ముంబైలో తొలి కేంద్రం ఏర్పాటయ్యే సమయానికి దావోస్ లో చంద్రబాబు చర్చలు
ఏడాది చివరికల్లా ఏర్పాటవుతుందన్న అలీబాబా క్లౌడ్ అధ్యక్షుడు
ఇంకా త్వరగా ఏర్పాటు చేయాలని సిఎం విన్నపం
ఈ కామర్స్ దిగ్గజ సంస్థ ఆలీబాబా ఇండియాలో క్లౌడ్ కంప్యూటింగ్ వ్యాపారాన్ని ప్రారంభించింది. మొదటి క్లౌడ్ డేటా సెంటర్ ను తాజాగా ముంబైలో ఏర్పాటు చేసింది. ఇక్కడ డేటా సెంటర్ ప్రారంభం కావడానికి కొద్ది గంటల ముందు దావోస్ లో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఆలీబాబా క్లౌడ్ సంస్థ అధ్యక్షుడు సైమన్ హూతో సమావేశమయ్యారు. రెండో డేటా సెంటర్ ను ఆంధ్రప్రదేశ్ లో ఏర్పాటు చేయాలని కోరారు. దీనికి సైమన్ సై అన్నారని సమాచారం. ఇండియాలో తమ రెండో క్లౌడ్ డేటా సెంటర్ ఆంధ్రప్రదేశ్ లోనే ఏర్పాటవుతుందని, అదీ ఈ సంవత్సరమే చేస్తామని సైమన్ ముఖ్యమంత్రి చంద్రబాబుకు హామీ ఇచ్చారు.
ప్రపంచ ఆర్థిక వేదిక సదస్సులో పాల్గొనడానికి అధికారిక బృందంతో సహా ముఖ్యమంత్రి చంద్రబాబు దావోస్ వెళ్ళారు. అక్కడ ప్రపంచ ప్రఖ్యాత కంపెనీల అధిపతులతో సమావేశమవుతున్నారు. ఈ క్రమంలోనే అలీబాబా క్లౌడ్ అధ్యక్షుడు సైమన్ హూతో చర్చించారు. అలీబాబా గ్రూపుతో సమావేశమవ్వాలని ఎప్పటినుంచో ఆసక్తిగా ఉన్నట్టు హూతో చెప్పిన ముఖ్యమంత్రి…‘‘ఇప్పటివరకూ మీరు కేవలం ఈ కామర్స్ రంగంలో దిగ్గజాలని అనుకున్నాను. మీరు సాంకేతికతలో కూడా దిగ్గజాలని ఈరోజు తెలుసుకున్నాను’’ అని పేర్కొన్నారు.
దీనికి స్పందించిన సైమన్ ‘‘మేము ఇప్పటివరకూ ఈ కామర్స్ రంగంలో బలంగా ఉన్నాం. ఈ కామర్స్ డేటా ఆధారంగా సూక్ష్మ, మధ్య తరహా వ్యాపారవేత్తలకు ఎలాంటి తనఖా లేకుండా రుణాలు అందిస్తున్నాం. ఇప్పటికే చైనా లాజిస్టిక్స్ లో బలీయమైన శక్తిగా ఉన్నాం. రోజుకు 60 నుంచి 70 మిలియన్ల పార్శిళ్లు చేరవేస్తున్నాం.బిగ్ డేటాతో కూడిన క్లౌడ్ టెక్నాలజీ సేవల రంగంలో కూడా మేము ప్రవేశించాం. ప్రపంచ వ్యాప్తంగా ఒక మిలియన్ ఖాతాదారులకు మేము సేవలందిస్తున్నాం. ఆర్టిఫీషియల్ ఇంటిలిజెన్స్, డీప్ లెర్నింగ్ టెక్నాలజీస్ మా బలం’’ అని వివరించారు.
భారత దేశంలో తమ మొదటి డేటా సెంటర్ ను ప్రారంభిస్తున్నట్టు ఈ సమయంలోనే సైమన్ చెప్పారు. భారత్ లో విస్తరణ ఆకాంక్షను వ్యక్తం చేసిన సైమన్… రెండో సెంటర్ ఆంధ్రప్రదేశ్ లోనే ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు. రెండో సెంటర్ ఎప్పుడు ఏర్పాటు చేయాలనుకుంటున్నారని సీఎం అడిగిన ప్రశ్నకు ఈ ఏడాది చివరకు ఏర్పాటు చేస్తామని సైమన్ బదులిచ్చారు. ఏడాది చివరకు అంటే చాలా ఆలస్యమని, మరింత త్వరగా ఏర్పాటు చేయాలని సిఎం కోరారు. ‘‘మీ ఉత్సాహం, వేగవంతమైన నిర్ణయాలు తనను ముగ్దుడ్ని చేశాయి. మీ అభిమానిగా మార్చేశాయి. తప్పకుండా మీరు కోరిన విధంగా త్వరలో డేటా సెంటర్ ఏర్పాటు చేస్తాం’’ అని సైమన్ ముఖ్యమంత్రికి హామీ ఇచ్చారు.
చంద్రబాబుకు పొగడ్తలు
చంద్రబాబు ఒక రాజకీయ నాయకుడిగా కాక శాస్త్రవేత్తలా మాట్లాడుతున్నారని, అది తమను ఎంతగానో ఆకట్టుకుందని సైమన్ పశంసలు కురిపించారు. ‘‘మీరు ఇండియాలో సాంకేతికతకు ఆద్యులని, ఇ గవర్నెన్స్ పోషకులని తెలుసుకున్నాం. మీమీద గౌరవం రెట్టింపు అయింది’’ అని చెప్పారు. తయారీ రంగంలో ఉత్పత్తి సామర్థ్యం పెంచుకునేందుకు తాము సహాయ సహకారాలు అందిస్తున్నట్టు చెప్పారు. ‘‘డిజిటల్ ట్రాన్స్ఫర్మేషన్ లో కూడా పూర్తిగా సహాయ, సహకారాలు అందిస్తున్నాం. సంగీతం, సోషల్ మీడియా, టెలివిజన్ వంటి ఎంటర్టైన్మెంట్ రంగంలోకి కూడా మేము ప్రవేశించాం. తయారీ రంగంలో డేటా ఆధారిత సేవలు వంటి డిజిటల్ ట్రాన్స్ఫర్మేషన్ వైపు చైనా అడుగులు వేస్తోంది. డిజిటల్ ట్రాన్స్ఫర్మేషన్ విషయంలో చైనాలో మాదిరిగానే భారత వ్యా పారవేత్తలకు మేము తోడ్పాటు అందిస్తాం. మా అనుభవం భారత దేశానికి కూడా ఉపయోగపడుతుంది’’ అని సైమన్ వివరించారు.
ఐటీలో బలవంతులం..మాది రియల్ టైం గవర్నెన్స్
‘‘భారతీయులు ఐటీలో ఎంతో బలమైన వారు. ప్రపంచంలోని ప్రతి పదిమంది ఐటీ నిపుణుల్లో నలుగురు భారతీయులు ఉంటారు. ఆ నలుగురిలో ఒకరు ఆంధ్రప్రదేశ్ వారు అవడం మాకు గర్వకారణం. భారతీయులు ఇంగ్లీషు, గణితాలలో ఎంతో ప్రావీణ్యం కలిగి ఉంటారు. ఆ ప్రావీణ్యమే మమ్మల్ని బలమైన స్థానంలో నిలిపింది’’ అని చంద్రబాబు సైమన్ తో చెప్పారు. గతంలో వాజపేయి ప్రభుత్వంలో తాను టెలికాం రంగానికి అత్యంత ప్రాధాన్యత కల్పించేలా చేసానని, ఆ ప్రక్రియ ఐటీ రంగంలో అత్యంత పెద్ద మార్పును తీసుకొచ్చిందని, అమెరికా బయట మొట్టమొదటి మైక్రోసాఫ్ట్ డవలెప్మెంట్ సెంటర్ హైదరాబాద్ లో నెలకొల్పేలా కృషి చేసానని గత కాలపు కృషిని చంద్రబాబు వివరించారు.
కోటి ఇళ్ళకు ఇంటర్నెట్
‘‘కొన్ని రాజకీయ కారణాల వల్ల రాష్ట్ర విభజన జరిగింది. నూతన రాష్ట్రంలో 15 శాతం వృద్ధి లక్ష్యంగా పనిచేస్తున్నాం. మా రాష్ట్ర అభివృద్ధికి ఐఓటీ వంటి అన్ని నూతన సాంకేతిక పద్ధతులను అవలంబిస్తున్నాం. సాంకేతికత సహకారంతో ప్రజలకు మెరుగైన పాలన అందిస్తున్నాం. మా రాష్ట్రంలో ప్రతి ఇంటికీ 15 ఎంబీపీస్ వేగంతో ఇంటర్నెట్ అందిస్తున్నాం. మారుమూల ప్రాంతాల్లోని గృహానికి కూడా ఇంటర్నెట్ అందించాలనేది మా లక్ష్యం. ఇప్పటికి లక్షా 50 వేల గృహాలకు ఈ సౌకర్యం కల్పించాం. ఈ ఏడాది చివరికి 10 మిలియన్ గృహాలను అనుసంధానిస్తాం’’ అని చంద్రబాబు ప్రస్తుత పరిస్థితులను, ప్రగతిని వివరించారు. భూమిలో తేమ శాతం, వర్షపాతం, రియల్ టైంలో పంటల పర్యవేక్షణ వంటి అన్ని విషయాల్లో టెక్నాలజీని ఉపయోగిస్తున్నట్టు చెప్పిన చంద్రబాబు… ‘‘అలీబాబా సంస్థ మాతో కలిసి పనిచేయాలని కోరుకుంటున్నాం’’ అని ముక్తాయించారు.