ప్రముఖ నటుడు ఉపేంద్ర కర్నాటకలో కొత్త పార్టీని ప్రకటించారు. కర్నాటక ప్రజ్న్యావంత జనతా పార్టీ (కెపిజెపి) పేరిట ఆయన పార్టీని స్థాపించారు. ’సమూల మార్పు’ నినాదాన్ని ఉపేంద్ర అందుకున్నారు. మంగళవారం బెంగళూరులోని ఒక ఆడిటోరియంలో పరిమిత స్థాయిలో ఆహ్వానించిన అతిధులు, అభిమానుల మధ్య ఉపేంద్ర కొత్త పార్టీని ప్రకటించారు. తమ పార్టీ ఎవరితోనూ పొత్తు పెట్టుకోబోదని ఆయన ప్రకటించారు. కర్నాటక అసెంబ్లీకి వచ్చే ఏడాది ఎన్నికలు జరగాల్సి ఉంది.
రాష్ట్రంలో ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉండగా బీజేపీ అధికారంకోసం కాచుకు కూర్చుంది. మరో ప్రధాన రాజకీయ పార్టీ జనతాదళ్ సెక్యులర్ రంగంలో ఉంది. ఇప్పుడు కొత్తగా ప్రారంభమైన ఉపేంద్ర పార్టీ ఏమేరకు ప్రజలను ప్రభావితం చేస్తుందన్నది రానున్న కొద్ది నెలల్లో తెలుస్తుంది.
సినిమాల్లో వైవిధ్యం చూపించే ఉపేంద్ర… ప్రకటనలోనూ భిన్నత్వాన్ని చూపించారు. పార్టీ ప్రకటన సందర్భాన్ని కవర్ చేయడానికి వచ్చిన మీడియా ప్రతినిధులను వేదికపైకి పంపి.. తాను ఆడియన్స్ మధ్య ఉండి మాట్లాడారు. తన ప్రాధాన్యతలను రేఖామాత్రంగా ప్రకటించిన ఉపేంద్ర… స్మార్ట్ నగరాలకంటే స్మార్ట్ గ్రామాల ఆవశ్యకత ఎక్కువగా ఉందంటూ బీజేపీపై ఓ సెటైర్ వేశారు.