ఆంగ్లంలో ఆంధ్ర విద్యార్ధులు అధ్వానం

1 0
Read Time:6 Minute, 30 Second
పాఠశాల స్థాయిలో పరిజ్ఞానం పూర్..
మన స్థానం 16 రాష్ట్రాల తర్వాతే..
సైన్స్ సబ్జెక్టులో 11, గణితంలో 6 స్థానాలు

మన రాష్ట్రంలోని పాఠశాలల్లో చదివే విద్యార్ధులకు వివిధ సబ్జెక్టులలో ఉన్న అవగాహనా స్థాయి ఎంత? దేశంలోని ఇతర రాష్ట్రాలతో పోలిస్తే మనమెక్కడ? ఈ ప్రశ్నలకు సాక్షాత్తు ప్రభుత్వం నుంచే నిరాశాపూరితమైన సమాధానం వస్తోంది. మన రాష్ట్రంలో పాఠశాల విద్యార్ధులు దేశంలోని మిగిలిన రాష్ట్రాలతో పోల్చుకుంటే ఇంగ్లీష్‌లో 17వ స్థానం, గణితంలో 6వ స్థానం, సైన్సులో 11వ స్థానంలో ఉన్నారట. ఈ విషయాన్ని విద్యా శాఖ అధికారులే గురువారం సచివాలయంలో ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు వద్ద జరిగిన తమ  శాఖ సమీక్షా సమావేశంలో వెల్లడించారు. దీనిపై అసంతృప్తి వ్యక్తం చేసిన ముఖ్యమంత్రి, 2022 నాటికి ఇంగ్లీష్, గణితం, సైన్సు సబ్జెక్టులలో రాష్ట్ర విద్యార్ధులు దేశంలోనే మొదటి స్థానాల్లో నిలిచేలా తీర్చిదిద్దాలనే లక్ష్యాన్ని నిర్దేశించారు. ఇందుకోసం ఆగ్మెంటెడ్ రియాలిటీ విధానంలో విద్యార్ధులకు డిజిటల్ కంటెంట్‌ను సాధ్యమైనంత వేగంగా అందుబాటులోకి తీసుకురావాలని సూచించారు.

ఈ ఏడాది అక్టోబర్ నెలాఖరు వరకు 5,582 ఉపాధ్యాయ పోస్టులు ఖాళీగా వున్నాయని, వచ్చే ఏడాది మే నాటికి మరో 501 పోస్టులు ఖాళీ అవుతాయని అధికారులు ఈ సందర్భంగా సిఎంకు చెప్పారు. రాష్ట్రంలోని 9వ తరగతి విద్యార్ధులకు ఓడీఎఫ్‌పై ప్రాజెక్టు వర్క్‌ను ప్రవేశపెట్టామని తెలిపారు. సామాజికసేవ, సచ్ఛాంధ్రప్రదేశ్ కార్యక్రమాలు రెండింటిలో కూడా విద్యార్ధులను మరింతగా భాగస్వాములు చేయాలని ముఖ్యమంత్రి సూచించారు. రానున్న రోజుల్లో పాఠ్యాంశాల్లో ఎలాంటి మార్పులుచేర్పులు తీసుకురావాలనే దానిపై అధ్యయనం జరగాలని పేర్కొన్నారు. ప్రభుత్వ-ప్రైవేటు విద్యాసంస్థల ఫలితాలు, ప్రమాణాలు బేరీజు వేయాలని చెప్పారు.

ప్రైవేట్ విద్యాసంస్థల్లోనూ బయోమెట్రిక్ అటెండెన్స్

రాష్ట్రంలోని 41,601 పాఠశాలలు, 1,66,931 మంది ఉపాధ్యాయులు, 34,04,109 విద్యార్ధులను ‘ఇ-హాజరు’ పరిధిలోకి తీసుకొచ్చామని అధికారులు ముఖ్యమంత్రి దృష్టికి తీసుకువచ్చారు. ఉపాధ్యాయుల ‘ఇ-హాజరు’లో 82.49 శాతంతో శ్రీకాకుళం జిల్లా ముందుండగా, 70.67 శాతం హాజరుతో ప్రకాశం జిల్లా చివరన వుందని తెలిపారు. ప్రైవేటు పాఠశాలల్లోనూ బయోమెట్రిక్ అటెండెన్స్ విధానం ప్రవేశ పెట్టాలని ముఖ్యమంత్రి సమావేశంలో సూచించారు.

రూ. 4,848 కోట్లతో మౌలిక వసతులు

2019-20 కల్లా ప్రభుత్వ పాఠశాలల్లో 33,145 అదనపు తరగతి గదులు, 21,249 పాఠశాలలకు ప్రహరీగోడలు నిర్మించడంతో సహా, 40,665 పాఠశాలలకు ఫర్నిచర్ సౌకర్యం కల్పించాలని ముఖ్యమంత్రి నిర్ణయించారు. పాఠశాలల్లో మౌలిక వసతుల కల్పన కోసం రూ. 4,848 కోట్ల వ్యయం అవుతుందని అంచనా వేశారు. మధ్యాహ్న భోజన పథకానికి 100 శాతం గ్యాస్ కనెక్షన్లు ఇవ్వడమే కాకుండా వాటిని పూర్తి స్థాయిలో వినియోగించేలా చూడాలని ముఖ్యమంత్రి అధికారులకు చెప్పారు. మధ్యాహ్న భోజన పథకానికి గ్యాస్ వినియోగించకపోతే చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఇప్పటివరకు 2,399 పాఠశాలల్లో డిజిటల్ తరగతి గదులు ఏర్పాటు చేయగా, మిగిలిన చోట కూడా వచ్చే ఏడాది జనవరి 15 కల్లా సిద్ధం చేయాలని చెప్పారు.

క్యాంపస్‌లకు 100 ఎంబీపీఎస్ వేగంతో ఇంటర్నెట్

రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లోనూ వైఫై ఏర్పాటు చేయాలని చెప్పిన ముఖ్యమంత్రి.. అన్ని విశ్వవిద్యాలయాల క్యాంపస్‌లకు ఏపీ ఫైబర్ గ్రిడ్ ద్వారా 100 ఎంబీపీఎస్ వేగంతో ఇంటర్నెట్ సదుపాయం కల్పించాలని అన్నారు. అలాగే అన్ని కళాశాలలకు వర్చువల్ క్లాస్ రూముల కోసం 10 ఎంబీపీఎస్ వేగం కలిగిన ఇంటర్నెట్ కనెక్షన్లు ఇవ్వాలని చెప్పారు. రాష్ట్రంలోని విశ్వవిద్యాలయాలు జాతీయ, అంతర్జాతీయ ర్యాంకులను మరిన్ని సాధించేలా కృషి చేయాలని అన్నారు.

రాష్ట్రంలోని మొత్తం 447 ప్రభుత్వ జూనియర్ కళాశాలకు ల్యాబ్‌తో పాటు తాగునీటి సదుపాయం కల్పించామని, 402 కళాశాలకు సొంత భవనాలు వుండగా 45 కళాశాలలకు సొంత భవనాలు నిర్మించాల్సి వుందని అధికారులు ముఖ్యమంత్రికి వివరించారు. పదో తరగతి ఉత్తీర్ణత తర్వాత ఎంతమంది విద్యార్ధులు ఇంటర్మీడియట్, తత్సమాన కోర్సులు చదువుతున్నారో గణాంకాలు సేకరించాలని ముఖ్యమంత్రి అధికారులతో అన్నారు.

Happy
Happy
0 %
Sad
Sad
100 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Leave a Reply