కాబోయే సిఎం… రేవంత్ రెడ్డి కొడంగల్ సమావేశ స్వరమిది!

1 0
Read Time:8 Minute, 51 Second
కార్యకర్తల నినాదాలు.. రేవంత్ ప్రసంగంలో నర్మగర్భ వ్యాఖ్యలు..
పత్రికా వార్తలన్నిటినీ ఖండిస్తున్నట్టు ప్రకటన..
నాయకుడి నమ్మకాన్ని వమ్ము చేయబోనని ఉద్ఘాటన

మీ ఆశీస్సులుంటే.. ఈ రాష్ట్రంలో ఏ నియోజకవర్గానికైనా నిధులు విడుదల చేయడానికి సంతకం పెట్టే శక్తి కొడంగల్ నియోజకవర్గానికి ఉంది’’

ఆదివారం కొడంగల్ నియోజకవర్గంలో తనను కలవడానికి వచ్చిన కార్యకర్తలను ఉద్దేేశించి టీటీడీపీ కార్యనిర్వాహక అధ్యక్షుడు రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్య ఇది. రాష్ట్ర ముఖ్యమంత్రి పదవిపై ఆకాంక్షను ఇదివరకు బహిరంగంగానే వ్యక్తీకరించిన రేవంత్ రెడ్డి…కార్యకర్తల సమక్షంలో పరోక్షంగా ప్రస్తావించారు. అదే సమయంలో సమావేశానికి హాజరైన కార్యకర్తల్లో కొందరు ’కాబోయే సిఎం రేవంత్ రెడ్డి… జిందాబాద్’ అంటూ నినాదాలు అందుకున్నారు. స్థూలంగా కొండగల్ కార్యకర్తల సమావేశ స్వరం ’భవిష్యత్ సిఎం’.

కొడంగల్ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికైన రేవంత్.. టీడీపీలో మిగిలిన ముగ్గురు ఎమ్మెల్యేలలో ముఖ్యుడు. ఆయన ఇటీవల ఢిల్లీ వెళ్లి కాంగ్రెస్ ఉఫాధ్యక్షుడు రాహుల్ గాంధీని కలసినప్పటినుంచీ ఆ పార్టీలో చేరతారన్న వార్తలు వచ్చాయి. వాటిని ఇప్పటిదాకా సూటిగా ఖండించని రేవంత్ రెడ్డి.. అటు సొంత పార్టీ నేతలతో సమావేశంలోగానీ, పత్రికా విలేకరులతోగానీ ’కాంగ్రెస్ పార్టీలో చేరను’ అని చెప్పలేదు.

ఆదివారం కొడంగల్ వెళ్ళిన రేవంత్ కార్యకర్తలతో భేటీ అయ్యారు. అక్కడే విలేకరులతో మాట్లాడారు. పత్రికల్లో, ఎలక్ట్రానిక్ మీడియాలో తనపై వచ్చిన వార్తలన్నిటినీ ఖండిస్తున్నట్టు రేవంత్ చెప్పారు. ’పత్రికలు సంయమనం పాటించాలి. సుదీర్ఘ కాలం కష్టపడి పేదల్లో పని చేసి రాష్ట్రంలో గుర్తింపు తెచ్చుకున్నా. మీ వ్యాపార పోటీలో భాగంగా మమ్మల్ని ఇబ్బంది పెట్టొద్దు. మా పార్టీ నాయకులు కూడా వివిధ పార్టీలలోకి పోతున్నారని లిస్టులు పెట్టి మనో వేధనకు గురి చేస్తున్నారు’ అని రేవంత్ మీడియాను ఆక్షేపించారు. తనపైన, తమ పార్టీలోని సహచరులపైనా పార్టీ మారుతున్నారంటూ వచ్చిన వార్తలు మొత్తానికి మీడియావారినే బాధ్యులను చేశారు రేవంత్ రెడ్డి.!

పత్రికలపై ఆయన చేసిన వ్యాఖ్యలు సూటిగా…

రాజకీయం రహస్యం కాదు.. ప్రజలమధ్యలో ఉండి పేదలకు సేవ చేయవలసిన విషయం.. అందుకోసం తమ జీవితాలను పణంగా పెట్టి పని చేస్తున్న నాయకుల ప్రతిష్ఠకు భంగం కలిగేలా చేయకండి’’

పాత్రికేయులకు వ్యాపార పోటీ ఉంది. కానీ, మీరు మా జీవితాలతో చెలగాటమాడొద్దు. మేం ఏం మాట్లాడామో అదే రాయండి. వేధించకండి. ఫోన్ గంటకు రెండుసార్లు స్విఛాఫ్ చేయవలసి వస్తోంది. చెవులు వాచిపోతున్నాయి’’

నా అధిష్ఠానం కొడంగల్ ప్రజలు

పార్టీ మార్పు వార్తల్లో తన బాధ్యత ఏమీ లేదన్నట్టు చెప్పకొచ్చిన రేవంత్ రెడ్డి భవిష్యత్ ఆకాంక్షలను వ్యక్తీకరిస్తూ కొడంగల్ ప్రజానీకాన్ని పదే పదే కొనియాడారు.

నేను రాజకీయాల్లో ఉన్నంత కాలం కొడంగల్ నుంచే పోటీ చేస్తా. నా అధిష్ఠానం మీరు. మీ అభీష్ఠంమేరకే నడుచుకుంటా..గానీ ఎవరో చెప్పిన మాటను బట్టి కాదు’’

నేను ఏం చేసినా మీకోసమే. నేను ఎక్కే ప్రతి మెట్టులో మీ అభివృద్ధి, మీ గౌరవం, గుర్తింపు ఉంటాయి. గుర్తు పెట్టుకుంటా.. గుండెల్లో పెట్టుకుంటా.. సమయం వచ్చినప్పుడు అంతకు పదింతలు సాయం చేస్తా’’

ఒకప్పుడు కార్యకర్తలు ఎవరైనా హైదరాబాద్ వెళ్ళి మాది కొడంగల్ అంటే.. వరంగలా అని అడిగేవారు. ఇప్పుడు కొడంగల్ అంటే మీ నాయకుడు రేవంత్ రెడ్డి కదా? అని అడిగే పరిస్థితి వచ్చింది’’

మీరు అమెరికాకు పోయినా మా నాయకుడు రేవంత్ రెడ్డి అని తలెగరేసేలా నా నిర్ణయాలు ఉంటాయి. తలదించుకునేలా ఉండవు. ఎవడో చెప్పినట్టుగా నా నిర్ణయాలు ఉండవు. మనకు ఆత్మగౌరవం, ఆత్మ విశ్వాసం ఎక్కువ’’

తన కుటుంబం కోసం ఒక్క రూపాయి కూడా సంపాదించాల్సిన అవసరం లేదని, వారికోసం ఒక్క క్షణం పరితపించాల్సిన పని లేదని రేవంత్ చెప్పారు.

ఇది వెన్నుపోటు… అయినా ఏం పీకలేరు!

తనమీద జరిగిన ప్రచారం ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు వెన్నుపోటు ప్రయత్నాల్లో భాగమన్నట్టుగా రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు.

జైలుకు తోలినా ఏం చేయలేకోయాం. మంత్రి పదవి ఆశ చూపినా ఫలితంలేదు. వేల కోట్ల కాంట్రాక్టులు ఇస్తానన్నా లొంగలేదు. అందుకే… వెన్నుపోటు పొడవాలనే ప్రయత్నానికి కేసీఆర్ తెరలేపారు’’

2009లో తనకు కొడంగల్ తెలియదని, ప్రజలకు తానూ తెలియదని, కానీ పోటీ చేస్తే ఆదరించారని రేవంత్ పేర్కొన్నారు. గత ప్రభుత్వం ఓడించాలని ఎంత ప్రయత్నించినా… తుపాకి తూటాలకు వెరవకుండా పని చేశానన్నారు.

మీరు పునాధిలా ఉండబట్టే నేనిలా ఉన్నా. పునాది బలంగా ఉంది. ఎవరొచ్చినా ఏం పీకలేరు. 100 మంది కేసీఆర్ లు, వెయ్యిమంది గుర్నాథరెడ్డిలు వచ్చినా పునాధిలో ఒక్క ఇటుక కూడా పీకలేరు. తాండూరులో చెల్లని రూపాయి ఇక్కడ చెల్లుతుందా’’

 

 

నాయకుడితో మాట్లాడొచ్చి అందరినీ కలుస్తా!

నామీద నమ్మకంతో కార్యనిర్వాహక అధ్యక్షుడిగా బాధ్యతలు అప్పగించిన నాయకుడి (చంద్రబాబునాయుడి) నమ్మకాన్ని వమ్ము చేస్తానా? అని కార్యకర్తలను ప్రశ్నించారు రేవంత్ రెడ్డి. నాయకుడు విదేశీ పర్యటన నుంచి తిరిగి వచ్చిన తర్వాత కలసి అన్నీ మాట్లాడతానని చెప్పారు.

నాయకుడితో ఏదైనా మాట్లాడగలిగిన సాన్నిహిత్యం నాకు ఉంది. ఏది మంచో ఏది చెడో చెప్పి ఒప్పించగలిగిన శక్తి ఉంది. నాయకుడు వచ్చాక.. ఆయనతో మాట్లాడాక.. నాయకుని ఆదేశాలు తీసుకొని మళ్ళీ కొడంగల్ వచ్చి.. అప్పుడు అందరినీ పిలిచి మీ అభీష్ఠం మేరకే సమస్యలపై పోరాడతాను’’

పార్టీ మార్పు లేదని పరోక్షంగానే చెప్పిన రేవంత్ రెడ్డి ఆ వార్తలను ముఖ్యమంత్రి చంద్రశేఖరరావుకు, పాత్రికేయులకు ఆపాదించి.. తాను పార్టీ అధినేత చంద్రబాబు ఆదేశాల మేరకు, నియోజకవర్గ ప్రజల అభీష్ఠంమేరకు పని చేస్తానని ముక్తాయించారు. ఈ నెల 26న అసెంబ్లీలో టీడీఎల్పీ సమావేశం ఏర్పాటు చేస్తున్నట్టు మరోసారి చెప్పారు. 27 నుంచి జరగాల్సిన శాసనసభ సమావేశాల్లో ఏయే అంశాలపై పోరాడాలో టీడీఎల్పీలో నిర్ణయాలు తీసుకుంటామన్నారు.

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Leave a Reply