-
ఏటా 25 లక్షల మంది మృతి
-
కట్టె పొయ్యి మరణాలు 10 లక్షలు
-
మురికి నీరు తాగి 5 లక్షలు..
-
’లాన్సెట్ అధ్యయనం’ వెల్లడి
జనాభాలో రెండో స్థానంలో ఉన్న భారతదేశం అనేక విషయాల్లో మాత్రం మొదటి స్థానంలో ఉంటోంది. అందులో గర్వకారణమైన అంశాలు వేళ్ళమీద లెక్కించదగ్గవైతే… దు:ఖ కారకమైనవి చాలా ఉన్నాయి. వాటిలోని ఒకానొక బాధాకరమైన వార్త ఇది.
2015లో ఇండియాలో 25.1 లక్షల మంది కేవలం కాలుష్యం వల్ల మరణించారని తాజా అధ్యయనం ఒకటి తేల్చింది. అందులో వాయు కాలుష్యం వల్ల 18.1 లక్షల మంది మృత్యువాత పడగా నీటి కాలుష్యంతో6.4 లక్షల మంది మరణించారు. కేవలం వాయు కాలుష్యం వల్ల మృతి చెందినవారి సంఖ్య చూసినా అసాధారణం. మన రాష్ట్రంలోని అతి పెద్ద నగరం విశాఖపట్నం జనాభా కంటే ఎక్కువ. మొత్తం కాలుష్య మరణాలు తీసుకుంటే.. విశాఖపట్నం, గుంటూరు నగరాల జనాభాకు సమానం.
కాలుష్యం, ఆరోగ్యంపై లాన్సెట్ కమిషన్ చేసిన అధ్యయనంలో తేలిన కఠోన వాస్తవమిది. జనాభాలో మొదటి స్థానంలో ఉన్న చైనా కాలుష్య మరణాల్లో మాత్రం మనకంటే వెనుక ఉంది. మొత్తం 18 లక్షల మరణాలతో చైనా రెండో స్థానంలో నిలిచింది. 2015లో ప్రపంచం మొత్తంలో కాలుష్యం వల్ల మరణించినవారి సంఖ్య 65 లక్షలు కాగా అందులో భారతీయుల వాటా 28 శాతం. అంతే కాదు.. ఇండియాలో వాయు కాలుష్య మరణాల పెరుగుదల వేగం ఎక్కువగా ఉంది.
జల కాలుష్య మరణాలు చైనాలో తక్కువ
వాయు కాలుష్య మరణాల్లో చైనా కూడా ఇండియాతో పోటీ పడింది. ఇండియాలో 1.81 లక్షల మంది ఈ కారణంగా మరణిస్తే అదే సంవత్సరం (2015లో) 15.8 లక్షల మంది చైనీయులు అశువులుబాశారు. అయితే, జల కాలుష్య నివారణలో చైనా చాలా ముందుంది. జల కాలుష్యంతో ఆ దేశంలో కేవలం 34,000 మంది మరణించారు. ఇండియాలో ఆసంఖ్య 6.4 లక్షలు. 2015లో ఇండియాలో సంభవించిన అన్ని రకాల మరణాల్లో సుమారు 25 శాతం కాలుష్యం వల్ల జరిగినవేనట. చైనా, బంగ్లాదేశ్, పాకిస్తాన్ వంటి దేశాల్లో కూడా కాలుష్య మరణాల వాటా దాదాపు ఇంతే ఉంది.
ఈ మృత్యువు పేరు పేదరికం!
ఇండియాలో పరిసరాల కాలుష్యం వల్ల 10.9 లక్షల మంది చనిపోతే..ఇంట్లో కట్టె పొయ్యి ఉపయోగించడం వల్ల ఏకంగా 9.7 లక్షల మంది మృత్యువాత పడుతున్నారు. మరో 5 లక్షల మంది కాలుష్య జలాలు తాగడం వల్ల చనిపోతున్నారు. ఇంకో 3.2 లక్షల మంది పారిశుధ్యలోపం వల్ల మరణిస్తున్నారు. ఈ మూడు రకాల మరణాలూ ప్రధానంగా పేదరికపు హత్యలు.
వాయు కాలుష్యం వల్ల గుండె జబ్బులు, పోటు, ఊపిరితిత్తుల కేన్సర్, తీవ్రమైన శ్వాసకోశ వ్యాధులు సంభవించి ఎక్కువ మంది మరణిస్తున్నారని లాన్సెట్ పేర్కొంది. ఎయిడ్స్, టీబీ, మలేరియా కారణంగా మరణిస్తున్న మొత్తం కంటే కాలుష్యం వల్ల సంభవిస్తున్నమరణాలు మూడు రెట్లు ఎక్కవని ఈ అధ్యయనం నిర్ధారించింది.