చేతివృత్తుల్లో ఉన్న బలహీనవర్గాల ప్రజలకు చేయూతనిచ్చేలక్ష్యంతో ఆదరణ పథకానికి రాష్ట్ర కేబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. గతంలోఉమ్మడి రాష్ట్రంలో ముఖ్యమంత్రిగా పని చేసినప్పుడు ఈ పథకాన్ని ప్రవేశపెట్టిన చంద్రబాబునాయుడు, ఇప్పుడు ఆదరణ-II పేరుతో ఆ పథకాన్ని పునరుద్ధరిస్తున్నారు.శనివారం ఈ పథకానికి రాష్ట్ర మంత్రి మండలి ఆమోదం తెలిపింది. రూ. 300 కోట్ల అంచనా వ్యయంతో కొత్త ఆర్థిక సంవత్సరంలో ఏప్రిల్ నుంచి ఆదరణ-IIను అమలు చేయాలని నిర్ణయించారు.
వచ్చే ఏప్రిల్ నుంచి అమలు కానున్న పథకంతో 2.5 లక్షల మంది లబ్ధి పొందుతారని ప్రభుత్వం తెలిపింది. ఆంద్రప్రదేశ్ వెనుకబడిన తరగతుల ఫైనాన్స్ కార్పొరేషన్ ద్వారా పనిముట్లను అందిస్తారు. వెనుకబడిన తరగతుల సంక్షేమ శాఖ ‘ఆదరణ’ పథకాన్ని పునః ప్రారంభించాలని గతంలో (ముఖ్యమంత్రి) చేసిన సూచనల మేరకు ఆ పథకాన్ని పున: ప్రారంభిస్తున్నారు. ఈ పథకం కోసం 2017-18 ఆర్ధిక సంవత్సరంలోనే రూ. 300 కోట్లు కేటాయించారు.
ఈ పథకం ద్వారా గొర్రెలు, పశువుల పెంపకందారులు, కల్లుగీత కార్మికులు, మత్స్యకారులు, చేనేత, బంగారం, వడ్రంగి, కుమ్మరి, రజక, నాయి బ్రాహ్మణులు వంటి 124 వెనుకబడిన తరగతుల వారికి ఉపయోగపడుతుంది. ఈ పథకం క్రింద 3 స్లాబుల్లో రూ.30 వేలు, 20 వేలు, 10 వేల చొప్పున ఆర్ధిక సాయం అందిస్తారు. 70 శాతం సబ్సిడీ, 20 శాతం NBCFDC రుణం, 10 శాతం లబ్దిదారుల వాటా ఉంటుంది.