జాతీయ ఓటరు దినోత్సవాన్ని రాష్ట్ర సమాచార, పౌర సంబంధాల శాఖ గురువారం ఘనంగా నిర్వహించింది. విజయవాడ బస్ స్టేషన్ ఆవరణలోని సమాచార శాఖ కార్యాలయంలో కమిషనర్ ఎస్. వెంకటేశ్వర్, అదనపు డైరెక్టర్ కృష్ణానంద్, ఇతర అధికారులు, సిబ్బంది ఓటరు ప్రతిజ్ఞ చేశారు.
‘‘భారతదేశ పౌరులమైన మేము ప్రజాస్వామ్యంపై విశ్వాసంతో మనదేశ ప్రజాస్వామ్య సంప్రదాయాలను, స్వేచ్ఛాయుత, నిష్పక్షపాత, ప్రశాంత ఎన్నికల ప్రాభవాన్ని నిలబెడతామని.. మతం, జాతి, కులం, వర్గం, భాష లేదా ఎటువంటి ఒత్తిడులకు ప్రభావితం కాకుండా ప్రతి ఎన్నికల్లో నిర్భయంగా ఓటు వేస్తామని ప్రతిజ్ఞ చేస్తున్నాం’’ అని సమాచార శాఖ సిబ్బంది ప్రతిన పూనారు. సిబ్బంది అందరిచేత కమిషనర్ వెంకటేశ్వర్ ఈ ప్రతిజ్ఞ చేయించారు.
కొత్త ఓటర్లను చేర్పించడం, తద్వారా యువతను రాజకీయ ప్రక్రియలో భాగస్వాములను చేయడం లక్ష్యంగా ఏడేళ్ళ క్రితం తొలిసారి జాతీయ ఓటరు దినోత్సవాన్ని నిర్వహించారు. 2011లో కేంద్ న్యాయ శాఖ ప్రతిపాదనను అప్పటి ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ ఆమోదించడంతో ఓటరు దినోత్సవం ప్రారంభమైంది. ఏటా జనవరి 25న ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. ఎన్నికల కమిషన్ కొత్త ఓటర్ల నమోదుకు, అవగాహన పెంచడానికి ఈ కార్యక్రమాన్ని వినియోగించుకుంటోంది.
ఓటు హక్కుపై చైతన్యంకోసమే…
ఓటుహక్కుపై అన్ని వర్గాల్లో చైతన్యం తెచ్చేందుకు జనవరి 25న జాతీయ ఓటరు దినోత్సవాన్ని పాటిస్తున్నామని సమాచార కమిషనర్ ఎస్. వెంకటేశ్వర్ చెప్పారు. ఓటరు తన ఓటు విలువ తెలుసుకోవాలని ఆయన సూచించారు. ఏ ప్రజాస్వామ్య దేశంలోనైనా ప్రజలే నిర్ణేతలని, తమ మనోభావాలను ప్రకటించేందుకు జనం చేతిలో ఉన్న పదునైన ఆయుధం ‘ఓటు’ అని పేర్కొన్నారు. ఓటుహక్కు కలిగి ఉండడం ఈ దేశ పౌరుడిగా ఒక గౌరవమని, ఓటు వేయడం కనీస బాధ్యత అని ఓటర్లంతా గుర్తించాలని ఆయన కోరారు. ప్రజల గళం వినిపించాలన్నా, ప్రజాస్వామ్య వ్యవస్థ పదిలంగా ఉండాలన్నా ఓటర్లుగా నమోదై, ఓటు వేయడం తప్పనిసరి అని అభిప్రాయపడ్డారు.
ఓటు వేయడం ప్రజల కనీస బాధ్యత అని సమాచార, పౌర సంబంధాల శాఖ అదనపు డైరెక్టర్ కృష్ణానంద్ చెప్పారు. పల్లె నుంచి పార్లమెంటు వరకూ ఏ స్థాయిలో ఎన్నికలు జరిగినా 18 ఏళ్లు నిండిన ప్రతి ఒక్కరూ ఓటు వేయాలని ఆయన సూచించారు. ఈ కార్యక్రమంలో ఇంకా సమాచార శాఖ జాయింట్ డైరెక్టర్లు మూర్తి, పి. కిరణ్ కుమార్, రీజినల్ ఇన్ఫర్మేషన్ ఇంజినీర్ నాగరాజు, శాఖ ఉద్యోగులు పాల్గొన్నారు.