2017లో అంతమందిని చంపినట్టు ప్రకటన
ఈ ఏడాది కశ్మీర్ లో 190 మంది ఉగ్రవాదులు హతమయ్యారని ఆర్మీ వెల్లడించింది. దీనివల్ల లోయలో పరిస్థితి బాగా మెరుగైందని ఆర్మీ అధికారులు అభిప్రాయపడ్డారు. నిన్న జరిగిన ఎన్ కౌంటర్లో భద్రతా దళాలు ఆరుగురు టెర్రరిస్టులను కాల్చి చంపిన నేపథ్యంలో అధికారులు ఆదివారం విలేకరులతో మాట్లాడారు. తాజా ఆపరేషన్లో మరణించిన ఉగ్రవాదులలో లక్వీ మేనల్లుడితోపాటు మరో ఇద్దరు లష్కర్ ఎ తోయిబా కమాండర్లు ఉన్నట్టు జమ్మూ కశ్మీర్ పోలీసు డైరెక్టర్ జనరల్ ఎస్.పి. వేద్ తెలిపారు.
నిఘా సమాచారం ఆధారంగా హాజిన్ ప్రాంతంలోని చాన్దర్గీర్ గ్రామంలో భద్రతా దళాలు తనిఖీలు నిర్వహిస్తుండగా ఎన్ కౌంటర్ చోటు చేసుకుందని వేద్ చెప్పారు. బందిపొరా జిల్లాలోని హాజిన్ ప్రాంతం ఉగ్రవాద కార్యకలాపాలకు కేంద్రంగా మారిందని, ఇప్పుడు ఎల్ఇటి ముఖ్యలను ఏరివేయడంతో స్థానికులకు ఊరట లభించిందని పేర్కొన్నారు. ఉగ్రవాద సంస్థలు లాగిన యువకుల్లో ఎవరైనా… ఆ కార్యకలాపాలనుంచి బయటపడి సాధారణ స్రవంతిలోకి కలవాలనుకుంటే 14411 హెల్ప్ సెంటర్ కు ఫోన్ చేయవచ్చని సూచించారు. ఇది కేవలం కశ్మీరీ యువతకు మాత్రమే వర్తిస్తుందని స్పష్టం చేశారు.
కశ్మీర్ లోయలో ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాద సంస్థ గురించిన భయం అక్కర్లేదని 15 కార్ప్స్ కమాండర్ లెఫ్టినెంట్ జనరల్ జె.ఎస్. సంధు అభిప్రాయపడ్డారు. శుక్రవారం శ్రీనగర్లో జరిగిన బాంబు పేలుడు తమ పనేనని ఇస్లామిక్ స్టేట్ ప్రకటించిన నేపథ్యంలో సంధు ఈ వ్యాఖ్య చేశారు. దర్యాప్తు పూర్తి కాకుండానే నిర్ధారణకు రావడం సరి కాదని ఆయన పేర్కొన్నారు. హాజిన్ ప్రాంతంలో సెప్టంబర్ మధ్యలో అనేక ఆపరేషన్లు చేపట్టామన్నారు.
సంధు స్థానికులకు (కశ్మీరీలకు) ఓ సూచన, ఓ హెచ్చరిక కూడా చేశారు. పాకిస్తాన్ చర్యలను గమనించాలని, ఆ దేశ ప్రయోజనాలకు అనుగుణంగా నడుచుకుంటున్నామేమో ఆలోచించుకోవాలని సూచించారు. టెర్రిరిస్టు కార్యకలాపాల్లో కొనసాగితే మాత్రం… నాన్ కశ్మీరీ టెర్రరిస్టులకు ఎదురైన స్థితే తప్పదని హెచ్చరించారు.