అమరావతి, విశాఖ గ్రీన్ ఫీల్డ్ ఎయిర్ పోర్టులలో భాగస్వామ్యం

0 0
Read Time:3 Minute, 49 Second
‘ఎమిరేట్స్’ గ్రూపు అధికారులకు చంద్రబాబు ఆహ్వానం..

అమరావతి, విశాఖలను ఎయిర్‌లైన్స్ హబ్‌గా చేసుకోవాలని దుబాయ్‌ ‘ఎమిరేట్స్’ గ్రూపును ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆహ్వానించారు. గురువారం విజయవాడ క్యాంపు కార్యాలయంలో ఎమిరేట్స్ ప్రతినిధులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించిన ముఖ్యమంత్రి ఆంధ్రప్రదేశ్–దుబాయ్ మధ్య విమాన సర్వీసులు పెంపు, అమరావతి-విశాఖ గ్రీన్ ఫీల్డ్ ఎయిర్‌పోర్టుల అభివృద్ధిలో భాగస్వామ్యం వంటి తదితర అంశాలపై చర్చించారు. ముఖ్యమంత్రి ప్రతిపాదనలకు ‘ఎమిరేట్స్’ గ్రూప్ ఎయిరోపొలిటికల్ ఎఫైర్స్ డివిజినల్ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ అద్నాన్ ఖాజిమ్ సానుకూలంగా స్పందించారు. త్వరలో ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక బృందాన్ని పంపి పెట్టుబడులకు వున్న అవకాశాలను పరిశీలిస్తామని చెప్పారు.

ఈనెల 22న తన యూఏఈ పర్యటన సమయంలో ముఖ్యమంత్రి చంద్రబాబుతో దుబాయ్ సివిల్ ఏవియేషన్ అథారిటీ సీఈవో షేక్ అహ్మద్ బిన్ సయీద్ అల్ మక్థూమ్‌ భేటీ అయ్యేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. దుబాయ్ రాజవంశీకునికి సమీప బంధువైన మక్థూమ్ ఎమిరేట్స్ సంస్థకు చైర్మన్‌గానూ వ్యవహరిస్తున్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు పర్యటనలో ఏపీ ప్రభుత్వ ప్రతిపాదనలపై ఎమిరేట్స్ తుది నిర్ణయం తీసుకుంటుంది.

రాష్ట్రంలో విమానయానరంగ అభివృద్ధికి విస్తృత అవకాశాలు వున్నాయని, ముఖ్యంగా మధ్య తరగతి ప్రజలు విమాన ప్రయాణంపై ఆసక్తి చూపిస్తుండటం ఈ రంగం ఎదుగుదలను సూచిస్తోందని ‘ఎమిరేట్స్’ ప్రతినిధులతో ముఖ్యమంత్రి చెప్పారు. విమాన ప్రయాణికుల వృద్ధిలో ఆంధ్రప్రదేశ్ దేశంలోనే ముందుందని అన్నారు. భారత ప్రభుత్వం ‘ఎయిర్ ఇండియా’లో పెట్టుబడులను ఉపసంహరించుకునే యత్నాల్లో వుండటం ప్రైవేట్ ఎయిర్‌లైన్స్ సంస్థలకు సువర్ణావకాశమని చెప్పారు.

దుబాయ్ ప్రభుత్వంతో తమకు గత 20 ఏళ్లుగా మంచి సంబంధాలు వున్నాయని, హైదరాబాద్ అభివృద్ధిలో దుబాయ్ భాగస్వామి అయ్యేలా స్నేహసంబంధాలు కొనసాగించామని ముఖ్యమంత్రి ఈ సందర్భంగా గుర్తు చేశారు. ఇప్పుడు నవ్యాంధ్రప్రదేశ్ అభివృద్ధికి, అమరావతి నిర్మాణంలోనూ సహాయ సహకారాలు అందించాలని కోరారు. రాష్ట్ర ప్రభుత్వంపై నమ్మకంతో సింగపూర్ ప్రభుత్వం అమరావతిలో పెద్దఎత్తున పెట్టుబడులు పెడుతున్న విషయాన్ని ప్రస్తావించారు. వీడియో కాన్ఫరెన్స్‌లో ముఖ్యమంత్రి కార్యదర్శి ఎం. గిరిజా శంకర్, ముఖ్యమంత్రి అదనపు కార్యదర్శి ఏవీ రాజమౌళి, సింగపూర్ ప్రభుత్వ ప్రతినిధి రఘు, పెన్సిల్వేనియా రాయబారి కనికా చౌదరి పాల్గొన్నారు.

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Leave a Reply