ఐదుగురు జడ్జిలు… 10 నిమిషాల సమావేశం

1 0
Read Time:4 Minute, 22 Second

జడ్జిలు లేవనెత్తిన అంశాలపై వార్తలను నిరోధించాలని పిటిషన్
తోసిపుచ్చిన ప్రధాన న్యాయమూర్తి బెంచ్

సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి తీరు, సుప్రీంకోర్టు పనితీరుపై నలుగురు సీనియర్ మోస్ట్ జడ్జిలు లేవనెత్తిన ప్రశ్నలకు ఇంకా సమాధానం దొరకలేదు.. సంధి కుదరలేదు. ఆ నలుగురు జడ్జిలు… జస్టిస్ జాస్తి చలమేశ్వర్, జస్టిస్ రంజన్ గొగొయ్, జస్టిస్ జోసెఫ్ కురియన్, జస్టిస్ మదన్ బి. లోకూర్..లతో ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ దీపక్ మిశ్రా గురువారం సమావేశమయ్యారు. అయితే, అది కేవలం 10 నిమిషాల సమావేశమే.

గురువారం ఉదయం 10:30 గంటలకు కోర్టు కార్యకలాపాలు ప్రారంభమయ్యే ముందు ఈ ఐదుగురు సీనియర్లు సమావేశమయ్యారు. ఈ సమావేశం బుధవారమే జరగాల్సి ఉండగా జస్టిస్ జాస్తి చలమేశ్వర్ కోర్టుకు హాజరు కాకపోవడంవల్ల వాయిదా పడింది. గురువారం అతి క్లుప్తంగా జరిగిన సమావేశంలో… చీఫ్ జస్టిస్ మిశ్రాకు నలుగురు సీనియర్లతో తలెత్తిన విభేదాలపై చర్చ జరిగినట్టు లేదు. ఉద్రిక్తతలను తగ్గించడానికి ఉద్దేశించిన ఈ సమావేశానికి ఈ ఐదుగురు మినహా మరే న్యాయమూర్తీ హాజరు కాలేదు.

సుప్రీంకోర్టు చరిత్రలోనే తొలిసారిగా… అనూహ్యంగా నలుగురు సీనియర్ మోస్ట్ జడ్జిలు గత 12వ తేదీన విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి మరీ ప్రధాన న్యాయమూర్తి పనితీరుపై ఆక్షేపణ తెలిపారు. దేశాన్ని ప్రభావితం చేసే కేసుల విచారణ బాధ్యతను ఎంపిక చేసిన జడ్జిలకు అప్పగిస్తున్నారంటూ ప్రధాన న్యాయమూర్తిపై వారు ధ్వజమెత్తారు. ప్రధాన న్యాయమూర్తికి రాసిన లేఖనూ పత్రికలకు విడుదల చేశారు. ప్రస్తుతం సుప్రీంకోర్టు నడుస్తున్న తీరుతో ప్రజాస్వామ్యానికే ప్రమాదమని వారు ఆందోళన వ్యక్తం చేయడం దేశంలో కలకలం రేపింది.

ఆయా న్యాయమూర్తులు లేవనెత్తిన ప్రశ్నలకు ప్రధాన న్యాయమూర్తి బదులివ్వాలని పలువురు సూచించారు. అభ్యంతరాలు వ్యక్తం చేసిన న్యాయమూర్తులతో స్వయంగా చర్చించాలన్న సూచనలూ వ్యక్తమయ్యాయి. ఈ నేపథ్యంలో గురువారం సమావేశం జరిగింది. తర్వాత సుప్రీంకోర్టులో ఓ ఆసక్తికర అంశం చోటు చేసుకుంది.

వార్తలను నిరోధించడానికి నో

గురువారం టాప్ జడ్జిల సమావేశం తర్వాత ప్రారంభమైన సుప్రీంకోర్టు కార్యకలాపాలలో… వారికే సంబంధించిన ఓ అంశం ప్రస్తావనకు వచ్చింది. గత 12వ తేదీన జడ్జిలు లేవనెత్తిన అంశాలపై వార్తలు ప్రచురించడాన్ని, చర్చలు జరపడాన్ని, రాజకీయం చేయడాన్ని నిరోధించాలంటూ వచ్చిన విన్నపాన్ని చీఫ్ జస్టిస్ దీపక్ మిశ్రా నాయకత్వంలోని ధర్మాసనం తోసిపుచ్చింది. ఆ పిటిషన్ కోర్టు రిజిస్ట్రీ స్వీకరించిన తర్వాత విచారణకు లిస్టయినప్పుడే ఆ అంశాన్ని పరిశీలిస్తామని ధర్మాసనం స్పష్టం చేసింది.

అయితే, ఈ విషయంలో సుప్రీంకోర్టు ప్రతిష్ఠకు మరింత నష్టం జరగకుండా… వార్తల ప్రచురణను, డిబేట్లను నిరోధించేందుకు పిటిషన్ ను అత్యవసరంగా లిస్టు చేసి విచారించాలని పిటిషనర్ కోరారు.

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
100 %

Leave a Reply