కాపు కోటాకు కేంద్రం బ్రేకులు…!

రాష్ట్రం పంపిన బిల్లుకు డీవోపీటీ కొర్రీలు

అనుకున్నంతా అయింది. కాపు, తెలగ, బలిజ, ఒంటరి కులాలను బీసీల జాబితాలో చేర్చి విద్య, ఉద్యోగ రంగాల్లో 5 శాతం రిజర్వేషన్లు కల్పించాలన్న రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయానికి కేంద్రం ఎర్ర జెండా ఊపింది. రిజర్వేషన్లు 50 శాతానికి మించరాదని రెండున్నర దశాబ్దాల క్రితం సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పునే ఉటంకిస్తూ కేంద్ర ప్రభుత్వ సిబ్బంది, శిక్షణా శాఖ (డీవోపీటీ) కేంద్ర హోం శాఖకు ఒక ఆఫీసు మెమొరాండం పంపింది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పంపిన రిజర్వేషన్ బిల్లును నిలిపివేయాలని హోంశాఖకు సూచించింది.

రాష్ట్రంలో కాపు, బలిజ, తెలగ, ఒంటరి కులాలకు రిజర్వేషన్ కల్పించడానికి వీలుగా వారిని బీసీలలో చేర్చడానికి ఉద్దేశించిన బిల్లును సరిగ్గా రెండున్నర నెలల క్రితం ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఆమోదించింది. గవర్నర్ ఆమోదంతో కేంద్రానికి చేరిన ఈ బిల్లుకు రాజ్యాంగపరమైన రక్షణకోసం రాష్ట్ర ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. రాజ్యాంగంలోని 9వ షెడ్యూలులో చేరిస్తే న్యాయసమీక్షకు అవకాశం ఉండదని భావించిన రాష్ట్ర ప్రభుత్వం, అందుకు సహకరించాలని కేంద్రాన్ని కోరింది. అయితే, రాజ్యాంగపరమైన రక్షణ మాట అటుంచి మొదటి దశలోనే కేంద్రం ‘కాపు రిజర్వేషన్ బిల్లు’ను తొక్కిపట్టింది.

రాష్ట్రంలో ఇదివరకే బీసీలకు 25 శాతం, ఎస్సీలకు 15 శాతం, ఎస్టీలకు 6 శాతం రిజర్వేషన్ ఉండగా బీసీలలో చేర్చిన ముస్లిం వర్గాలకు 4 శాతం రిజర్వేషన్ అమలవుతోంది. ఇప్పటికే రిజర్వేషన్ల మొత్తం 50 శాతానికి చేరగా… కాపులకు అదనంగా కల్పించేట్లయితే ఆ మొత్తం 55 శాతానికి చేరుతుంది. పలు రాష్ట్రాల్లో రిజర్వేషన్ల డిమాండ్లు కొత్తగా వచ్చినప్పుడు వాటికి ఇటు కేంద్ర ప్రభుత్వం, అటు సుప్రీంకోర్టు కూడా అంత సానుకూలంగా స్పందించలేదు.

ఇటీవల కాపు రిజర్వేషన్ బిల్లు కేంద్రానికి వెళ్లిన నేపథ్యంలో గుజరాత్ ఎన్నికలు జరిగాయి. ఇక్కడ కాపుల తరహాలోనే అక్కడ పటేళ్ళు రిజర్వేషన్లకోసం ఉద్యమించగా… కాంగ్రెస్ పార్టీ వారికి అనుకూలంగా వ్యవహరించింది. అయితే, సుప్రీంకోర్టు తీర్పునకు భిన్నంగా 50 శాతానికి మించి రిజర్వేషన్లు ఇచ్చే అవకాశం లేదని ఆ ఎన్నికల ప్రచారంలోనే ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తేల్చి చెప్పారు. పార్లమెంటు, ఇతర వేదికలపైనా 50 శాతం పరిమితిని కేంద్రం పునరుద్ఘాటిస్తోంది.

ఈ నేపథ్యంలో డీవోపీటీ రెండు అంశాలను తన మెమోలో ప్రస్తావించింది. ఒకటి.. సుప్రీంకోర్టు తీర్పు. రెండు… కేంద్ర ప్రభుత్వం చేపట్టిన బీసీల వర్గీకరణ. ఆంధ్రప్రదేశ్ రిజర్వేషన్ బిల్లును (ప్రస్తుతానికి) నిలిపివేసేందుకు కేంద్రం ఈ రెండు కారణాలనూ చూపుతోంది. సుప్రీంకోర్టు తీర్పును ప్రస్తావించిన సందర్భంలోనే జనాభా దామాషాలో రిజర్వేషన్ ఇవ్వాలని రాజ్యాంగం చెప్పలేదని పేర్కొంది. ఏపీ రిజర్వేషన్ బిల్లులోని ప్రతిపాదనలు దామాషా ప్రకారం చేసినవి కాకపోయినా… మొత్తం రిజర్వేషన్ 50 శాతం దాటకూడదన్న వాదనకు మద్ధతుగా సుప్రీం తీర్పులోని ఈ అంశాన్ని డీవోపీటీ ముందుకు తెచ్చింది.

Related posts

Leave a Comment