’టెర్రరిస్టులు భూమిపై లేకుండా పోయేవరకు తరుముతాం‘
ఉగ్రవాదానికి వ్యతిరేకంగా ఏర్పాటైన ముస్లిం దేశాల కూటమి మొదటి సమావేశం ఆదివారం సౌదీ అరేబియాలోని రియాద్ నగరంలో జరిగింది. 40 ముస్లిం దేశాలనుంచి రక్షణ మంత్రులు, ఉన్నతాధికారులు ఈ సమావేశానికి హాజరయ్యారు. ‘ఇస్లామిక్ మిలిటరీ ఉగ్రవాద వ్యతిరేక కూటమి’గా వ్యవహరిస్తున్న ఈ నూతన వేదికతో టెర్రరిజం అంతమవుతుందని సౌదీ యువరాజు మహ్మద్ బిన్ సల్మాన్ ఉద్ఘాటించారు. ‘టెర్రరిస్టులను భూమ్మీద లేకుండా చేసేవరకు తరుముతాం’ అని సౌదీ అరేబియా రక్షణ మంత్రి కూడా అయిన ఈ యువరాజు తన ప్రధానోపన్యాసంలో చెప్పారు.
సౌదీ అరేబియా యువరాజు చొరవతో 41 దేశాలతో మొట్ట మొదట ఈ కూటమిని 2015లో ప్రకటించారు. పాకిస్తాన్ మాజీ సైనిక జనరల్ రహీల్ షరీఫ్ ఇస్లామిక్ మిలిటరీ కూటమికి కమాండర్ ఇన్ ఛీఫ్. ఇందులోని దేశాలు ప్రధానంగా సున్నీ ముస్లింలు మెజారిటీ ఉన్నవి లేదా సున్నీ ముస్లిం పాలకుల కింద ఉన్నవి. షియాల ఆధిపత్యంలో ఉన్న ఇరాన్ ను, ఆ దేశంతో సన్నిహిత సంబంధాలున్న సిరియా, ఇరాక్ దేశాలను ఈ కూటమినుంచి మినహాయించారు. ఇరాన్, సౌదీ అరేబియాల మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలోనే మిలిటరీ కూటమికి సూత్రధారి అయిన సౌదీ అరేబియా… తన ప్రత్యర్ధిని ప్రక్కన పెట్టింది.
ఇక ఇటీవల ఖతార్ దేశంపై సౌదీ నాయకత్వంలోని దేశాలు ఆంక్షలు విధించిన నేపథ్యంలో రియాద్ సమావేశానికి ఆ దేశమూ హాజరు కాలేదు. ఆదివారంనాటి సమావేశానికి ముస్లిం దేశాలు, లేదా ముస్లింలు ఎక్కువగా నివసించే దేశాలనుంచి ప్రతినిధులు హాజరయ్యారు. టర్కీ, ఈజిప్టు, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యుఎఇ), బహ్రెయిన్, ఆఫ్ఘనిస్తాన్, ఉగాండా, సోమాలియా, మారిషేనియా, లెబనాన్, లిబియా, యెమెన్ తదితర దేశాలు ఒకే వేదికపైకి వచ్చాయి. ఈజిప్టు మసీదులో బాంబు పేలుడు నేపథ్యంలో.. ఆ దేశ రక్షణ మంత్రికి బదులు మిలిటరీ అధికారి హాజరయ్యారు.
‘మన జాతీయ ప్రభుత్వాల మధ్య సమన్వయం లేకపోవడంవల్ల.. గత కొన్నేళ్ళుగా మన దేశాలన్నిటిలోనూ ఉగ్రవాదులు తమ కార్యకలాపాలను సాగిస్తున్నారు. ఈ కూటమితో ఆ శకం ముగిసింది’ అని సౌదీ నేత సల్మాన్ చెప్పారు. సమాచార మార్పిడి, వనరుల వినియోగం వంటి అంశాల్లో సమన్వయం చేసుకోవడం, సభ్య దేశాలకు ఉగ్రవాదానికి వ్యతిరేకంగా పోరాడే సామర్ధ్యాన్నివ్వడంపై ఈ కూటమి దృష్టి సారిస్తుందని రహీల్ షరీఫ్ చెప్పారు.