ఉన్నత ప్రమాణాలతో ఫిల్మ్-టీవీ ఇనిస్టిట్యూట్

ప్రారంభ దశలో నాగార్జున వర్సిటీలో తరగతులు

రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా ఏర్పాటు చేస్తున్న ఫిల్మ్ అండ్ టీవీ ఇనిస్టిట్యూట్ కార్యకలాపాలు త్వరలో ప్రారంభం కాబోతున్నాయి. రాజధాని అమరావతిలో ఇనిస్టిట్యూట్ ను నెలకొల్పడానికి ముమ్మరంగా ఏర్పాట్లు సాగుతున్నాయి. ప్రాథమిక దశలో ఇనిస్టిట్యూట్ తరగతులను నిర్వహించుకోడానికి తరగతి గదులను కేటాయించడానికి ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం అంగీకరించింది. ఇందుకు సంబంధించి.. చలన చిత్ర, టీవీ రంగానికి చెందిన ప్రముఖులతో ఏర్పాటైన కమిటీ తొలి సమావేశం గురువారం రాష్ట్ర చలనచిత్ర, టీవీ, నాటక రంగ అభివృద్ధి సంస్థ కార్యాలయంలో జరిగింది. సంస్థ చైర్మన్ అంబికా కృష్ణ అధ్యక్షత వహించగా మేనేజింగ్ డైరెక్టర్ ఎస్.వెంకటేశ్వర్ సమన్వయంతో సమావేశం జరిగింది.

సినీ రంగ ప్రముఖులు, కమిటీ సభ్యులు పరుచూరి వెంకటేశ్వరరావు, సి.కళ్యాణ్, ప్రముఖ ఎగ్జిబిటర్ జి. విశ్వనాధ్, ఫిలిం ఛాంబర్ కి చెందిన వై.రామచంద్రరావు, ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం వైస్ ఛాన్సలర్ రాజేంద్రప్రసాద్ పాల్గొన్నారు. ఆర్ధిక శాఖ సంయుక్త కార్యదర్శి రవీంద్రనాథ్ ఠాగూర్, ఏపీఎఫ్డీసీ జనరల్ మేనేజర్ శేష సాయి కూడా సమావేశానికి హాజరయ్యారు. ఫిల్మ్ అండ్ టీవీ ఇనిస్టిట్యూట్ దేశంలోనే ప్రీమియర్ సంస్థగా రూపుదిద్దడం ఎలా అన్న అంశంపై ఈ సమావేశంలో చర్చించారు.

పూణే, ముంబై లో ఉన్న ఫిల్మ్ ఇన్స్టిట్యూట్ ల నిర్వహణ తీరు, వాటిలో అనుసరిస్తున్న విధానాలు అధ్యయనం చేయడానికి త్వరలో ఆ రెండు సంస్థలను పరిశీలించి రావాలని నిర్ణయించారు. సినిమా, టీవీ నిర్మాణ రంగంలో వివిధ విభాగాలకు చెందిన ప్రముఖులను భాగస్వామ్యులను చేస్తూ ఉన్నత ప్రమాణాలతో కూడిన శిక్షణను ఇవ్వడానికి ప్రణాళికలను రూపొందించాలని ఒక అభిప్రాయానికి వచ్చారు.

Leave a Comment