పోలవరం ప్రాజెక్టు కాంట్రాక్టర్ ను మార్చబోమని కేంద్ర జలవనరుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ తేల్చి చెప్పారు. కాంట్రాక్టర్ మారి.. మళ్ళీ టెండర్లు పిలిస్తే ప్రాజెక్టు వ్యయం 30 శాతం పెరుగుతుందని ఆయన పేర్కొన్నారు. ఇదివరకు పోలవరం కాంట్రాక్టును దక్కించుకున్న ట్రాన్స్ ట్రాయ్ సంస్థ పనులు వేగంగా చేయడంలేదన్న అభిప్రాయంతో ఉన్న రాష్ట్ర ప్రభుత్వం కాంట్రాక్టర్ ను మార్చే ఆలోచన చేసింది. అయితే, పోలవరం జాతీయ ప్రాజెక్టు కావడంవల్ల కేంద్రమే దీనిపై నిర్ణయం తీసుకోవలసి ఉంటుంది.
ఈ నేపథ్యంలో సోమవారం ఢిల్లీలో ఆంధ్రప్రదేశ్ జలవనరుల విభాగం అధికారులతో సమావేశమైన గడ్కరీ అనంతరం విలేకరులతో మాట్లాడారు. పోలవరం కాంట్రాక్టర్ ను మార్చడంవల్ల అయ్యే అదనపు వ్యయాన్ని భరించడానికి కేంద్ర ప్రభుత్వం సిద్ధంగా లేదని గడ్కరీ స్పష్టం చేశారు. సబ్ కాంట్రాక్టుల ద్వరా నిర్మాణ పనులను వేగవంతం చేయాలన్న అభిప్రాయాన్ని ఆయన వ్యక్తం చేశారు. ప్రాజెక్టు పనుల బిల్లులు అందిన మూడు రోజుల్లోనే అందులో 75 శాతం నిధులను విడుదల చేయడం వంటి చర్యలు కేంద్రం నుంచి ఉంటాయన్నారు.