అణ్వాయుధ వ్యతిరేక ప్రచారానికి నోబెల్ శాంతి బహుమతి

నోబెల్ శాంతి బహుమతి-2017 న్యూక్లియర్ ఆయుధాల వ్యతిరేక ప్రచారానికి దక్కింది. ఇంటర్నేషనల్ కాంపెయిన్ టు అబాలిష్ న్యూక్లియర్ వెపన్స్ (ఐకెన్)కు నోబెల్ ను అవార్డు చేస్తున్నట్టు నోబెల్ కమిటీ శుక్రవారం ప్రకటించింది. ఐకెన్ సంస్థ అణ్వాయుధాలు సృష్టించే భయానక పరిస్థితులపై ప్రచారం చేయడంతో పాటు… ఆ ఆయుధాలను నిషేధించే ఒప్పందం కోసం ప్రయత్నిస్తోంది. ప్రపంచవ్యాప్తంగా 100 ప్రభుత్వేతర సంస్థల సమాహారంగా ‘ఐకెన్’ పని చేస్తోంది. ఆ సంస్థ ప్రయత్నాలతో అణ్వాయుధాల నిరోధం లేదా నిర్మూలనకు 108 దేశాలు వాగ్ధానం చేశాయి. అంతర్జాతీయ చట్టం ద్వారా అణ్వాయుధాలను నిషేధింపజేయాలని ఐకెన్ ప్రయత్నిస్తోంది. ఫలితంగా ఈ ఏడాది జూలై 7న 122 ఐక్యరాజ్యసమితి సభ్య దేశాలు ఒప్పందానికి అంగీకరించాయి.

ప్రస్తుతం ప్రపంచం అత్యంత ప్రమాదకర పరిస్థితులను ఎదుర్కొంటోంది. వివిధ దేశాల వద్ద సుమారు 15,000 అణ్వాయుధాలున్నాయి. అణ్వాయుధ దేశాలు తమ సంపత్తిని ఆధునీకరిస్తుంటే… కొత్తగా మరికొన్ని దేశాలు వాటిని సమకూర్చుకోవడానికి ప్రయత్నిస్తున్న నేపథ్యంలో ఐకెన్ అంతర్జాతీయంగా నిషేధ చర్చకు తెర లేపింది. గతంలో ల్యాండ్ మైన్స్, క్లస్టర్ మ్యూనిషన్స్, బయోలాజికల్ – కెమికల్ ఆయుధాలపై నిషేధ ఒప్పందాల్ని అంతర్జాతీయ సమాజం ఆమోదించింది. వాటికంటే విధ్వంసకరమైన అణ్వాయుధాల విషయంలోనూ ఆ స్ఫూర్తిని కొనసాగించడానికే ఈ ఏడాది నోబెల్ బహుమతిని ‘ఐకెన్’కు ప్రకటించినట్టు భావిస్తున్నారు.

Leave a Comment