ఆయుధాల అమ్మకంతోనే అమెరికాకు రెండున్నర లక్షల కోట్లు

2017లో ఇప్పటిదాకా సమకూరిన ఆదాయం అది

ఆయుధాల అమ్మకానికి అమెరికా ప్రసిద్ధిగాంచింది. తద్వారా ఆ దేశం సంపాదించే సొమ్ము రెండు తెలుగు రాష్ట్రాల వార్షిక బడ్జెట్ కంటే ఎక్కువే ఉంటుంది. ఈ ఏడాది ఇప్పటివరకు రక్షణ పరికరాల అమ్మకం ద్వారా అమెరికాకు ప్రపంచ దేశాలనుంచి వచ్చిన ఆదాయం 38 బిలియన్ డాలర్లు (సుమారు రూ. 2.47 లక్షల కోట్లు). ఈ విషయాన్ని అమెరికా రక్షణ శాఖ పెంటగాన్ గురువారం వెల్లడించింది. అయితే, ఏ దేశానికి ఎంత మొత్తంలో పరికరాలను అమ్మిందీ.. ఎంత ఆదాయం వచ్చిందీ వివరాలు ఇవ్వలేదు.

అమెరికా స్టేట్ డిపార్ట్ మెంట్ అధికారి ఒకరు చెప్పిన సమాచారం ప్రకారం… సెంట్రల్ ఆసియా, నియర్ ఈస్ట్ రీజియన్ లోనే అమెరికా 22 బిలియన్ డాలర్లమేరకు మిలిటరీ పరికరాలు అమ్మింది. ఇందులో యుద్ధ విమానాలు, ఆయుధ పరికరాలు ఉంటాయి. ఆసియా పసిఫిక్ ప్రాంతంలోని దేశాలకు మొత్తంగా 7.96 బిలియన్ డాలర్లు, యూరప్ దేశాలకు 7.3 బిలియన్ డాలర్లు, పశ్చిమ దేశాలకు 641.6 మిలియన్ డాలర్లు, ఆఫ్రికాకు 248.6 మిలియన్ డాలర్లు మేరకు రక్షణ సామాగ్రిని అమెరికా ఈ ఏడాది అమ్మింది.

ఆయుధాలతో పాటు శిక్షణ, నిర్వహణ సహా వాటికి సంబంధించిన ‘పూర్తి ప్యాకేజీ’ ఆఫర్ చేస్తున్నట్టు అమెరికా రక్షణ శాఖ అధికారులు చెబుతున్నారు. దీనివల్ల మిలిటరీ పరికరాల అమ్మకాలు పెరుగుతున్నాయట.

Leave a Comment