మీరు అవినీతికి వారసులు… మేము నిప్పు
రెండెకరాల రైతుకు వేల కోట్ల సంపదా?
ఒక మహానేతను భూస్థాపితం చేసి అధికారం సంపాదించారు
చంద్రబాబుపై తీవ్ర వ్యాఖ్యలు చేసిన సోము వీర్రాజు
బీజేపీపైనగానీ ప్రధానమంత్రి నరేంద్ర మోదీపైన గానీ ఎవరైనా తప్పుడు ప్రచారం చేస్తే తిరగబడాలని పార్టీ కార్యకర్తలకు ఎమ్మెల్సీ సోము వీర్రాజు పిలుపునిచ్చారు. రాష్ట్రంలో అవినీతిపై తిరగబడాలని పార్టీ అధ్యక్షుడే (అమిత్ షా) చెప్పారని వెల్లడించారు. ఆదివారం ఓ సభలో కార్యకర్తలను ఉద్దేశించి మాట్లాడుతూ… మిత్రపక్షం తెలుగుదేశం పార్టీపైన, ఆ పార్టీ అధ్యక్షుడు చంద్రబాబునాయుడుపైనా విరుచుకుపడ్డారు. ఎన్టీఆర్ పదవీచ్యుతుడైన సందర్భాన్ని గుర్తు చేస్తూ చంద్రబాబు ఆస్తులను సైతం వీర్రాజు ప్రశ్నించారు. అవినీతికి వారసులంటూ తెలుగుదేశం నేతలపై ధ్వజమెత్తారు. అమరావతి పేరిట కేంద్రీకృత అభివృద్ధిని ఆపకపోతే దానిపైనా తిరగబడతామని హెచ్చరించారు.
కేంద్ర బడ్జెట్ 2018లో రాష్ట్రానికి నిధుల కేటాయింపుల లేకపోవడంపై గుర్రుగా ఉన్న అధికార తెలుగుదేశం పార్టీ నేతలు మోదీ ప్రభుత్వంపై వేలెత్తి చూపుతున్న నేపథ్యంలో సోము వీర్రాజు తీవ్రమైన ఎదురుదాడి చేశారు. రాష్ట్రంలో అవినీతి తాండవిస్తోందని, ఇక్కడున్నది పరిపాలన కాదని కేవలం వ్యాపారమేనని సోము వీర్రాజు వ్యాఖ్యానించారు. ‘‘మీరేమో రెండెకరాల రైతా… మీ సంపద వేల కోట్లకు పెరిగిందా…! ఒక మహానుబావుడు పార్టీని స్థాపిస్తే ఆయనను భూస్థాపితం చేసి… భూమిలో పాతేసి అధికారాన్ని సొంతం చేసుకున్నారు’’ అని చంద్రబాబుపైనే గురి పెట్టారు.
తెలుగుదేశం పార్టీ నేతలు అవినీతికి వారసులన్న వీర్రాజు…తాము నిప్పులాంటి వారమని, ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి సొంత ఇల్లు కూడా లేదని పేర్కొన్నారు. చంద్రబాబు సొంత నియోజకవర్గంలోని ఒక్క మండలంలోనే రూ. 10 కోట్ల అవినీతి జరిగిందని, కేంద్ర నిధులు కొందరికి ఉపాధిగా మారాయని వ్యాఖ్యానించారు. ‘‘దమ్ముంటే నీ పార్టీకి త్యాగం చేయడం నేర్పు. అవినీతి కాదు’’ అని తీవ్ర స్వరంతో మాట్లాడారు. రాష్ట్రంలో అభివృద్ధి పథకాలన్నీ కేంద్ర నిధులతోనే జరుగుతున్నాయన్న వీర్రాజు ‘‘డ్రైనేజీ, రోడ్ల నిర్మాణంలో ఒక్క రూపాయన్నా రాష్ట్రం సొమ్ము ఉందా?’’ అని ప్రశ్నించారు. కేంద్రం వివిధ పనులకోసం 9000 కోట్లు ఇచ్చిందని, కానీ చంద్రబాబు మోదీ ఫొటో పెట్టడానికి భయపడుతున్నారని ఆక్షేపించారు.
రాష్ట్ర విభజన సమయంలో రాజధాని అభివృద్ధికి ఐదు లక్షల కోట్లు కావాలన్న చంద్రబాబు డిమాండ్ ను వీర్రాజు ఎద్దేవా చేశారు. అసలు రాష్ట్రం విడిపోవడానికి ప్రధాన కారణం అభివృద్ధి కేంద్రీకరణేనని సూత్రీకరించారు. చంద్రబాబు హయాంలో అభివృద్ధి అంతా హైదరాబాద్ చుట్టూ కేంద్రీకృతమైందన్న వీర్రాజు… ఈ రాష్ట్రంలో మాత్రం కేంద్రీకృత అభివృద్ధి జరగడానికి వీల్లేదని ఉద్ఘాటించారు. ఈ విషయంలో అవసరమైతే తిరగబడతామని హెచ్చరించారు.
‘‘అధ్యక్షుడు చెప్పాడు. అవినీతిపై తిరగబడండి. బీజేపీపైన, మోదీపైన ఎవరైనా తప్పుడు ప్రచారం చేస్తే తిరగబడండని చాలా స్పష్టంగా తెలియజేశారు‘‘ అని సోము వీర్రాజు కార్యకర్తలకు చెప్పారు. రాష్ట్రంలో బీజేపీని అభివృద్ధి చేయడం తప్ప తనకు మరే సొంత ఎజెండా లేదని చెప్పుకొచ్చారు.