ఆంధ్రప్రదేశ్‌లో మైనింగ్ విశ్వవిద్యాలయం ఏర్పాటులో భాగస్వామిగా ఉండేందుకు, జల వనరుల సంరక్షణలో సహకారం అందించేందుకు ఆస్ట్రేలియా సంసిద్ధత వ్యక్తం చేసింది. సోమవారం సాయంత్రం వెలగపూడి సచివాలయంలో ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుతో ఆస్ట్రేలియన్ బృందం జరిపిన భేటీలో రెండు ముఖ్యమైన అవగాహన ఒప్పందాలు చేసుకున్నారు. ఇందులో మొదటిది వెస్ట్రన్ ఆస్ట్రేలియాలోని కర్టిన్ యూనివర్శిటీకి, ఏపీఎండీసీకి మధ్య జరిగిన అవగాహన ఒప్పందం. ఈ ఎంవోయూ ప్రకారం పెర్త్‌లోని కర్టిన్ యూనివర్శిటీ ఏపీలో గనులకు సంబంధించిన విజ్ఞానం, పరిశోధనకు ఉపకరించే ప్రపంచశ్రేణి పరిశోధనా కేంద్రం ఏర్పాటు చేయాల్సి ఉంది. ఇది రాష్ట్రంలో ఏర్పాటు చేయబోయే గనుల విశ్వవిద్యాలయంలో ఆయా అంశాలకు సంబంధించి భాగస్వామిగా ఉంటుంది. రాష్ట్రంలో గనుల రంగ అభివృద్ధికి, పారిశ్రామిక పరిశోధనకు, గనుల రంగంలో పనిచేసే కార్మికుల ఆరోగ్య పరిరక్షణకు తీసుకోవాల్సిన చర్యలపై ప్రభుత్వానికి సహకరిస్తుంది.
ఏపీలో వాటర్ సెన్సిటీవ్ సిటీస్ పార్టనర్‌షిప్‌పై మరో ఒప్పందం కుదిరింది. దీనిప్రకారం అమరావతిలో వాటర్ సెన్సిటీవ్ కో-ఆపరేటీవ్ రీసెర్చ్ సెంటర్ ఏర్పాటు చేస్తారు. రాజధాని ప్రాంత అభివృద్ధి ప్రాథికార సంస్థ (సీఆర్‌డీఏ), పురపాలక పట్టణాభివృద్ధి సంస్థ ఇందులో కీలక భాగస్వాములుగా ఉంటాయి. ఆస్ట్రేలియాలో వాటర్ సెన్సిటీవ్ ఏరియాలలో ప్రస్తుతం అమలుచేస్తున్న అత్యుత్తమ విధానాలను అమరావతికి తీసుకొస్తారు. ఈ ఒప్పందంలో భాగంగా గ్రీన్ టెక్నాలజీ ద్వారా తొలుత పైలట్ ప్రాజెక్టుగా విజయవాడలో మురుగునీటిని శుద్ధి చేస్తారు. పట్టణప్రాంత సుస్థిర జల నిర్వహణ వ్యవస్థలో భాగంగా దీన్ని ఏర్పాటుచేయనున్నారు.
మైనింగ్ రంగంలో ప్రపంచంలో రెండవ అత్యుత్తమ కర్టిన్ యూనివర్శిటీతో ఒప్పందం ఒక మేలిమలుపు కానున్నదని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఈ సందర్భంగా వ్యాఖ్యానించారు. ఐరన్ ఓర్, బాక్సైట్, బీచ్‌శాండ్, లైమ్‌స్టోన్ వంటి విలువైన ఖనిజ సంపద ఏపీలో విస్తారంగా ఉన్న విషయాన్ని గుర్తుచేశారు. వాటిని ప్రాసెసింగ్ చేసి ఉత్పత్తులను ఎగుమతి చేయాలన్నదే తమ అభిమతమని ముఖ్యమంత్రి వారికి వివరించారు.
రాష్ట్రంలో ఏర్పాటు చేసే మైనింగ్ యూనివర్సిటీకి ఆస్ట్రేలియన్ యూనివర్సిటీ భాగస్వామిగా ఉండటానికి ముందుకురావడం విశేషమని అన్నారు. ఏపీలో పెట్టుబడులు పెట్టడానికి ప్రతిపాదనలతో వచ్చిన ఆస్ట్రేలియన్ పారిశ్రామికవేత్తలను ఆయన అభినందించారు. ఆస్ట్రేలియన్ కాన్సుల్ జనరల్ షాన్ కెల్లీ వారిని ముఖ్యమంత్రికి పరిచయం చేశారు. ఈ సమావేశంలో ఏపీఈడీబీ సీఈవో కృష్ణకిశోర్, మౌలిక వసతుల కల్పన ముఖ్య కార్యదర్శి అజయ్ జైన్, ముఖ్యమంత్రి ప్రత్యేక ప్రధాన కార్యదర్శి సతీశ్ చంద్ర, అదనపు కార్యదర్శి ఏ వీ రాజమౌళి, కార్యదర్శి గిరిజాశంకర్, ఏపీ మైనింగ్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ మేనేజింగ్ డైరెక్టర్ వెంకయ్యచౌదరి పాల్గొన్నారు.