కేంద్రాన్ని కోరుతూ నేడు అసెంబ్లీలో తీర్మానం
ఓవైపు కాపు, బలిజ, ఒంటరి, తెలగ కులాలను బీసీలలో చేర్చి విద్య, ఉపాధి రంగాల్లో రిజర్వేషన్లు కల్పించాలన్న ప్రతిపాదనకు ఆమోదం తెలిపిన రాష్ట్ర మంత్రి మండలి.. అంతకంటే ముందునుంచీ ఉన్న మరో డిమాండ్ ను కూడా శుక్రవారం పరిగణనలోకి తీసుకుంది. ఇప్పటివరకు బీసీలుగా ఉన్న వాల్మీకులు, బోయలను షెడ్యూలు తెగల జాబితాలో చేర్చాలని కేంద్రాన్ని కోరుతూ తీర్మానం చేసింది. ఈ అంశంపైన శనివారం శాసనసభలో తీర్మానాన్ని ప్రవేశపెట్టాలని నిర్ణయించింది.
ఇకపైన వాల్మీక, బోయ కులస్తులను గిరిజనులుగా గుర్తించి విద్య, ఆర్థిక, సామాజిక, రాజకీయ, ఉద్యోగ అంశాలలో రిజర్వేషన్లు కల్పించాలన్నది రాష్ట్ర ప్రభుత్వ ఉద్ధేశం. ఆ పని కేంద్రం చేయవలసి ఉంటుంది. బోయలను ఎస్టీల జాబితాలో చేర్చాలని కేంద్రానికి విన్నవిస్తూ శనివారం శాసనసభ తీర్మానం చేయనుంది. రాష్ట్రంలో బోయలు 23 లక్షలమంది వరకు ఉన్నట్టు అంచనా. అందులో ప్రధానంగా అనంతపురం, కర్నూలు జిల్లాల్లో ఎక్కువ సంఖ్యలో ఉన్నారు. రాష్ట్ర మంత్రి మండలిలో సభ్యునిగా ఉన్న కాలవ శ్రీనివాసులు బోయ సామాజికవర్గానికి చెందినవారు.
కాపులను బీసీలలో చేర్చడం మాదిరే బోయలను ఎస్టీలుగా గుర్తించాలన్నది తెలుగుదేశం పార్టీ ఎన్నికల హామీ. జస్టిస్ మంజునాథ కమిషన్ నియామకం తర్వాత కాపు రిజర్వేషన్ల అంశంతోపాటు బోయల అంశంపైనా అధ్యయనం జరిగింది. కాపు రిజర్వేషన్లపై భిన్నాభిప్రాయాలున్నా బీసీ కమిషన్ సభ్యుల్లో బోయల అంశంపై ఏకాభిప్రాయం వ్యక్తమైనట్టు సమాచారం. శుక్రవారం మంత్రి మండలి సమావేశం నిర్ణయం తర్వాత సహచర మంత్రివర్గ సభ్యులు.. కాలవ శ్రీనివాసులును అభినందించారు.