పర్యావరణ కారణాలతో రాజధాని అమరావతి నిర్మాణాన్ని అడ్డుకోవడానికి జాతీయ గ్రీన్ ట్రిబ్యునల్ (ఎన్జీటీ) నిరాకరించింది. ఈ అంశంపై దాఖలైన పిటిషన్లను తోసిపుచ్చడం ద్వారా రాజధాని నిర్మాణానికి ‘గ్రీన్’ సిగ్నల్ ఇచ్చింది. అదే సమయంలో వివిధ అధారిటీలు నిర్దేశించిన పర్యావరణ మార్గదర్శకాలను కచ్చితంగా పాటించాలని, కొండవీటి వాగు ప్రవాహ మార్గాన్ని మార్చరాదని గ్రీన్ ట్రిబ్యునల్ స్పష్టం చేసింది. కరకట్టలను కూడా పరిరక్షించాలన్న ట్రిబ్యునల్… ముంపు ముప్పు తగ్గించే నిర్మాణాలను మాత్రం చేపట్టవచ్చని పేర్కొంది.
అమరావతి నిర్మాణానికి సంబందించి దాఖలైన పిటిషన్లపై ఎన్జీటీ శుక్రవారం తన నిర్ణయాన్ని వెల్లడించింది. పర్యావరణ మార్గదర్శకాలకు అనుగుణంగా నిర్మాణ పనులు జరుగుతున్నాయా? లేదా? అన్న అంశాన్ని పర్యవేక్షించడానికి రెండు కమిటీలను నియమించాలని ఎన్జీటీ నిర్ణయించింది. రాష్ట్ర స్థాయిలో ఒక పర్యవేక్షణ కమిటీని, దాని పరిధిలో ఒక ఇంప్లిమెంటేషన్ కమిటీని నియమించాలని ఆదేశించింది.
పర్యావరణ మార్గదర్శకాలు, ఎన్జీటీ ఆదేశాల అమలు బాధ్యత సూపర్ వైజరీ కమిటీది. ఈ కమిటీ మూడు నెలలకోసారి సమావేశమై మార్గదర్శకాల అమలును సమీక్షిస్తుంది. ఇంప్లిమెంటేషన్ కమిటీ..క్షేత్ర స్థాయిలో నిర్మాణాలను పరిశీలించి మార్గదర్శకాలకు అనుగుణంగానే జరుగుతున్నాయా? లేదా? అన్నది నిర్ధారిస్తుంది. ఈ కమిటీ నెలకోసారి సమావేశమవుతుంది. పర్యావరణానికి సంబంధించి మొత్తంగా 191 మార్గదర్శకాలను అమలు చేయవలసిందేనని గ్రీన్ ట్రిబ్యునల్ స్పష్టం చేసింది.
అమరావతి నిర్మాణం… ఆ ప్రదేశంలో చేపట్టడంవల్ల పర్యావరణ సమస్యలు తలెత్తుతాయంటూ పోరాడుతున్న పి. శ్రీమన్నారాయణ, కేంద్ర ఇంథన శాఖ మాజీ కార్యదర్శి ఇఎఎస్ శర్మ తదితరులు దాఖలు చేసిన పిటిషన్లపై ఎన్జీటీలో విచారణ జరిగింది. కొండవీటి వాగు ముంపు ముప్పు ఉన్న ప్రదేశంలో రాజధాని నిర్మాణం తలపెట్టారని, వాగు ప్రవాహాన్ని అడ్డుకోవడంవల్ల భవిష్యత్తులో రాజధాని నగరానికి ముంపు తప్పదని పిటిషనర్లు వాదించారు. ఎన్జీటీ ఛైర్మన్ జస్టిస్ స్వతంత్రకుమార్ ఆధ్వర్యంలోని ధర్మాసనం విచారణ అనంతరం శుక్రవారం తుది ఉత్తర్వులు ఇచ్చింది.