ఈబీసీ రిజర్వేషన్ బిల్లుకు లోక్ సభ ఆమోదం

2 0
Read Time:4 Minute, 31 Second
రేపు రాజ్యసభలో చర్చ.. అందుకోసం సమావేశాలు ఒకరోజు పొడిగింపు

ఆర్థికంగా వెనుకబడిన వర్గాలకు 10 శాతం రిజర్వేషన్లు కల్పించేందుకు ఉద్దేశించిన బిల్లుకు మంగళవారం లోక్ సభ ఆమోదం తెలిపింది. పార్లమెంటు శీతాకాల సమావేశాల చివరి రోజున ప్రభుత్వం రిజర్వేషన్లపై రాజ్యాంగ సవరణ బిల్లును ప్రవేశపెట్టింది. ఐదు గంటలకు పైగా చర్చించిన అనంతరం మంగళవారం రాత్రి లోక్ సభలో ఓటింగ్ జరిగింది. అధికార, విపక్ష కూటములకు చెందిన 323 మంది సభ్యులు ఈబీసీ రిజర్వేషన్ బిల్లుకు అనుకూలంగా ఓటు వేయగా కేవలం ముగ్గురు సభ్యులు వ్యతిరేకిస్తూ ఓటు వేశారు.

ఈబీసీ రిజర్వేషన్ బిల్లు కేంద్ర ప్రభుత్వం తెచ్చిన తీరును తప్పుపడుతూనే విపక్షాలు మద్ధతు తెలిపాయి. అయితే, న్యాయసమీక్షకు నిలువదేమోనన్న సందేహాన్ని అనేక పార్టీలు వ్యక్తం చేశాయి. 2019 ఎన్నికలకు ముందు రాజకీయ ప్రయోజనంకోసమే బీజేపీ ఈ బిల్లును ఆశ్రయించిందని విమర్శించాయి. అయితే, పేదలకు రిజర్వేషన్ ఇవ్వడానికి తాము అనుకూలమేనని మెజారిటీ పార్టీలు స్పష్టం చేశాయి.

బుధవారం రాజ్యసభలో ఈ బిల్లుపై చర్చ జరగనుంది. ఈ బిల్లుకోసం రాజ్యసభ సమావేశాలను ఒకరోజు పొడిగించారు. ప్రతిపక్షాలు కూడా బిల్లుకు మద్ధతు తెలిపిన నేపథ్యంలో ఆమోదంపై ఎలాంటి సందేహాలు లేవు. రాజకీయ వ్యూహంగా మోడీ ప్రభుత్వం ముందుకు తెచ్చిన ఈబీసీ రిజర్వేషన్ బిల్లును ‘‘ఎన్నికల గిమ్మిక్’’గా కొట్టిపారేస్తూనే… అన్ని పార్టీలూ అసాధారణ స్థాయిలో మద్ధతు తెలిపాయి. మండల్ రాజకీయాల్లో కమండల రాజకీయాలను వ్యతిరేకించిన పార్టీలు కూడా ఆర్థికంగా వెనుకబడిన అగ్రవర్ణాలకు రిజర్వేషన్లకు మద్ధతు ప్రకటించడం గమనార్హం.

ఈ బిల్లుతో రిజర్వేషన్ల శాతం 50 శాతానికి మించనుంది. గతంలో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పునకు, అనేక సందర్భాల్లో ప్రభుత్వమే చెప్పిన మాటకు విరుద్ధంగా మోడీ తాజా బిల్లును ముందుకు తెచ్చారు. బిల్లును హడావిడిగా ముందుకు తేవడాన్ని ప్రస్తావించిన కాంగ్రెస్ పార్టీ సభ్యుడు కేవీ థామస్ ‘‘బిల్లును పూర్తిగా చదవడానికి కూడా సమయం లేదు’’ అని ఆక్షేపించారు. బిల్లుకు మద్ధతు తెలుపుతూనే జాయింట్ పార్లమెంటరీ కమిటీ (జెపిసి)కి పంపాలని సూచించారు.

దేశంలోని అనేక పార్టీలు ఈబీసీలకు రిజర్వేషన్లను కల్పించడానికి హామీలు ఇచ్చాయని, కాంగ్రెస్ పార్టీ 2014 మేనిఫెస్టోలో కూడా ప్రస్తావించిందని కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి అరుణ్ జైట్లీ చర్చలో గుర్తు చేశారు. ‘‘రిజర్వేషన్లను వ్యతిరేకించేవారే ఈ 10 శాతం కోటాలో భాగమయ్యారు. అంటే, ఇప్పుడు వాళ్లు రిజర్వేషన్లను వ్యతిరేకించరు’’ అని కేంద్ర మంత్రి రాం విలాస్ పాశ్వాన్ వ్యాఖ్యానించారు.

అయితే, త్రుణమూల్ కాంగ్రెస్ సభ్యుడు సుదీప్ బంధోపాధ్యాయ కేంద్రంపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. ఈ బిల్లు ఉపాధి కల్పనకోసం కాదని, యువతకు భ్రమలు కల్పించి తప్పుదోవ పట్టించే ప్రయత్నమేనని విమర్శించారు. రైల్వే శాఖలో 85 వేల ఖాళీలు ఉంటే రెండున్నర కోట్ల మంది దరఖాస్తు చేశారని గుర్తు చేశారు.

Happy
Happy
100 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %