ఎల్ఎన్‌జీ టెర్మినల్ భాగస్వామ్యానికి ‘ఉడ్‌సైడ్’ సిద్ధం

ఆస్ట్రేలియాలో ప్రధాన ఎల్ఎన్‌జీ ఆపరేటరుగా ఉన్న ఉడ్‌సైడ్ ఎనర్జీ లిమిటెడ్ ఏపీలో పెట్టుబడులు పెట్టేందుకు ముందుకొచ్చింది. కాకినాడలో ఎల్ఎన్‌జీ టెర్మినల్, రీగ్యాసిఫికేషన్ యూనిట్ నిర్మాణంలో పాలుపంచుకునేందుకు సంసిద్ధత వ్యక్తంచేసింది. మంగళవారం సాయంత్రం సచివాలయంలో ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుతో భేటీ అయిన ఆస్ట్రేలియన్ బృందం ఈ ప్రతిపాదనపై చర్చించి తన ఆసక్తిని తెలియపరచింది. ఏపీలో వృద్ధి రేటు ప్రోత్సాహకరంగా ఉండటం, పారిశ్రామిక ప్రగతి పరుగులు పెట్టడం గమనంలో ఉంచుకుని ఇక్కడ ఈ రంగంలో భాగస్వామి కావాలని నిర్ణయించుకున్నామని సంస్థ ఎగ్జిక్యూటీవ్ వైస్ ప్రెసిడెంట్ రెయిన్‌హర్డ్ మ్యాటిసన్ ముఖ్యమంత్రికి చెప్పారు.

ఏపీలోని గోదావరి ప్రాంతానికి చెందిన మూర్తి ఎర్రంకి ఈ సంస్థకు సాంకేతిక విభాగాధిపతిగా వ్యవహరిస్తున్నారని తెలుసుకుని ముఖ్యమంత్రి ఆయనను అభినందించారు. టెర్మినల్ ఏర్పాటుకు ఆస్ట్రేలియన్ ఎల్ఎన్‌జీ దిగ్గజం ముందుకురావడం మంచి పరిణామమన్ర సిఎం, కొనుగోలు వ్యవహారాలలో (బై బ్యాక్) ప్రభుత్వం ఎటువంటి భరోసా ఇవ్వబోదని సంస్థ ప్రతినిధులకు స్పష్టంచేశారు. ఏపీలో గ్యాస్‌గ్రిడ్ ఏర్పాటు చేస్తున్నామని, రానున్న కాలంలో వ్యవసాయాధారిత పరిశ్రమలు రాష్ట్రానికి విరివిగా రానున్నందున కోల్డ్ ఎనర్జీ అవసరాలు విస్తృతం కానున్నాయని చెప్పారు.

చమురు, సహజవాయు రంగంలో 60 ఏళ్ల అనుభవం ఉన్న అతి పెద్ద ఆస్ట్రేలియన్ స్వత్రంత్ర సంస్థ ‘ఉడ్‌సైడ్ ఎనర్జీ లిమిటెడ్’ రాష్ట్రంలో రూ.8 వేల కోట్ల మేర పెట్టుబడులు పెట్టే అవకాశం ఉందని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఆర్థికాభివృద్ధి మండలి ముఖ్య కార్యనిర్వాహకాధికారి జాస్తి కృష్ణకిశోర్ చెప్పారు. దాదాపు 1200 మందికి ప్రత్యక్షంగా, మరో 2 వేల మందికి పరోక్షంగా ఉద్యోగ, ఉపాధి అవకాశాలు దక్కనున్నాయని వివరించారు. ఆస్ట్రేలియన్ బృందంలో కౌన్సిల్ జనరల్ (చెన్నయ్) షాన్ కెల్లి, వెస్ట్‌సైడ్ ఎనర్జీ సంస్థ ఎగ్జిక్యూటీవ్ వైస్ ప్రెసిడెంట్ వాన్‌విక్ పాంటర్, మార్కెటింగ్ మేనేజర్ మాథ్యూ టన్ బిల్, ఏపీ మౌలిక సదుపాయాల శాఖ ముఖ్య కార్యదర్శి అజయ్‌జైన్, ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు కుటుంబరావు, ముఖ్యమంత్రి ముఖ్య కార్యదర్శి జి. సాయిప్రసాద్ సమావేశంలో పాల్గొన్నారు.

Related posts

Leave a Comment