అవినీతిలో ఎడ్యూరప్ప ప్రభుత్వం నెంబర్ 1… నోరు జారిన అమిత్ షా

కర్నాటక వికాసానికి బీజేపీ ప్రభుత్వం మద్ధతివ్వలేదని కూడా వ్యాఖ్య
రాహుల్ సెటైర్లు… ట్విట్టర్లో విసుర్లు… తలపట్టుకున్న కన్నడ కమలదళం

అమిత్ షా మాట్లాడనంతవరకు గొప్ప వ్యూహకర్తగా ప్రచారం సాగుతుంది. మీడియాతో మాట్లాడటం తక్కువ. మాట్లాడితే ఏమవుతుందో మంగళవారం బెంగళూరులో బయటపడింది. భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడు నోరు జారి సొంత పార్టీ పాలననే అత్యంత అవినీతికరమైనదిగా ఉద్ఘాటించారు. అది విని ప్రక్కన ఉన్న బీజేపీ నేతలు అవాక్కయితే… కర్నాటకలో కాంగ్రెస్ పార్టీ నేతలు సెటైర్లు వేస్తున్నారు.

ఎన్నికల ప్రచారంకోసం కర్నాటక వచ్చిన అమిత్ షా మంగళవారం ఎన్నికల షెడ్యూలు వెలువడిన నేపథ్యంలో విలేకరులతో మాట్లాడారు. కర్నాటకలో ఎడ్యూరప్ప నాయకత్వంలోని ప్రభుత్వానికే అవినీతిలో నెంబర్ 1 అవార్డు వస్తుందని అమిత్ షా వ్యాఖ్యానించారు. ఈ మాట విని ఆయనకు కుడివైపు ఉన్న ఎడ్యూరప్ప కంగారు పడగా… ఎడమవైపు కూర్చున్న మరో నేత వెంటనే చెవిలో గుసగుసలాడారు. దీంతో అమిత్ షా పొరపాటును సవరించుకున్నారు.

కర్నాటకలో గత ఐదేళ్ళుగా కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది. అంతకు ముందు ఎడ్యూరప్ప నాయకత్వంలో బీజేపీ రాష్ట్రాన్ని పాలించింది. దక్షిణ భారత దేశంలో బీజేపీ అధికారంలోకి వచ్చిన ఏకైక రాష్ట్రం కర్నాటక. ఆ పార్టీకి బలమైన నాయకుడు ఎడ్యూరప్ప. ఆయన ఓ సందర్భంలో పార్టీనుంచి గెంటివేతకు గురై తిరిగి చేరారు. ఇప్పుడు కూడా ఎడ్యూరప్ప సిఎం అభ్యర్ధిగానే బీజేపీ ఎన్నికలకు వెళ్తోంది. అదే విషయంలో అమిత్ షా కూడా ప్రకటించారు. అయితే, తడబడి అదే ఎడ్యూరప్ప పాలనను అత్యంత అవినీతికరమైనదిగా వ్యాఖ్యానించడం ఇప్పుడు కర్నాటకలో బీజేపీకి తిప్పలు తెచ్చింది.

కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ ఈ అవకాశాన్ని జారవిడుచుకోలేదు. వెంటనే స్పందించి అమిత్ షాపై సెటైర్ వేశారు. బీజేపీ అధ్యక్షుడు మంచి బహుమతి అందించడంతో కర్నాటకలో తమ ఎన్నికల ప్రచారానికి మంచి ప్రారంభం లభించిందని రాహుల్ ట్వీట్ చేశారు. ట్విట్టర్లో దానికి బాగా స్పందన వచ్చింది. కొందరైతే ఎడ్యూరప్పపై గతంలో వచ్చిన అవినీతి ఆరోపణలను ప్రస్తావించారు. ఇంకొందరు మరో వీడియో క్లిప్ పోస్ట్ చేశారు.

కర్నాటక వికాసానికి బీజేపీ ప్రభుత్వం మద్ధతు ఇవ్వలేదని షా చేసిన వ్యాఖ్యానం ఈ వీడియోలో ఉంది.

సామాజిక మాథ్యమాల్లో ఈ వీడియో క్లిప్పింగ్స్ హల్ చల్ చేస్తుంటే కన్నడనాట కమలదళం తలలు కొట్టుకుంటున్నారు. వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ తిరిగి విజయం సాధిస్తుందని ప్రీపోల్ సర్వే ఒకటి చెప్పిన మరుసటి రోజే.. అధికార పార్టీకి అస్త్రాలను అందించేలా సాక్షాత్తు బీజేపీ జాతీయ అధ్యక్షుడు మాట్లాడటం కమల దళానికి తలనొప్పి తెచ్చిపెట్టడమే కదా!

Related posts