ఐటీ పెట్టుబడులకు కేంద్రంగా ‘సిలికాన్ కారిడార్’
రాష్ట్రంలోని పాఠశాలల్లో ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ (ఐటీ) తరగతులు తప్పనిసరి చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. శనివారం ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు వద్ద జరిగిన రాష్ట్ర పెట్టుబడుల ప్రోత్సాహక మండలి (ఎస్ఐపిబి) సమావేశంలో ఈ ప్రతిపాదన ముందుకొచ్చింది. ముఖ్యమంత్రి తనయుడు, రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ ‘ఐటీ తప్పనిసరి’ ఐడియాను వెల్లడించారు.
డిజిటల్ లిటరసీని పెంచాలన్న రాష్ట్ర ప్రభుత్వ ప్రయత్నాల్లో ఇదీ భాగమని లోకేష్ చెప్పారు. పిల్లల్లో గ్యాడ్జెట్ల వినియోగంపై అవగాహన పెరగడానికి కూడా ‘ఐటీ తప్పనిసరి’ నియమం దోహదపడుతుందని లోకేష్ అభిప్రాయపడ్డారు. దీంతోపాటు రాష్ట్రంలో ‘సిలికాన్ కారిడార్’ ఏర్పాటు ప్రతిపాదనను కూడా లోకేష్ ముందుకు తెచ్చారు. రాష్ట్రంలో ఐటీ పెట్టుబడులకు కేంద్రంగా ఈ హబ్ ఉండాలని ఆయన పేర్కొన్నారు.
తన అమెరికా పర్యటన విజయవంతమైందన్న లోకేష్, ఆ వివరాలను ఎస్ఐపిబి సమావేశంలో వెల్లడించారు. గూగుల్ కంపెనీతో సహా పలు టెక్నాలజీ దిగ్గజాలతో భాగస్వామ్య ఒప్పందాలను కుదుర్చుకున్నట్టు లోకేష్ చెప్పారు.