అమరావతికి సినీ పరిశ్రమ.. చంద్రబాబు అంతరంగమిదే..!

5 0
Read Time:6 Minute, 7 Second
సుందర విశాఖకు ఎక్కువ మంది మొగ్గు చూపినా..
ఫ్యూచర్ నగరం అమరావతి బెటరంటున్న సిఎం

తెలుగు చలనచిత్ర పరిశ్రమను విశాఖ, అమరావతి నగరాల్లో ఎక్కడికి తరలించాలన్న అంశంపై అన్ని వర్గాలతో సమాలోచన చేస్తున్నామని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు చెప్పారు. నంది అవార్డుల ప్రకటన కార్యక్రమంకోసం విజయవాడ వచ్చిన సినీ ప్రముఖులు మంగళవారం సాయంత్రం ఇక్కడ ముఖ్యమంత్రిని కలిశారు. ఈ సందర్భంగా సిఎం సినీ పరిశ్రమ తరలింపు అంశాన్ని ప్రస్తావించారు. సాగర తీర నగరం విశాఖకు తరలించాలని ఎక్కువమంది కోరుతున్నారని, అయితే… రానున్న కాలంలో అమరావతి నగరం ప్రపంచంలోని ఐదు ఉత్తమ నగరాలలో ఒకటి కానున్న నేపథ్యంలో సినీ పరిశ్రమ ఇక్కడ ఉంటేనే సమంజసంగా ఉంటుందని భావిస్తున్నామని సిఎం చెప్పారు.

ఒకప్పుడు తెలుగు చలనచిత్ర పరిశ్రమ హైదరాబాదులో నిలదొక్కుకునేలా అక్కడ అన్ని మౌలిక సదుపాయాలను కల్పించామని, ఇప్పుడు సొంత రాష్ట్రానికి వస్తామని పరిశ్రమలోని అత్యధికుల నుంచి వస్తున్న వినతుల్ని దృష్టిలో ఉంచుకుని మళ్లీ ఇక్కడ పరిశ్రమను అభివృద్ధి చేసే బాధ్యతను తీసుకున్నామని ముఖ్యమంత్రి చెప్పారు. సహజ సౌందర్యానికి పెట్టింది పేరైన విశాఖ, గోదావరి జిల్లాలు గతంలోనే తెలుగు, తమిళ సినిమాల షూటింగులకు చిరునామాగా ఉండేవని గుర్తుచేశారు. విశాఖలో సినీ స్టూడియోలు నిర్మించేందుకు ఇప్పటికే అనేకమంది ముందుకు రావడం సంతోషదాయకమని చెప్పారు.

విశాఖ, అమరావతిలో పరిశ్రమ ఎక్కడికి తరలివచ్చినా ఇబ్బంది లేదని, విశాఖ బ్యుటిఫుల్ రెడీమేడ్ సిటీ అయితే, అమరావతి ఫ్యూచర్ సిటీ అని ముఖ్యమంత్రి అభివర్ణించారు. ఏపీ ప్రజానీకం సృజనశీలురని, ప్రపంచగమనాన్ని అర్ధం చేసుకొని మార్పులను ముందుగానే పసిగట్టి అవకాశాలను ఒడిసి పట్టుకుంటారని చెప్పారు. చలనచిత్ర పరిశ్రమలో ఉన్నవారంతా కొత్త రాష్ట్రంలో అవకాశాలను అందిపుచ్చుకోవాలన్నదే తన అభిలాష అని సిఎం పేర్కొన్నారు. టాలీవుడ్‌లో పనిచేసే సాంకేతిక నిపుణులు తమ రంగంలోనే కాకుండా ఇతర రంగాలలో పనిచేయడానికి సిద్ధంగా ఉంటారా? అని ముఖ్యమంత్రి ఈ సందర్భంగా సినీ ప్రముఖులను ప్రశ్నించారు. వేర్వేరు రంగాలలో తమ సృజనను ప్రదర్శించి రాజధాని తరహా భారీ నిర్మాణాల్లో భాగస్వాములు కావాలని కోరారు.

త్వరలో ఫిలిం డెవలప్‌మెంట్ కార్పొరేషన్‌కు పూర్తిస్థాయి పాలకవర్గాన్ని నియమిస్తామని చంద్రబాబు చెప్పారు. తక్కువ బడ్జెట్ సినిమాలకు పన్ను రాయితీ ఇవ్వాలన్న అంశాన్ని పరిశీలిస్తున్నట్టు ఆయన వెల్లడించారు. పరిశ్రమ శ్రేయస్సును దృష్టిలో ఉంచుకుని త్వరలో ఈ విషయమై తగిన నిర్ణయం తీసుకుంటామని ఆయన పేర్కొన్నారు.

జనవరిలో నంది అవార్డుల ప్రదానోత్సవం

2014, 2015, 2016 సంవత్సరాలకు గాను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ నంది పురస్కారాల ఎంపిక జాబితాలను జ్యూరీ బృందాలు తొలుత ముఖ్యమంత్రికి అందించాయి. మూడేళ్ల జ్యూరీలకు నేతృత్వం వహించిన గిరిబాబు, జీవిత, పోకూరి బాబురావు ఈ సందర్భంగా ఎంపికచేసిన వారి పేర్లను ముఖ్యమంత్రికి చదివి వినిపించారు. విజేతల ఎంపిక నిష్ఫాక్షికంగా జరిగిందని సీనియర్ నటుడు గిరిబాబు చెప్పారు. జనవరి మాసంలో నంది చలనచిత్ర పురస్కారాల ప్రదానోత్సవాన్ని నిర్వహించాలని ఈ సమావేశంలో ప్రాథమికంగా నిర్ణయించారు. అంతకుముందు సినీ నిర్మాత సురేశ్ బాబు నేతృత్వంలో మరో కమిటీ ఎన్టీఆర్ పురస్కారానికి ఎంపికచేసిన వారి వివరాలతో ఒక జాబితాను ముఖ్యమంత్రికి అందించింది.

గరుడ వేగ కథ చెప్పిన జీవిత!

ముఖ్యమంత్రి చంద్రబాబును కలిసిన వారిలో సినీ హీరో నందమూరి బాలకృష్ణ, మురళీమోహన్, అంబికా కృష్ణ, ఎఫ్‌డీసీ మేనేజింగ్ డైరెక్టర్ వెంకటేశ్వర్, కళ్లు రఘు, జర్నలిస్టు ప్రభు, ఊహ, సీనియర్ నటి ప్రభ, ఫిలిం డెవలప్‌మెంట్ కార్పొరేషన్ మేనేజింగ్ డైరెక్టర్ ఎస్ వెంకటేశ్వర్ తదితరులు ఉన్నారు. తన భర్త రాజశేఖర్ హీరోగా ఇటీవల విజయవంతమైన చిత్రం ‘గరుడవేగ’ చూడాలని నటి, దర్శకురాలు జీవిత ముఖ్యమంత్రిని కోరారు. ఆ సినిమా కథాంశం ఏమిటని ముఖ్యమంత్రి ఆసక్తిగా అడిగి ఆమె నుంచి వివరాలు తెలుసుకున్నారు.

Happy
Happy
100 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Leave a Reply