ఆయన నలుగురిలో ఒక్కడు… ‘మంజునాథ్’పై ప్రభుత్వం

2 0
Read Time:7 Minute, 20 Second
మెజారిటీ సభ్యుల నివేదికే న్యాయబద్దం, రాజ్యాంగబద్ధం!
మంజునాథ్ ఆలస్యం చేయడంవల్లనే నేరుగా సభ్యుల నివేదిక

కాపు రిజర్వేషన్లపై బీసీ కమిషన్ ఛైర్మన్ గా సభ్యులందరి సంతకాలతో వారి అభిప్రాయాలను జోడించి తాను ఇచ్చేదే అసలైన నివేదిక అవుతుందని జస్టిస్ మంజునాథ్ చెబుతుంటే… ఆయన వాదనను ప్రభుత్వ వర్గాలు కొట్టిపారేస్తున్నాయి. కమిషన్ లో ఉన్న నలుగురు సభ్యులలో ఆయనా ఒకరని, అంతేగాని ఆయనకు ప్రత్యేక అధికారులేమీ ఉండవని అధికారులు చెబుతున్నారు. నలుగురిలో ముగ్గురు ఏకాభిప్రాయంతో నివేదిక సమర్పించినప్పుడు మెజారిటీ కాబట్టి చెల్లుబాటవుతుందని, ఛైర్మన్ ఒక్కడూ కాదన్నా సమస్యేమీ లేదని వారు ధీమా వ్యక్తం చేశారు. మంజునాథ్ తరహాలోనే ప్రభుత్వం కూడా బీసీ కమిషన్ చట్టాన్నే తమ వాదనకు దన్నుగా చూపడం విశేషం. బీసీ కమిషన్ చట్టం ప్రకారం ఛైర్మన్ కూడా ఒక సభ్యుడని… కాకుండా సమాన స్థాయి వ్యక్తులో మొదటివాడని ఓ అధికారి శనివారం వ్యాఖ్యానించారు.

కాపు రిజర్వేషన్ల అంశం బీసీ కమిషన్ ఛైర్మన్, సభ్యుల మధ్యనే అభిప్రాయ భేదాలకు కారణమైంది. ప్రభుత్వం నిర్దేశించిన అంశంవరకే రిజర్వేషన్ల నివేదికను పరిమితం చేయడానికి ఒప్పుకోని జస్టిస్ మంజునాథ్… ఈ విషయంలో మిగిలిన సభ్యులు తన అభిప్రాయాలకు భిన్నంగా సమర్పించిన నివేదికనూ జాప్యం చేసినట్టు చెబుతున్నారు. బీసీ కమిషన్ లో మిగిలిన ముగ్గరు సభ్యులు ఏకాభిప్రాయంతో రూపొందించిన నివేదికను ఆమోదించకుండా మంజునాథ్ తన వద్దనే మూడు వారాలు పెట్టుకున్నట్టు సమాచారం. దీంతో… ఇలా కుదరదని ఆ ముగ్గురు సభ్యులే నేరుగా శుక్రవారం మంత్రివర్గ సమావేశానికి హాజరై తమ నివేదికను సమర్పించారు.

కమిషన్ నివేదిక ఆలస్యమవుతుండటంతో గత కొంత కాలంగా ప్రభుత్వం కూడా అసంతృప్తితో ఉంది. గత ఏడాది జనవరిలో జస్టిస్ మంజునాథ్ ఛైర్మన్ గా కమిషన్ ఏర్పాటైంది. అందులో కొందరు సభ్యులను ఫిబ్రవరిలో నియమించారు. నివేదిక సమర్పణకు 8 నెలలు గడువు ఇస్తే ఇప్పటిదాకా 20 నెలలు గడిచాయి. మధ్యలో మూడుసార్లు ప్రభుత్వంనుంచి త్వరగా నివేదిక ఇవ్వాలని విన్నవించారు. మంత్రివర్గ సమావేశం తీర్మానం కూడా చేసింది. కమిషన్ కు అవసరమైన సమాచారాన్ని రాష్ట్ర ప్రభుత్వం ప్రజాా సాధికార సర్వే ద్వారా సేకరించి ఇచ్చింది. దానికి తోడు వివిధ శాఖలనుంచి కమిషన్ చాలా వివరాలు అడిగి తీసుకుంది.

సమాచారం అంతా పరిశీలించి క్షేత్ర స్థాయిలో పర్యటనలు చేసి వివిధ వర్గాల అభిప్రాాయాలనూ తీసుకున్నారు. ఇది పూర్తయి నెలలు గడుస్తున్నా నివేదిక ప్రభుత్వానికి అందలేదు. ఈ అంశంలో ఉన్న సున్నితత్వాన్ని, రాష్ట్ర అభివృద్ధి, శాంతిభద్రతలపై అది చూపుతున్న ప్రభావం తదితర అంశాలను ప్రభుత్వం కమిషన్ దృష్టికి తీసుకెళ్లింది. అయితే, రిజర్వేషన్ డిమాండ్లు, పరిష్కారాలపై జస్టిస్ మంజునాథ్ రాష్ట్ర ప్రభుత్వం కమిషన్ టర్మ్స్ ఆఫ్ రిఫరెన్స్ లో నిర్దేశించిన అంశంవరకే పరిమితం కాదలచుకోలేదు. రిజర్వేషన్లపై హైకోర్టు సీనియర్ న్యాయమూర్తిగా తాను గమనించిన అంశాలను, ఇక్కడ రాష్ట్రంలో ఉన్న పరిస్థితులను భేరీజు వేసుకొని సొంతగా నివేదికకు కొన్ని ప్రమాణాలను నిర్దేశించుకున్నట్టు సమాచారం. మొత్తం బీసీ రిజర్వేషన్ల ఛట్రాన్నే కదిపేలా ఆయన ఆలోచనలున్నట్టు చెబుతున్నారు.

ఇక్కడే మిగిలిన సభ్యులు ఛైర్మన్ తో విభేదించారు. కాపు రిజర్వేషన్లకే పరిమితమై నివేదిక ఇవ్వాలన్నది వారి అభిప్రాయంగా ఉంది. ఆమేరకు నివేదికను రూపొందించి జస్టిస్ మంజునాథ్ అంగీకారంకోసం మూడు వారాలుగా వేచి ఉన్నారు. ఆయననుంచి స్పందన రాకపోవడంతో నేరుగా ప్రభుత్వానికి తామే మెజారిటీ అభిప్రాయంతో నివేదికను సమర్పించాలన్న నిర్ణయానికి వచ్చారు. శుక్రవారం అదే జరిగింది. వారి చర్యను ప్రభుత్వం గట్టిగా సమర్ధిస్తోంది. సుప్రీంకోర్టులో అయినా ఒక బెంచ్ లో ఉన్న మెజారిటీ న్యాయమూర్తులు ఏది చెబితే అదే తీర్పు అవుతుందని ఓ ఉన్నతాధికారి శనివారం వ్యాఖ్యానించారు. అదే విధంగా బీసీ కమిషన్ ఛైర్మన్ కూడా సమావేశాలకు అధ్యక్షత వహించడం, నిర్వహించడం వరకే అదనపు బాధ్యత ఉంటుందని ఆయన పేర్కొన్నారు.

మెజారిటీ సభ్యులు ఇచ్చారు కాబట్టి దాన్ని బీసీ కమిషన్ ఇచ్చిన నివేదికగానే రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోంది. అది ఇప్పటికే మంత్రివర్గ ఆమోదం, రిజర్వేషన్ల బిల్లు ఉభయ సభల ఆమోదం పొందినందున ఈ విషయంలో పునరాలోచనకు కూడా తావు లేదని అధికారులు అంటున్నారు. న్యాయపరంగా, రాజ్యాంగపరంగా కూడా మెజారిటీ ఇచ్చిన నివేదికనే ఆమోదించాల్సి ఉంటుందని స్పష్టం చేస్తున్నారు. ఇప్పుడు ఛైర్మన్ కొత్తగా డిసెంట్ రిపోర్టు ఇస్తే… అది కూడా ఇప్పటికే ఆమోదం పొందిన నివేదికలో భాగం అవుతుందే గాని, అదే ప్రధాన నివేదిక కాదని, దాన్నే అమలు చేయాలన్న నిర్భంధం ఉండదని ఓ ఉన్నతాధికారి చెప్పారు. కోర్టులలో కూడా ఫుల్ బెంచ్ లో ఒక జడ్జికి భిన్నాభిప్రాయం ఉంటే డిసెంట్ నోట్ ఇస్తారని, ఇదీ అంతేనని ఆయన స్పష్టం చేశారు.

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Leave a Reply