా చరిత్ర సృష్టించిన వాజ్ పేయి… విలువలున్న రాజకీయనేతగా గుర్తింపు పొందారు. ప్రధాని అయ్యాక… తాను ప్రాతినిధ్యం వహించిన పార్టీకో లేక సిద్ధాంతానికో పరిమితం కాకుండా దేశానికి నేతగా వ్యవహరించిన సమున్నతుడు. పాకిస్తాన్, చైనాలతో సంబంధాల విషయంలో చొరవ చూపించారు. కార్గిల్ యుద్ధానికి కారకుడైన పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ ముషారఫ్ ఆ దేశానికి అధ్యక్షుడైన తర్వాత కూడా వాజ్ పేయి మంచి సంబంధాలు నెరిపారు. అంతర్గతంగానూ… కాశ్మీర్ వంటి సమస్యల విషయంలో బీజేపీ నేతల దుందుడుకు వైఖరికి భిన్నంగానే వ్యవహరించారు.
రాజకీయాల్లో శత్రువులు ఉండరు..ప్రత్యర్దులు మాత్రమే ఉంటారని తొలినుంచీ చెప్పిన వాజ్ పేయి, చివరిదాకా ఆ విలువలే పాటించారు. మృదువైన స్వభావం, అవసరమైన చోట కచ్చితత్వం, ముక్కుసూటితనం, అదే సమయంలో మిత్రులను కలుపుకొనిపోగల నేర్పరితనం, శత్రువులను సైతం మిత్రులుగా మార్చుకోగల రాజనీతిజ్ఞత అటల్ జీ సొంతం. వాజ్ పేయి భౌతికంగా కనుమరుగైనా.. భారత రాజకీయ చరిత్రలో ఆయన పాత్ర మరువలేనిది.