బీసీలలో చేరుస్తూ అదనంగా రిజర్వేషన్.. కొత్తగా బిసి-ఇ కేటగిరి
రాజకీయ రిజర్వేషన్లు ఉండవు…నేడు మళ్ళీ కేబినెట్..
బీసీ కమిషన్ ఛైర్మన్ లేకుండానే సభ్యుల సిఫారసులు
కాపులకు విద్యా, ఉద్యోగాలలో రిజర్వేషన్లు కల్పించాలన్న ప్రతిపాదనకు రాష్ట్ర మంత్రివర్గ సమావేశం ఆమోదం తెలిపింది. రాష్ట్రంలోని కాపు, బలిజ, ఒంటరి, తెలగ కులాలను బీసీలలో చేర్చి 5 శాతం రిజర్వేషన్లు కల్పించేందుకు మంత్రివర్గం అంగీకరించింది. జస్టిస్ మంజునాథ నేతృత్వంలో ఏర్పాటైన బీసీ కమిషన్లో ఆయన మినహా మిగిలిన సభ్యులు సభ్యులు కాపు రిజర్వేషన్లకు అనుకూలంగా నివేదికలు ఇచ్చారు. వారి సిఫారసులను శుక్రవారంనాడిక్కడ మంత్రివర్గ సమావేశం ఆమోదించింది. శనివారం ఉదయం 8:30 గంటలకు మరోసారి మంత్రివర్గ సమావేశం నిర్వహించి రిజర్వేషన్ల బిల్లుకు ఆమోదం తెలుపుతారు. వెంటనే 9:00 గంలకు ఈ బిల్లును అసెంబ్లీలో ప్రవేశపెడతారు. ఈ విధంగా వరుసగా రెండు రోజులు మంత్రివర్గం సమావేశం కావడం అరుదైన విషయం.
కాపు, బలిజ, ఒంటరి, తెలగ కులాలను బీసీలలో చేర్చడం ద్వారా రిజర్వేషన్లను అమలు చేయనున్నారు. ఇందుకోసం బీసీలలో ‘ఎఫ్’ కేటగిరిని చేర్చాలని నిర్ణయించారు. అయితే, ఇప్పటికే బీసీలకు ఇస్తున్న రిజర్వేషన్లలో కోత పడకుండా రిజర్వేషన్ల మొత్తాన్ని 5 శాతం మేరకు పెంచాలని ప్రభుత్వం నిర్ణయించింది. దీంతో రిజర్వేషన్ మొత్తం 55 శాతానికి చేరుతుంది. దీనికి సంబంధించిన బిల్లును శనివారం అసెంబ్లీలో ఆమోదించిన తర్వాత కేంద్ర ప్రభుత్వానికి నివేదించనున్నారు. బీసీ-ఎఫ్ కేటగిరిలో కాపు, బలిజ, ఒంటరి, తెలగలను చేర్చి వారికి విద్యా, ఉద్యోగాలలో, ప్రభుత్వ పథకాలలో 5 శాతం రిజర్వేషన్లు కల్పించాలన్నది మంత్రివర్గ నిర్ణయం. రాజకీయాలలో ఈ రిజర్వేషన్లు వర్తించవు. కాపులు ఆర్థికంగా వెనుకబడి ఉన్నారన్న అభిప్రాయానికి అనుగుణంగా కల్పిస్తున్న రిజర్వేషన్లివి.
తెలుగుదేశం పార్టీ అధినేత, ప్రస్తుత ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు ప్రతిపక్షంలో ఉండగా 2014 ఎన్నికలకు ముందు పాదయాత్ర చేసిన సమయంలో ఆయా కులాలకు హామీ ఇచ్చారు. పాదయాత్ర సందర్భంగా తూర్పు గోదావరి జిల్లా పిఠాపురంలో కాపులకు రిజర్వేషన్ల హామీ ఇచ్చిన చంద్రబాబు..అధికారంలోకి వచ్చాక దానిపై మల్లగుల్లాలు పడ్డారు. ఈలోగా ప్రభుత్వంపై విమర్శలు ప్రారంభమయ్యాయి. కాపులకు బ్రిటిష్ హయాంలోనే రిజర్వేషన్లు ఉన్నాయని, వాటిని పునరుద్ధరించాలని డిమాండ్లు వచ్చాయి. ఒక్క జీవోతో రిజర్వేషన్లు కల్పించవచ్చని కొందరు వాదించారు. అయితే, అలా చేస్తే కోర్టులలో నిలువదని, పద్ధతి ప్రకారం చేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు స్పష్టం చేస్తూ వచ్చారు.
ఏడాదిన్నర క్రితం కర్నాటక హైకోర్టు మాజీ సీనియర్ న్యాయమూర్తి జస్టిస్ మంజునాథ నేతృత్వంలో బీసీ కమిషన్ ను నియమించారు. బీసీ కమిషన్ ఏర్పడిన తర్వాత కాపు రిజర్వేషన్ల అంశమే వారికి అతి పెద్ద పని అయింది. పెండింగ్ లో ఉన్న దరఖాస్తుల దుమ్ము దులిపిన మంజునాథ కమిషన్… వివిధ వర్గాల విన్నపాలను కొత్తగా స్వీకరించింది. రాష్ట్రంలో అన్ని జిల్లాలూ తిరిగి ప్రజాభిప్రాయాన్ని సేకరించింది. ఏడాదిన్నర తర్వాత ఛైర్మన్ జస్టిస్ మంజునాథ అంగీకారం లేకుండానే మిగిలిన సభ్యులు సిఫారసులు చేశారు. శుక్రవారం మంత్రివర్గ సమావేశానికి హాజరైన కమిషన్ సభ్యులు తమ సిఫారసులను వెల్లడించారు. ఇప్పుడిక కాపు రిజర్వేషన్ల అంశం రెండో అంకంలోకి ప్రవేశించబోతోంది.