’అమెరికాలో ఉద్యోగం’తో ఆగిపోవద్దు.. మీరే పారిశ్రామికవేత్తలు కావాలి

2 0
Read Time:6 Minute, 9 Second
షికాగో సమావేశంలో ముఖ్యమంత్రి చంద్రబాబు పిలుపు

అమెరికాలో ఉద్యోగం… మన రాష్ట్రంలో చాలా మందికి కల. మరి అమెరికా వెళ్ళి ఉద్యోగాల్లో స్థిరపడినవాళ్ళ మాటేమిటి? వారికి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు సరికొత్త సందేశం ఇచ్చారు. ’అమెరికా ఉద్యోగం’తో సంతృప్తి చెందవద్దన్నది ఆయన మాట. పారిశ్రామికవేత్తగా ఎదిగి ఒక్కొక్కరూ మరో పదిమందికి ఉద్యోగాలు ఇవ్వాలని, సంపద సృష్టించే స్థాయికి ఎదగాలని ముఖ్యమంత్రి ప్రవాసాంధ్ర ఐటీ ఉద్యోగులకు పిలుపునిచ్చారు.

పెట్టుబడుల సాధన లక్ష్యంగా మరోసారి అమెరికాలో పర్యటిస్తున్న ముఖ్యమంత్రి తొలిరోజు షికాగోలో గ్లోబల్ తెలుగు ఎంటర్ ప్రెన్యూర్స్ నెట్వర్క్ (జీ టెన్) ఏర్పాటు చేసిన ఐటి కంపెనీల ప్రతినిధుల సమావేశంలో మాట్లాడారు. ఎనభై కంపెనీల ప్రతినిధులు పాల్గొన్న ఈ సదస్సులో ముఖ్యమంత్రి మాట్లాడుతూ ప్రవాసాంధ్ర ఐటీ నిపుణులు రాష్ట్రానికి వచ్చి పెట్టుబడులు పెట్టాలని సూచించారు.

మీరు అక్కడికి వచ్చి పెట్టుబడులు పెట్టడానికి ఎలాంటి ఇబ్బందీ లేదు. ఒకవేళ ఏవైనా ఆటంకాలు ఎదురైనా నేరుగా నాతో చెప్పవచ్చు. తక్షణమే వాటిని పరిష్కరిస్తా’.

మనమంతా మన మాతృ రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ రుణం తీర్చుకోవాలి. జన్మభూమికి ఎంతో కొంత చేయాలి. పుట్టిన గడ్డకు తిరిగి ఎంతో కొంత ఇవ్వాలి. అదే సమయంలో మీరు అమెరికా సమాజానికి కూడా తోడ్పాటునందించాలి. ఎందుకంటే అవకాశం ఇచ్చిన ఆతిధ్య దేశాన్ని మరవరాదు’.

అని ముఖ్యమంత్రి తెలుగువారిని ఉద్దేశించి అన్నారు. ‘ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్‌’లో ఏపీ అగ్రగామిగా ఉందని గుర్తు చేశారు. ప్రజా సమస్యల తక్షణ పరిష్కారానికి తాము ఆంధ్రప్రదేశ్ లో 1100 నెంబరుతో పరిష్కార వేదిక ఏర్పాటుచేశామని తెలిపారు.

‘ఆనాటి నా నిర్ణయంతో ఐటీలో హవా’

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ల్రంలో తాను ముందు చూపుతో వ్యవహరించడంవల్లనే హైదరాబాద్ నగరంలో ఐటీ అభివృద్ధి చెందిందని, నాలెడ్జ్ ఎకానమీ ఫలితాలు ఇప్పుడు కనిపిస్తున్నాయని చంద్రబాబు పేర్కొన్నారు. అప్పటికి ఇంకా ఐటీ, ఇంటర్నెట్ ఉధృతి ప్రారంభం కాలేదని, ఐటీకి ఐకాన్ బిల్డింగ్ నిర్మించాలని ఆరోజుల్లోనే స్థిరంగా నిర్ణయించుకున్నానని, ఆ నిర్ణయమే ఆరోజు తెలుగువారి ఐటీ విప్లవానికి నాందిగా నిలిచిందని చంద్రబాబు వివరించారు.

రాష్ట్రంలో అప్పుడున్న 30 ఇంజనీరింగ్ కళాశాలల సంఖ్యను 300కు పెంచామని, ఆ ఫలితాలు ఇప్పుడు ఇక్కడ (అమెరికాలో) చూస్తున్నానని ఆయన సంతోషం వ్యక్తం చేశారు. ’షికాగోలో మిమ్మల్ని చూస్తుంటే నేను హైదరాబాదులో ఉన్నానా, లేక విజయవాడలో ఉన్నానా అని ఆశ్చర్యం కలుగుతోంది’ అని చంద్రబాబు వ్యాఖ్యానించారు. ప్రపంచం నలుమూలలా ఎక్కడ చూసినా తెలుగువారు వేల సంఖ్యలో ఉన్నారని, ప్రత్యేకించి ఐటీలో హవా కొనసాగిస్తున్నారని ముఖ్యమంత్రి కొనియాడారు.

భారతదేశం సహజ వనరులు, మానవ వనరులు పుష్కల స్థాయిలో ఉన్న దేశమని, మనవాళ్లే ఇక్కడ ఎక్కువగా ఎంటర్‌ప్రెన్యూర్లుగా ఎదగడం తనకెంతో ఎంతో సంతోషాన్ని కలిగిస్తోందని చంద్రబాబు అన్నారు. తెలుగువారు బాగా కష్టపడి సంపద సృష్టించి విశ్వ అభివృద్ధికి తోడ్పడాలని కోరుకుంటున్నానని, రాష్ట్రంలో ప్రజలంతా ప్రభుత్వ పక్షానే ఉన్నారని, అందుకు నిదర్శనమే నంద్యాల, కాకినాడ ఎన్నికలని చంద్రబాబు చెప్పారు. తమకు ఈ ఎన్నికల్లో చాలా స్పష్టమైన మద్దతు లభించిందని సీఎం వివరించారు.

అమెరికా అంతటా ఆంధ్రా చేపలు

రాష్ట్రంలో సూక్ష్మ సేద్యానికి, ఉద్యానపంటలకు అత్యధిక ప్రాధాన్యం ఇస్తున్నామని ముఖ్యమంత్రి చంద్రబాబు చెప్పారు. అమెరికా అంతటా ఆంధ్రప్రదేశ్ నుంచి వచ్చిన చేపలు వినియోగం జరిపే రోజు ఎంతో దూరంలో లేదన్నారు. తాము వ్యవసాయ రంగంపై ప్రత్యేక దృష్టి పెట్టామని, రూ. 24 వేల కోట్ల రుణ మాఫీ చేసి దేశంలో ఒక చరిత్ర సృష్టించామని, ఇది భారతదేశ చరిత్రలో అతిపెద్ద రుణమాఫీగా నిలిచిపోయిందని సీఎం పేర్కొన్నారు. వచ్చే నెలలో బిల్, మిలిందా గేట్స్ ఏపీకి వస్తున్నారంటూ, వారి పర్యటన రాష్ట్రంలో వ్యవసాయ దిగుబడులకు మంచి ఊతం ఇస్తుందని విశ్వసిస్తున్నట్లు చంద్రబాబు అన్నారు.

 

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Leave a Reply