నాగార్జున సాగర్ రిజర్వాయర్ నిండుతోంది
శనివారం సాయంత్రం 36,732 క్యూసెక్కుల విడుదల
570.6 అడుగులకు చేరిన నీటి మట్టం
గత ఏడాది నిల్వకంటే 60 టిఎంసిలు ఎక్కువ
గత మూడేళ్లలో చూడని దృశ్యం నాగార్జున సాగర్ జలాశయంలో నేడు కనిపిస్తోంది. నాలుగేళ్ళలో తొలిసారి… సాగర్ నీరు కుడి కాలువ ఆయకట్టులో మాగాణి భూములను తడుపుతోంది. జలాశయం నిండే దిశగా నీటి ప్రవాహం కొనసాగుతోంది. శనివారం సాయంత్రానికి జలాశయంలో నీటి మట్టం 570.6 అడుగులకు చేరింది. సాగర్ జలాశయం పూర్తి నీటి మట్టం 590 అడుగులకు త్వరగా చేరువవుతోంది. సాగర్ నీటి నిల్వ సామర్ధ్యం 312.045 టిఎంసిలు కాగా.. శనివారం సాయంత్రం 7 గంటల సమయానికి 258.08 టిఎంసిల నీరుంది. గత ఏడాది ఇదే రోజు నిల్వ ఉన్న నీటి కంటే ఇప్పుడు సాగర్ రిజర్వాయర్ లో సుమారు 60 టిఎంసిలు అదనంగా ఉంది. దీంతో కుడి కాలువ రైతాంగానికి నీరివ్వడానికి మార్గం సుగమమైంది.
శుక్రవారం మధ్యాహ్నం 2 గంటల సమయానికి 565.2 అడుగుల వద్ద ఉన్న నీటి మట్టం శనివారం సాయంత్రం 7 గంటల సమయానికి 570.6 అడుగులకు చేరింది. నీటి నిల్వ 13.5 టిఎంసిలు పెరిగింది. అంటే కొంచెం అటూ ఇటుగా గంటకు అర టిఎంసి చొప్పున సాగర్ లోకి నీరు చేరింది. ఇదే మోతాదులో పైనుంచి నీరు వచ్చి చేరితో మరో నాలుగు రోజుల్లోనే నిండిపోతుంది. అయితే, శనివారం సాయంత్రానికి రిజర్వాయర్ లోకి వచ్చి చేరే నీటి పరిమాణం తగ్గింది. ఇన్ ఫ్లో 1,28,355 క్యూసెక్కులు ఉండగా బయటకు 36,732 క్యూసెక్కులు వదిలారు. శుక్రవారం ఉదయం నుంచి శనివారం ఉదయం వరకు సగటున ఇన్ ఫ్లో 1,63,050 క్యూసెక్కులు ఉండగా దిగువకు వదిలిన నీరు సగటున 14,593 క్యూసెక్కులుగా ఉంది. శుక్రవారం రాత్రి 24,892 క్యూసెక్కులు వదిలారు. శనివారం రాత్రికి సాగర్ నుంచి దిగువకు వదిలే నీరు పెరిగింది.
అయితే, శనివారం శ్రీశైలం నుంచి నీటి విడుదల తగ్గింది. సాయంత్రం 5 గంటల సమయానికి శ్రీశైలం జలాశయానికి 2,05,226 క్యూసెక్కుల చొప్పున నీరు వస్తుండగా 1,56,343 క్యూసెక్కులను దిగువకు వదులుతున్నారు. 7 గంటల సమయానికి ఇన్ ఫ్లో మరింత తగ్గి 1,74,059 క్యూసెక్కులకు చేరింది. ఔట్ ఫ్లోను మాత్రం తగ్గించలేదు. శుక్రవారం ఉదయం నుంచి శనివారం ఉదయం వరకు సగటు ఇన్ ఫ్లో 2,40,363 క్యూసెక్కులుగా ఉంటే సగటు ఔట్ ఫ్లో 2,45,420 క్యూసెక్కులుగా నమోదైంది.
శనివారం ఉదయం వరకు నమోదైన వివరాల ప్రకారం… ఏపీలోని అన్ని రిజర్వాయర్లలో 688.54 టిఎంసిల నీరు ఉంది. ఇది గత ఏడాది ఈ రోజున నిల్వ ఉన్న నీటికంటే 176 టిఎంసిలు అదనం. నాగార్జున సాగర్, తుంగభద్ర జలాశయాలు రెంటిలోనే సుమారు 110 టిఎంసిల అదనపు నీటి నిల్వలున్నాయి. శ్రీశైలంలో సుమారు 11 టిఎంసిలు అదనంగా నీరుంది. సాగర్ జలాశయంతో పాటు పులిచింతల కూడా నిండితే సాగర్ కుడికాలువతో పాటు కృష్ణా డెల్టాకు కూడా పుష్కలంగా నీరు ఉంటుంది.