గొల్ల, కురుమ సంక్షేమ భవనాలకు శంఖుస్థాపన
రాజకీయ అధికారం ఏ ఒక్క సామాజికవర్గం చేతిలోనో కేంద్రీకృతం కాకూడదని తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖరరావు (కేసీఆర్) ఉద్ఘాటించారు. బడుగు బలహీనవర్గాలు అధికారంలో భాగస్వాములు కావాలని ఆకాంక్షించారు. తెలంగాణలో బలహీనవర్గాల ప్రజలకు సంక్షేమ ఫలాలు అందించడంతోపాటు రాజకీయంలో భాగస్వాములను చేేసేందుకు తాను కట్టుబడి ఉన్నానని చెప్పారు.
శుక్రవారం రంగారెడ్డి జిల్లా కోకాపేటలో గొల్ల, కురుమ భవనాల నిర్మాణ పనులకు శంఖుస్థాపన చేసిన సందర్భంగా కేసీఆర్ మాట్లాడారు. వచ్చే మార్చిలో ఖాళీ అయ్యే రాజ్యసభ సీట్లలో ఒకటి యాదవ వర్గానికి చెందిన వ్యక్తికి కేటాయిస్తానని కేసీఆర్ ప్రకటించారు. గొల్ల కురుమలు అత్యధికంగా ఉన్న రాష్ట్రం తెలంగాణ అని, రాష్ట్రంలో వారు వేల కోట్ల సంపదను సృష్టిస్తున్నారని ప్రశంసించారు.
బలహీనవర్గాలకు హైదరాబద్ లో కేటాయించిన స్థలంలో విద్యార్ధులకు వసతి గృహాలు, మహిళలు, యువతకు శిక్షణా కేంద్రాలు నిర్మించుకోవాలని కేసీఆర్ పేర్కొన్నారు. పేద ప్రజలు హైదరాబాద్ లో వైద్యంకోసం వచ్చి చనిపోతే శవాన్ని గ్రామానికి తీసుకెళ్ళడానికి సైతం ఇబ్బంది పడటం తనకు తెలుసని, ఎమ్మెల్యేగా పని చేసిన రోజుల్లో తాను ఆ ఇబ్బందులను కళ్ళారా చూశానని చెప్పారు. అందుకే తెలంగాణ రాష్ట్రం ఏర్పాటయ్యాక దేశంలోనే తొలిసారిగా మృత దేహాలను తీసుకెళ్ళేందుకు ఉచిత ఏర్పాట్లు చేశామని పేర్కొన్నారు.
సంఘటిత శక్తి లేకనే అభివృద్ధిలో వెనుక…
‘మన వద్ద సంఘటిత శక్తి లేకనే అభివృద్ధిలో వెనుకబడిపోతున్నాం. ఆ బాధ పోవాలంటే మనలో ఐకమత్యం రావాలి. నేటి ప్రయాణంతో అద్భుతం జరగాలి. గొల్ల, కురుమలలో తల్లిదండ్రులు లేని బిడ్డలుంటే వారి పెళ్లిళ్లు ఈ సంక్షేమ భవనంలో జరగాలి. అనాథలుంటే వారికి అన్నం దొరకాలి. గొల్ల, కురుమ సంఘం మూలధనంకోసం బీసీ సంక్షేమ శాఖ నుంచి కోటి మంజూరు చేస్తున్నా. ఈ నిధి అద్భుతంగా మన జాతికి ఉపయోగపడుతుంది. సంక్షేమానికి దోహదపడుతుంది’ అని కేసీఆర్ చెప్పారు.
తెలంగాణ రాష్ట్రానికి సగటున రోజుకు 650 లారీల గొర్రెలు దిగుమతి అవుతున్నాయని, ఒక్క హైదరాబాద్ నగరానికే 350 లారీలు వస్తున్నాయని చెప్పిన కేసీఆర్… భవిష్యత్ లో తెలంగాణ నుంచే గొర్రెలు ఎగుమతి కావాలని ఆకాంక్షించారు. ఈ లక్ష్యంతోనే ప్రభుత్వం లక్షలాదిగా గొర్రెలను పంపిణీ చేస్తోందని, ఇప్పటివరకు ఇతర రాష్ట్రాలనుంచి 35 లక్షల గొర్రెలు తెస్తే.. వాటికి 13 లక్షల పిల్లలు పుట్టాయని, మొత్తంగా 48 లక్షల గొర్రెలు తెలంగాణలో ఉన్నాయని కేసీఆర్ వివరించారు.
గొర్రెల పంపిణీ కొనసాగుతుందన్న కేసీఆర్… ‘లబ్దిదారుల ఎంపికకు రెండే కొలమానాలు 1. గొల్ల లేదా కురుమ అయి ఉండాలి. 2. 18 సంవత్సరాలు నిండి ఉండాలి. ఒక ఇంట్లో ఎంత మంది ఉన్నా అందరికీ గొర్రెల పంపిణీ జరుగుతుంది. దీనికి మరో ఐదు వేల కోట్ల రూపాయలు ఖర్చవుతాయి. అయినా వెనుకాడం’ అని వివరించారు.
రాష్ట్రంలో 30 లక్షల మంది గొల్ల, కురుమలు ఉన్నారని, గంగపుత్రులు 40 లక్షల మంది ఉన్నారని కేసీఆర్ చెప్పారు. నవాబులు కట్టించిన మేజర్, మైనర్ ఇరిగేషన్ ప్రాజెక్టులు ఉన్నా కూడా చేపల పెంపకం నిర్లక్ష్యానికి గురైందని ఆవేదన వ్యక్తం చేశారు. రాంనగర్ మార్కెట్‌కు రోజూ 20 నుంచి 25 లారీల చేపలు వస్తున్నాయన్న కేసీఆర్… గొర్రెలు, చేపల పెంపకానికి తెలంగాణలో మానవ వనరులు అద్భుతంగా ఉన్నాయని చెప్పారు.
మేకలు తప్ప గొర్రెలన్నింటీని ప్రభుత్వ, అటవీ భూముల్లో మేపుకోవచ్చని కేసీఆర్ చెప్పారు. తెలంగాణలో 12 లక్షల ఎకరాల్లో పండ్ల తోటలు ఉన్నాయని, గొర్రెలను పండ్ల తోటల్లో కూడా మేపుకొనే సదుపాయం కల్పించాలని సూచిస్తున్నామని, ఈ దిశగా ఇప్పటికే జిల్లా కలెక్టర్లకు ఆదేశాలిచ్చామని సీఎం పేర్కొన్నారు.