గత నాలుగు విడతలతో పోలిస్తే ఐదో విడత ‘జన్మభూమి మా ఊరు’ కార్యక్రమం ప్రత్యేకమైనదని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఉద్ఘాటించారు. ప్రజల ఆలోచనలు, సూచనలు తెలుసుకోవడానికి జన్మభూమి ఓ బృహత్తర అవకాశమని ఆయన పార్టీ నేతలతో చెప్పారు. జనవరి 2వ తేదీనుంచి 10 రోజులపాటు జన్మభూమి కార్యక్రమాన్ని నిర్వహించనున్న నేపథ్యంలో శనివారం ముఖ్యమంత్రి తమ పార్టీ పార్టీ నాయకులు, మంత్రులతో విస్తృత సమావేశాన్ని నిర్వహించారు. జిల్లాల నాయకులు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఈ సమావేశంలో పాల్గొన్నారు.
‘‘ఇంటింటికి తెలుగుదేశం కార్యక్రమంలో దాదాపు 40 లక్షల ఫిర్యాదులు సేకరించాం. వాటిని సమీక్షించి పరిష్కరిస్తున్నాం. జన్మభూమి కార్యక్రమం మొదలయ్యేలోగానే వీటిపై ఓ స్పష్టతకి రావాలి. ఈ ఏడాది జరగబోయే జన్మభూమి ప్రత్యేకం. పక్కా ప్రణాళికతో ముందుకు వెళ్తున్నాం’’ అని చంద్రబాబు నేతలతో చెప్పారు. సంక్షేమ కార్యక్రమాల ద్వారా ఇప్పటికే ప్రజల్లో సంతృప్తి వ్యక్తం అవుతోందన్న ముఖ్యమంత్రి…ఈ జన్మభూమిలో కొత్త రేషన్ కార్డులు, పింఛన్ల నమోదు రాజకీయాలకు అతీతంగా జరగాలని స్పష్టం చేశారు.
ప్రజల్లో సానుకూలత ఉందంటూనే…కొన్ని ప్రాంతాల్లో ప్రజలకు మరింత సమాచారం ఎప్పటికప్పుడు అందిస్తూ అవగాహన కలిపించడం మన బాధ్యతని ముఖ్యమంత్రి పార్టీ నేతలకు గుర్తు చేశారు. రియల్ టైమ్ గవర్నెన్స్ (ఆర్ టీ జీ) కేంద్రం ద్వారా ఫిర్యాదుల సేకరణ చేపట్టి వాటిని పరిష్కారం చేస్తున్నామన్నారు. జనవరి 2 నుంచి 11 వరకు జరిగే జన్మభూమి కార్యక్రమం… ప్రజలు తమ ఆలోచనలు, అభిప్రాయాలు, అనుభవాలను చర్చించే వేదికగా నిలవాలని ముఖ్యమంత్రి ఆకాంక్షించారు.
జన్మభూమితో సంక్రాంతి పండుగ వాతావరణం ముందుగానే రావాలని చంద్రబాబు నాయుడు పార్టీ నేతలకు, కార్యకర్తలకు పిలుపునిచ్చారు.