అమరావతికి ముఖేష్ అంబానీ..

0 0
Read Time:5 Minute, 58 Second
రాజధానిలో ప్రాజెక్టులు వేగంగా సాగకపోవడంపై సిఎం అసహనం

సీఆర్డీయే అధికారులు, మంత్రిపై మండిపాటు

‘‘10 రోజుల్లో ముఖేష్ అంబానీ రాష్ట్రానికి వస్తున్నారు. రాజధానిలో ప్రైవేటు ప్రాజెక్టులు కూడా పూర్తి కావడంలేదు. అమరావతిలో అంబానీకి నేనేం చూపించేది?’’… ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు అధికారులకు వేసిన ప్రశ్న ఇది. పెద్ద మొత్తంలో భూములు కేటాయించినా ప్రైవేటు సంస్థలు వేగవంతంగా ప్రాజెక్టుల నిర్మాణ పనులను చేపట్టకపోవడం, మరోవైపు మౌలిక సదుపాయల పనులు నత్తనడక నడుస్తుండటంపై ముఖ్యమంత్రి చాలా అసహనంతో ఉన్నట్టు సమాచారం.

ప్రతి సోమవారం పోలవారంగా మార్చుకున్న ముఖ్యమంత్రి… అంతకంటే ఎక్కువ ప్రాధాన్యత అమరావతి నిర్మాణానికి ఇచ్చి ప్రతి బుధవారం సమీక్ష నిర్వహిస్తున్నారు. అక్కడితో ఆగక మధ్య మధ్యలో డిజైన్లపై వర్క్ చేస్తున్నారు. కంపెనీల ప్రతినిధులు వస్తే సమావేశమై రాజధాని ప్రణాళికలు చూపించి పెట్టుబడులు, సంస్థలను ఏర్పాటు చేయమంటున్నారు. ఇలా మరే అంశానికీ ఇవ్వనంత సమయం రాజధానికి ఇస్తున్నా.. ఆశించినంత వేగంగా పనులు జరగడంలేదనే అసంతృప్తి సిఎంలో కనిపిస్తోంది.

ఈ నేపథ్యంలోనే తాజాగా అధికారులపై స్వరం పెంచారు. మాటలు చెప్పొద్దని మండిపడ్డారు. ముఖేష్ అంబానీ రాష్ట్రానికి వస్తున్నారని అధికారుల వద్ద వెల్లడించిన సిఎం… ఇప్పటిదాకా క్షేత్ర స్థాయిలో జరిగిన నిర్మాణాలను చూపించాలంటే ఏమున్నాయని ప్రశ్నించారు. పట్టణాభివృద్ధి శాఖ మంత్రి నారాయణతో సహా సీఆర్డీయే అధికారులపై ముఖ్యమంత్రి ఈ విషయమై తీవ్ర స్థాయిలో మండిపడ్డట్టు సమాచారం. రాజధానిలో భూమి కేటాయింపులు గణనీయంగా చేసినా.. చాలా కొద్ది సంస్థలే ఇప్పటిదాకా నిర్మాణం ప్రారంభించాయని అసంతృప్తి వ్యక్తం చేసిన సిఎం.. స్టార్ హోటళ్ళ నిర్మాణం ఎందుకు ఆలస్యమవుతోందని ప్రశ్నించారు.

బుధవారం జరిగిన సీఆర్డీయే సమావేశంలో సిఎం ‘హనీమూన్ ముగిసింది. ఇప్పటికే చాలా సమయం ఇచ్చాను. వారం వారం నాలుగైదు గంటల సమయం కేటాయిస్తున్నాను. ఇంకా మీరు మాటలు చెబితే లాభం లేదు’ అని వ్యాఖ్యానించారు. తాను ఈ మాటలు ఆగ్రహంతో అనడం లేదని, ఆవేదనతో చెబుతున్నానని సిఎం ఆ సమావేశంలో వ్యాఖ్యానించడం గమనార్హం. రాజధానిలోని నిర్మణ, అభివృద్ధి పనులు వేగం పుంజుకోవాలని, నిర్మాణ సంస్థలు చురుగ్గా కదలాలని సిఎం హుకుం జారీ చేశారు. పనులు మాటల్లో కాకుండా చేతల్లో కనిపించాలని స్పష్టం చేశారు.

ముఖేష్ అంబానీ ఎందుకొస్తున్నారు?

రాష్ట్రానికి, రాజధాని అమరావతికి ముఖేష్ అంబానీ వస్తున్నారని ముఖ్యమంత్రి ఆంతరంగికంగా అధికారులకు చెప్పారు. అంబానీ ఎందుకొస్తున్నారు? ఈ ప్రశ్నకు సమాధానం కావాలంటే సుమారు నెల రోజులు వెనక్కు వెళ్ళాలి. ముఖ్యమంత్రి తనయుడు, రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ అక్టోబర్ చివరి వారంలో ముంబై వెళ్ళారు. పలు ఐటి, ఫిన్ టెక్, ఎలక్ట్రానిక్స్ కంపెనీ యజమానులతో పాటు పారిశ్రామిక ధిగ్గజం ముఖేష్ అంబానీని కూడా కలుసుకున్నారు.

రాష్ట్ర అభివృద్ధిలో భాగస్వాములు కావాలని కోరిన లోకేష్… ఆ క్రమంలోనే అమరావతికి రావలసిందిగా ఆహ్వానించారు. దీనికి ముఖేష్ సానుకూలంగా స్పందించారట. ముఖ్యమంత్రి అధికారులకు చెప్పిన మాట ప్రకారమైతే వచ్చే నెలలో ముఖేష్ అంబానీ రాష్ట్రానికి వస్తారు. లోకేష్ ముంబైలో కలసినప్పుడు రాష్ట్రంలో ఐటీ కంపెనీల ఏర్పాటుకు అనుసరించిన విధానాన్ని, ఎలక్ట్రానిక్స్ తయారీ రంగంలో సాధించిన ఫలితాలను అంబానీకి చెప్పారు.

ఈప్రగతి, రియల్ టైం గవర్నెన్స్ వంటి అంశాలనూ… అమరావతి, విశాఖపట్నంలలో జరుగుతున్న అభివృద్ధిని అంబానీకి ఏకరవు పెట్టారు లోకేష్. రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేవారికి ఇస్తున్న, ఇవ్వబోయే రాయితీలేమిటో చెప్పి.. ముఖేష్ అంబానీ కూడా రాష్ట్ర ప్రగతిలో పాలు పంచుకోవాలని లోకేష్ కోరారు. మరి ముఖేష్ అంబానీ రాష్ట్రానికి వచ్చి ఏం చూస్తారో.. ఏమిస్తారో వేచి చూడాలి.

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Leave a Reply