‘అమెరికా ఫస్ట్’ కాదు… దేశాల బ్రాండ్ ర్యాంకుల్లో 6వ స్థానం

3 0
Read Time:5 Minute, 56 Second
మొదటి స్థానంనుంచి దిగజారుడు..

‘ట్రంప్ ఎఫెక్ట్’ అంటున్న నిపుణులు
గతంలో బుష్ 2వ టర్మ్ లో ఇలాగే…!

‘అమెరికా ఫస్ట్’ అని ఆ దేశ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఎంత మొత్తుకుంటున్నా ప్రపంచ ర్యాంకుల్లో మాత్రం అందుకు భిన్నమన ఫలితాలు వస్తున్నాయి. గతంలో ఒకటో స్థానంలో ఉన్నచోట కూడా అమెరికా స్థానం దిగజారుతోంది. ఇందుకు తాజా ఉదాహరణ… నేషన్ బ్రాండ్స్ ఇండెక్స్ (ఎన్ బిఐ)లో అమెరికా స్థానం. గత ఏడాది ఈ ర్యాంకుల్లో మొదటి స్థానంలో ఉన్న అగ్ర రాజ్యం ఈసారి ఏకంగా ఆరో స్థానానికి పడిపోయింది. జర్మనీలోని మార్కెట్ రీసెర్చ్ సంస్థ జీఎఫ్ కె 2017 నేషన్ బ్రాండ్ ఇండెక్స్ ను సోమవారం విడుదల చేసింది.

జీఎఫ్ కె బ్రాండ్ ఇండెక్స్ రిపోర్టులో మొత్తం 50 దేశాలకు ర్యాంకులు ఇవ్వగా జర్మనీ మొదటి స్థానంలో నిలిచింది. ఈ దేశం గత ఏడాది ర్యాంకుల్లో రెండో స్థానంలో నిలిచింది. గత ఏడాది మొదటి స్థానంలో ఉన్న అమెరికాను వెనక్కు నెట్టి జర్మనీ, ఫ్రాన్స్, యునైటెడ్ కింగ్డమ్, కెనడా, జపాన్ మొదటి ఐదు స్థానాలను సొంతం చేసుకున్నాయి. వీటిలో ఫ్రాన్స్, జపాన్ మంచి ప్రగతిని సాధించాయి. ఫ్రాన్స్ గత ఏడాది ఐదో ర్యాంకును పొందగా ఇప్పుడు రెండో స్థానానికి ఎగబాకిింది. 2016లో ఏడో స్థానంలో ఉన్న జపాన్ 2017లో నాలుగో ర్యాంకుకు మెరుగైంది. ఇటలీ 6వ స్థానంనుంచి ఏడో స్థానానికి పడిపోగా స్విట్జర్లాండ్, ఆస్ట్రేలియా, స్వీడన్ తర్వాత మూడు స్థానాల్లో యధాతథంగా  కొనసాగుతున్నాయి.

సర్వే ఆధారంగా…

జీఎఫ్ కె సంస్థ 50 దేశాల ప్రతిష్ఠను ఆరు అంశాల ఆధారంగా లెక్కించింది. ప్రజలు, పాలన, ఎగుమతులు, సంస్కృతి-వారసత్వం, టూరిజం, పెట్టుబడులు-వలసలు అనే అంశాలను ప్రామాణికంగా తీసుకుంది. ఈ ఏడాది జూలై 7-25 తేదీల మధ్య 20 దేశాల్లోని 20,185 మంది అభిప్రాయాలను సేకరించి ఈ నివేదికను రూపొందించింది. జర్మనీ ఒక్క టూరిజం విభాగంలో మినహా మిగిలిన అన్ని అంశాల్లోనూ మొదటి స్థానంలోనే ఉండటం ద్వారా ఓవరాల్ ర్యాంకుల్లో నెంబర్ వన్ అయింది.

టాప్ 10లో ఆసియానుంచి ఒక్క జపాన్ మాత్రమే ఉంది. ఆ దేశం కూడా టాప్ 5 లోకి మొదటిసారిగా అడుగు పెట్టింది. నాలుగో స్థానాన్ని కెనడా, జపాన్ పంచుకున్నాయి. బ్రెగ్జిట్ నేపథ్యంలో యుకెపై భిన్నాభిప్రాయాలున్నా మూడో స్థానాన్ని కాపాడుకుంది.

టాప్ 10లో దిగజారింది అమెరికానే

2017లో టాప్ 10 దేశాల్లో బాగా దిగజారింది అమెరికా ఒక్కటే కావడం గమనార్హం. స్కోరు తగ్గింది కూడా అమెరికా ఒక్క దేశానికే. పరిపాలనాంశాలే దీనికి ప్రధాన కారణంగా పేర్కొన్నారు. ‘అమెరికా ఫస్ట్’ అంటూ ట్రంప్ ఇస్తున్న రాజకీయ సందేశం ‘ట్రంప్ ఎఫెక్ట్’గా ఆ దేశ ర్యాంకులో ప్రతిఫలించిందని రిపోర్టు రూపకల్పనలో భాగస్వాములైన నిపుణులు వ్యాఖ్యానించారు. అయితే, సర్వేలో పాల్గొన్న అమెరికన్ల అభిప్రాయంలో మాత్రం ఆ దేశం నిరుటికంటే బెటర్ గా ఉంది. అమెరికా ప్రతిష్ఠ గతంలో జార్జ్ వాకర్ బుష్ రెండోసారి అధ్యక్షుడైన తర్వాత ఇదే విధంగా పడిపోయిందని నిపుణులు గుర్తు చేస్తున్నారు. అప్పుడు అమెరికా ఏడో స్థానానికి పరిమితమైంది. మరి ట్రంప్ హయాంలో 2018లో అమెరికా ప్రతిష్ఠ మరింత పడిపోతుందో.. లేక మెరుగవుతుందో వేచి చూడాలి.

నేషన్ బ్రాండ్ 50లో ఉన్న దేశాలు

ఉత్తర అమెరికా : కెనడా, అమెరికా.

పశ్చిమ యూరప్ : ఆస్ట్రియా, బెల్జియం, డెన్మార్క్, ఫిన్లాండ్, ఫ్రాన్స్, జర్మనీ, గ్రీస్, హాలాండ్, ఐర్లాండ్, ఇటలీ, ఉత్తర ఐర్లాండ్, నార్వే, స్కాట్లాండ్, స్పెయిన్, స్వీడన్, స్విట్జర్లాండ్, యుకె.

తూర్పు, మధ్య యూరప్ : చెక్ రిపబ్లిక్, హంగరీ, పోలాండ్, రష్యా, టర్కీ, ఉక్రెయిన్.

ఆసియా పసిఫిక్ : ఆస్ట్రేలియా, చైనా, ఇండియా, ఇండొనేషియా, జపాన్, న్యూజీలాండ్, సింగపూర్, దక్షిణ కొరియా, తైవాన్, థాయ్ లాండ్.

లాటిన్ అమెరికా : అర్జెంటీనా, బ్రెజిల్, చిలీ, కొలంబియా, ఈక్వెడార్, మెక్సికో, పెరు.

మధ్య ప్రాఛ్యం, ఆఫ్రికా : బోట్సువానా, ఈజిప్టు, కెన్యా, నైజీరియా, ఖతార్, సౌదీ అరేబియా, దక్షిణాఫ్రికా, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్.

Happy
Happy
100 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Leave a Reply