ఇదీ ఆత్మగౌరవ అంశమే…కేంద్రానికి చంద్రబాబు బహిరంగ హెచ్చరిక

అన్యాయాన్ని సరిదిద్దకపోతే ఎంతటి త్యాగానికైనా సిద్ధం
ఐదు కోట్లమంది తరఫున కేంద్రాన్ని డిమాండ్ చేస్తున్నా
కొంతమంది వ్యక్తిగత ప్రయోజనాలకోసంకుమ్మక్కవుతున్నారు

మోదీ ప్రభుత్వపు ఆఖరి బడ్జెట్ కూడా ఆంధ్రప్రదేశ్ అవసరాలను, విభజననాటి హామీలను నెరవేర్చే పరిస్థితి లేకపోవడంవల్లనే తెలుగుదేశం పార్టీ గట్టిగా నిలదీసిందని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు చెప్పారు. జరిగిన అన్యాయాన్ని సరిదిద్దకపోతే…తెలుగుజాతికోసం ఎంతటి త్యాగానికైనా వెనుకాడబోనని స్పష్టం చేశారు. కేంద్ర బడ్జెట్లో ఆంధ్రప్రదేశ్ విభజన హామీలను నెరవేర్చే దిశగా కనీస కేటాయింపులు లేకపోవడంపై ఆవేదనతో ఉన్న ముఖ్యమంత్రి… తొలిసారి బహిరంగ వేదికపై కేంద్రాన్ని హెచ్చరించారు. గుంటూరు జిల్లా నర్సరావుపేటలో జరిగిన ఓ అధికారిక కార్యక్రమంలో చంద్రబాబు ఈ అంశాన్ని ప్రస్తావించారు.

తెలుగుజాతి ఆత్మగౌరవం కోసమే ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీని స్థాపించారని ఇటీవల ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పార్లమెంటులో చేసిన వ్యాఖ్యలనే ఉటంకిస్తూ… ‘ఇదీ తెలుగువారి ఆత్మగౌరవానికి సంబంధించిన అంశమే’నని చంద్రబాబు ఉద్ఘాటించారు. అంతేకాదు…రాష్ట్రం, కేంద్రం రెండూ స్వయంప్రతిపత్తి ఉన్న వ్యవస్థలని స్పష్టం చేశారు. బీజేపీ నేతల పేర్లు ప్రస్తావించకుండా ‘‘నిన్న మొన్న కూడా కొన్ని ప్రకటనలు ఇచ్చారు. మేము వేరే నిధులిచ్చామని, దాన్నికూడా చర్చించడానికి సిద్ధంగా ఉన్నాం’’ అని చంద్రబాబు చెప్పారు.

అన్యాయమైన విభజన, హామీల ఉల్లంఘన నేపథ్యంలో రాష్ట్ర ప్రజల్లో ఆగ్రహం ఉందన్నారు. కొంతమంది స్వప్రయోజనాలకోసం కుమ్మక్కు రాజకీయాలు చేస్తున్నారని ఆరోపించిన చంద్రబాబు… ‘‘ఇది ఐదు కోట్ల మందికి సంబంధించిన విషయం. కేంద్ర, రాష్ట్రాలకు సంబంధించిన అంశం. అన్యాయంపై పోరాడి సాధించుకోవడానికి ప్రజలంతా ప్రభుత్వానికి సహకరించాలి’’ అని కోరారు. ఎన్డీయే ప్రభుత్వపు చివరి బడ్జెట్ చూసిన తర్వాత అన్యాయం జరిగిందని చెప్పక తప్పలేదని, అందుకే పార్లమెంటులో తెలుగుదేశం పార్టీ ఎంపీలు పోరాడారని పేర్కొన్నారు.

విభజనకు ముందు రెండేళ్ళు అలజడి నెలకొందని, విభజన జరిగిన నాలుగేళ్ళ తర్వాత ఇప్పుడు మళ్ళీ అదే తలెత్తే పరిస్థితి ఉందని ఆవేదన వ్యక్తం చేసిన సిఎం ‘‘నేను అప్పుడే చెప్పాను. అస్సాం మార్గంలోనో పంజాబ్ తరహాలోనో వెళ్ళకూడదని’’ అని గుర్తు చేశారు. విభజన హేతుబద్ధంగా జరగలేదని, రాష్ట్రానికి న్యాయం జరగాలనే బీజేపీతో పొత్తు పెట్టుకున్నామని, కానీ చివరి బడ్జెట్ లోనూ అన్యాయం జరిగిందని చంద్రబాబు ఆవేదేన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా ప్రధానమంత్రి, కేంద్ర మంత్రులు అన్యాయాన్ని సరిదిద్దడానికి ప్రయత్నించాలన్నారు.

‘‘మన దౌర్భాగ్యం… విభజన తర్వాత రాష్ట్ర అవతవరణ దినోత్సవాన్ని కూడా నిర్వహించుకోలేకపోతున్నాం. దానికి బదులు నవ నిర్మాణ దీక్ష చేస్తున్నాం’’ అని చంద్రబాబు వ్యాఖ్యానించారు. రాష్ట్రానికి అన్యాయం జరిగితే పోరాడటానికి తాను వెనుకాడబోనని, అయితే అది ఒక పద్దతి ప్రకారం ఉంటుందని చెప్పారు. ఆంధ్రప్రదేశ్ పునర్య్వవస్థీకరణ చట్టంలో ఉన్న అంశాలు, విడిగా ఇచ్చిన హామీలు అన్నిటినీ కేంద్రం అమలు చేయాలని డిమాండ్ చేశారు.

Related posts

Leave a Comment