ఇండియాలో బిలియనీర్లు పెరుగుతున్నారు. దేశంలోని కుటుంబాల సంపద 2000, 2017 మధ్య నాలుగు రెట్లు పెరిగి ఇటీవలే 5 ట్రిలియన్ డాలర్లకు చేరింది. అయితే, మన జనాభాలో నాలుగో వంతు కూడా లేని అమెరికాతో పోలిస్తే సంపదలో ఎక్కడున్నాం? 90 ఏళ్ళు వెనుక…!! ఆశ్చర్యమైనా ఇది నిజం. 2017 ఇండియన్ల సంపద 90 ఏళ్ళ క్రితం అమెరికన్ల సంపదతో సమానమట. స్విస్ బ్రోకరేజ్ సంస్థ క్రెడిట్ స్యూస్ తాజా రిపోర్టులో ఈ పోలికను తెచ్చింది.
2022నాటికి ఇండియన్ కుటుంబాల సంపద 6 ట్రిలియన్ డాలర్లకు చేరుతుందట. అప్పటికి కూడా మనం 1936లో అమెరికా సంపద ఎంతో ఆ స్థాయికి చేరతామని క్రెడిట్ స్యూస్ పేర్కొంది. 2017లో ఇండియన్ల సంపద 9.9 శాతం పెరిగి 4.987 ట్రిలియన్ డాలర్లకు (సుమారు రూ. 320 లక్షల కోట్లకు) చేరింది. అదే సమయంలో ప్రపంచ సంపద 16.7 ట్రిలియన్ డాలర్లు (6.4 శాతం) పెరిగి 280 ట్రిలియన్ డాలర్లకు చేరింది.
వృద్ధి రేటులో మనమే ముందున్నా అమెరికా వంటి దేశాలతో పోలిస్తే సంపదలో చాలా వెనుక ఉన్నాం. ఇండియాలో వయోజనుల సగటు సంపద 5,980 డాలర్లు మాత్రమే. పెరుగుతున్న సంపదకు, మన జనాభాకు పొంతన కుదరడంలేదు. కొద్దిమంది బిలియనీర్ల సంపద పెరుగుతున్నా…సగటు భారతీయుడి నికర విలువ మాత్రం మందంగానే ముందుకు సాగుతోంది.