ఐసిజెలో ఇండియా స్థానం పదిలం… పోటీనుంచి తప్పుకున్న యుకె

జడ్జిల ప్యానల్ లో యుకెకు చోటు దక్కకపోవడం 71 సంవత్సరాల్లో తొలిసారి

అంతర్జాతీయ న్యాయస్థానంలో చివరి జడ్జిగా భారతీయుడు దల్వీర్ భండారి ఎన్నికయ్యారు. ఆయన ఐసిజె ప్యానల్ లోకి ఎన్నిక కావడం ఇది రెండోసారి. నాటకీయ పరిణామాల మధ్య యుకెకి చెందిన క్రిస్టోఫర్ గ్రీన్ వుడ్ పోటీనుంచి తప్పుకోవడంతో భండారీ ఎన్నిక ఖాయమైంది. ఐసిజె జడ్జిల ప్యానల్ లోని 15 మందిలో చివరి పోస్టుకు తాజాాగా ఎన్నిక జరిగింది. దానికోసం యునైటెడ్ కింగ్డమ్, ఇండియా తీవ్రంగా పోటీ పడ్డాయి. ఐసిజెలో న్యాయమూర్తి కావాలంటే ఐక్యరాజ్య సమితి సాధారణ అసెంబ్లీలోనూ, భద్రతా మండలిలోనూ ఓటింగ్ లో మెజారిటీ సాధించాలి.

అయితే, చివరి పోస్టుకోసం ఇటీవల జరిగిన ఓటింగ్ లో సాధారణ అసెంబ్లీలో భండారి 121 ఓట్లు సాధించగా గ్రీన్ వుడ్ 68 ఓట్లతో సరిపెట్టుకున్నారు. భద్రతా మండలిలో మాత్రం భండారీకి ఐదు ఓట్లు మాత్రమే ఉండగా గ్రీన్ వుడ్ కు 9 ఓట్లు ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఇరు పక్షాలూ ప్రతిష్ఠాత్మకంగా తీసుకొని దౌత్య పరంగా పెద్ద ఎత్తున లాబీయింగ్ చేశాయి. తదనంతర పరిణామాలు యుకెపై తీవ్ర స్థాయిలో ఒత్తిడిని పెంచాయి. భద్రతా మండలిలోని శాశ్వత దేశాల్లో ఒకటిగా యుకె తన పలుకుబడిని ఉపయోగించి ఐసిజె న్యాయమూర్తి పదవిని దక్కించుకుంటే… కామన్ వెల్త్ దేశాల కూటమినుంచి ఇండియా బయటకు రావాలన్న డిమాండ్ కూడా ఊపందుకుంది.

దీనికి తోడు… యూరోపియన్ యూనియన్ నుంచి బయటకు వచ్చాక ఇండియాతో వాణిజ్య సంబంధాలు కీలకం కావడంతో యుకె తీవ్ర ఒత్తిడికి లోనైంది. దీంతో సోమవారం జరగాల్సిన 11వ రౌండ్ ఓటింగ్ కు కొద్ది నిమిషాల ముందు తమ అభ్యర్ధిత్వాన్ని విరమించుకుంటున్నట్టు ఓ లేఖను సమర్పించింది. దీంతో భండారీతో చివరి జడ్జి స్థానం భర్తీ అయింది.

బ్రిటన్ కు చెందిన న్యాయమూర్తి లేకుండా ఐసిజె ప్యానల్ నడవడం 71 సంత్సరాల్లో ఇదే మొదటిసారి. ఐసిజె ఏర్పాటయ్యాక ప్రతి ప్యానల్ లోనూ యుకెకు స్థానం ఉంది. తొమ్మిదేళ్ళ కాలానికి జడ్జిలను ఐక్యరాజ్య సమితి సాధారణ అసెంబ్లీ, భద్రతా మండలి ఎన్నుకుంటాయి. గత రౌండ్లలో జరిగిన ఓటింగ్ సందర్భంగా బ్రెజిల్, ఫ్రాన్స్, లెబనాన్, సోమాలియా దేశాలకు చెందిన నలుగురు ఎన్నికయ్యారు.

ఐక్యరాజ్యసమితిలో భద్రతా మండలి సభ్యుల పెత్తనంపై సాధారణ సభ్య దేశాలలో గూడుకట్టుకొని ఉన్న వ్యతిరేకత అక్కడ ఇండియాకు మూడింట రెండొంతుల ఓట్లను సాధించి పెట్టిందని అంతర్జాతీయ పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. దానికి తోడు వ్యక్తిగతంగా యుకె అభ్యర్ధిపై… ఇరాక్ విషయంలో టోనీ బ్లెయిర్ కు తప్పడు సలహాలు ఇచ్చారన్న ఆరోపణలున్నాయి.

Related posts

Leave a Comment