55 శాతం కోసం… జరగాల్సిన ప్రక్రియ ఇదే

2 0
Read Time:3 Minute, 38 Second

నేడు శాసనసభ, మండలి ముందుకు ఆంధ్రప్రదేశ్ రిజర్వేషన్ బిల్లు
గవర్నర్ ఆమోదంతో కేంద్రానికి…
పార్లమెంటు ముందుకు పోవాలి.. 9వ షెడ్యూలులో చేరాలి

రాష్ట్రంలో కాపు, తెలగ, ఒంటరి, బలిజ కులాలను బీసీలలో చేర్చి 5 శాతం రిజర్వేషన్లు కల్పించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. దీంతో… ఆంధ్రప్రదేశ్ లో రిజర్వేషన్ల మొత్తం సుప్రీంకోర్టు నిర్దేశించిన 50 శాతానికి మించిపోతోంది. ఇప్పటికే 50 వివిధ వర్గాలకు 50 శాతం రిజర్వేషన్లు కల్పించగా కాపు తదితర కులాలతో కలిపి ఇప్పుడది 55 శాతం అవుతోంది. ఇంతకు ముందు బీసీలకు 25 శాతం, ఎస్సీలకు 15 శాతం, ఎస్టీలకు 6 శాతం, బీసీ కేటగిరిలో చేర్చిన ముస్లింలకు 4 శాతం చొప్పున రిజర్వేషన్లు అమలవుతున్నాయి. కాపులకు రిజర్వేషన్లు కల్పించే ప్రక్రియ ఇఫ్పుడే మొదలైంది. బీసీలలో చేరుస్తూ 5 శాతం రిజర్వేషన్ కల్పించడానికి మంత్రివర్గం ఆమోదం మాత్రమే ఇంతవరకూ పూర్తయింది. ఇక జరగాల్సింది చాలా ఉంది.

కాపు రిజర్వేషన్లతో మొత్తం కోటా నిర్దేశిత స్థాయిని దాటుతున్న నేపథ్యంలో రాష్ట్రం ఓ చట్టం చేయాల్సి ఉంది. తాజా రిజర్వేషన్ల విధానానికి సంబంధించిన బిల్లును శనివారం ఉదయం జరగనున్న ప్రత్యేక మంత్రివర్గ సమావేశంలో ప్రవేశపెడతారు. మంత్రివర్గ ఆమోదం తర్వాత రాష్ట్ర అసెంబ్లీలో, శాసనమండలిలో ప్రవేశపెడతారు. ముందుగా శాసనసభలో చర్చించి ఆమోదించిన తర్వాత… కొత్త బిల్లు శాసనమండలికి వెళ్తుంది. ఉభయ సభల ఆమోదం తర్వాత రాష్ట్ర గవర్నర్ ఇఎస్ఎల్ నర్సింహన్ గ్రీన్ సిగ్నల్ కోసం పంపుతారు. అక్కడినుంచి కేంద్రం పాత్ర మొదలవుతుంది.

గవర్నర్ ఆమోదం తర్వాత ఆంధ్రప్రదేశ్ రిజర్వేషన్ల చట్టాన్ని కేంద్ర ప్రభుత్వ ఆమోదంకోసం రాష్ట్ర ప్రభుత్వం పంపుతుంది. రిజర్వేషన్ల చట్టాన్ని రాజ్యాంగంలోని 9వ షెడ్యూలులో చేర్చాల్సిందిగా రాష్ట్ర ప్రభుత్వం కోరనుంది. దానివల్ల రిజర్వేషన్ల పెంపు నిర్ణయాన్ని కోర్టులు కొట్టివేయవన్న ఓ నమ్మకం ఉంది. 9వ షెడ్యూలు దాకా వెళ్ళాలంటే… ముందుగా కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర రిజర్వేషన్లపై తాజా విధానానికి ఆమోద ముద్ర వేయాల్సి ఉంటుంది. ఆమోదిస్తే.. తాజా చట్టం పార్లమెంటు మెట్లెక్కుతుంది. పార్లమెంటు ఆమోదంతో అది 9వ షెడ్యూలులోకి చేరుతుంది. అంటే.. రాజ్యాంగ రక్షణతో కాపు, తెలగ, ఒంటరి, బలిజ కులాలకు విద్య, వైద్య, ఆర్థిక రంగాల్లో రిజర్వేషన్ ప్రయోజనాలు చేకూరతాయి.

Happy
Happy
100 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Leave a Reply