ఉత్తర కొరియాకు ‘ఉగ్ర’ ముద్ర

0 0
Read Time:4 Minute, 3 Second
‘ఉగ్రవాద పోషక దేశాల’ జాబితాలో మళ్ళీ పేరు

అమెరికా మంత్రివర్గ సమావేశంలో ట్రంప్ ప్రకటన

ఉత్తర కొరియాను ఉగ్రవాదాన్ని ప్రోత్సహిస్తున్న దేశంగా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సోమవారం ప్రకటించారు. ఈ చర్య కొత్త ఆంక్షలను విధించడానికి పనికొస్తుంది. గతంలోనూ ‘ఉగ్రవాద ప్రోత్సాహక దేశాలు’గా అమెరికా నిర్వచించిన జాబితాలో ఉత్తర కొరియా పేరు ఉండేది. అయితే, జార్జ్ వాకర్ బుుష్ అధ్యక్షుడుగా ఉన్న సమయంలో ఉత్తర కొరియా పేరును తొలగించారు. ప్రస్తుతం ఉత్తర కొరియా కంటే ముందు ఇరాన్, సూడాన్, సిరియా ఆ జాబితాలో ఉన్నాయి.

సోమవారం శ్వేత సౌధంలో నిర్వహించిన తన మంత్రివర్గ సమావేశంలో ట్రంప్ ఉత్తర కొరియాను మళ్లీ పాత జాబితాలో చేరుస్తూ ప్రకటన చేశారు. ఈ పని ఇంతకు ముందే చేసి ఉండాల్సిందని ట్రంప్ వ్యాఖ్యానించారు. అణ్వస్త్రాలతో బెదిరించడమే కాకుండా విదేశీ భూభాగాలపై హత్యలతో సహా అంతర్జాతీయంగా ఉగ్రవాదాన్ని ఉత్తర కొరియా ప్రోత్సహిస్తోందని ట్రంప్ ఆరోపించారు. ఉత్తర కొరియా జైలు నుంచి విడుదల చేశాక కొంత కాలానికి స్వదేశంలో మరణించిన అమెరికా యువకుడు ఒట్టో వార్మ్ బియర్ ను ప్రస్తావిస్తూ..  ఇలాంటి అనేక మంది ఆ దేశంవల్ల బాధితులయ్యారని ట్రంప్ పేర్కొన్నారు.

కొరియా ప్రభుత్వం అణ్వాయుధాలు, ఖండాంతర క్షిపణుల అభివృద్ధికి నిరంతరం ప్రయత్నిస్తోందని, ప్రపంచ శాంతికి భంగకరంగా మారిందని ట్రంప్ వ్యాఖ్యానించారు. ఉత్తర కొరియాకు తాజా ట్యాగ్.. ఆ దేశంనుంచి ఫిరాయించిన ఓ ఉన్నత స్థాయి వ్యక్తి నిరూపించిన అంశాల ఆధారంగా తగిలించిందేనని తెలిపారు. దౌత్యపరంగా ఆర్థికంగా కిమ్ జోంగ్ ఉన్ పై తీవ్ర స్థాయి ఒత్తిడిని పెంచడానికి ముఖ్యమైన చర్యగా ఇది ఉపయోగపడుతుందని అభిప్రాయపడ్డారు

మరిన్ని ఆంక్షలు… నేడు ప్రకటన

ఉత్తర కొరియాపై ఈ ముద్ర వేయడం ద్వార మరిన్ని ఆంక్షలతో ఆ దేశంపై ఒత్తిడి పెంచవచ్చని ట్రంప్ వివరించారు. కాగా, అమెరికా ట్రెజరీ శాఖ మంగళవారం మరో రౌండ్ భారీ ఆంక్షలను ప్రకటించనుంది. ఆంక్షల ప్రక్రియ రెండు వారాల పాటు కొనసాగుతుందని, ఈ రెండు వారాలు చివరికి వచ్చేసరికి అత్యున్నత స్థాయి ఆంక్షలు విధిస్తామని అమెరికా అధికారులు చెబుతున్నారు.

కాగా, హౌస్ విదేశీ సంబంధాల కమిటీ ట్రంప్ ప్రకటనను స్వాగతించింది. ‘గత సంవత్సరంలోనే ఉత్తర కొరియా కిమ్ జోంగ్ ఉన్ తన సోదరుడిని రసాయన ఆయుధంతో చంపించాడు. ఒట్టోను చిత్రహింసలు పెట్టి అతని మరణానికి కారణమయ్యారు’ అని కాంగ్రెస్ సభ్యుడు, హౌస్ ఫారెన్ అఫైర్స్ కమిటీ ఛైర్మన్ ఎడ్ రాయిస్ వ్యాఖ్యానించారు. ఈ ఘటనలు ఒకదానికొకటి సంబంధం లేనివి కావని, స్థిరమైన ఉగ్ర తరహా చర్యలకు ఉదాహరణలని ఆయన అభిప్రాయపడ్డారు.

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Leave a Reply