కుల, మత వివాదాలపై జాగ్రత్త… ఎమ్మెల్యేలకు సిఎం హితవు

గోదావరి జిల్లాల్లో మహిళలపై అఘాయిత్యాలు పెరగడంపై ఆందోళన

రాష్ట్రంలో కుల, మత వివాదాల పట్ల అప్రమత్తంగా వ్యవహరించాలని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు తమ పార్టీ ఎమ్మెల్యేలు, ముఖ్య నేతలకు సూచించారు. రాష్ట్రంలో కులపరమైన సున్నితత్వం ఉంటుందన్న చంద్రబాబు… ఎక్కడైనా చిన్న సమస్య తలెత్తితే ప్రతిపక్షాలు అక్కడకిి వెళ్ళి రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్నాయని విమర్శించారు. ముఖ్యంగా ఎస్.సి.ల విషయంలో ఇలా జరుగుతోందని సిఎం పేర్కొన్నారు. ఆదివారం ఉండవల్లిలోని తన నివాస సముదాయంలో ఏర్పాటు చేసిన టీడీపీ వర్క్ షాపులో సిఎం ఈ అంశాన్ని ప్రస్తావించారు.

గోదావరి జిల్లాలలో మహిళలపై అరాచకాలు పెరగడం ఆందోళనకరమని, ప్రజా ప్రతినిధులు ఈ అంశంపైనా దృష్టి సారించాలని ముఖ్యమంత్రి చెప్పారు. ఈ ఏడాది నేరాల శాతం సగం తగ్గాలని అభిలషించారు. రాజకీయ నాయకులు విలువలు పెంచాలని, మంచి-చెడు విశ్లేషణ చేయాలని సూచించిన సిఎం… సంస్కృతి పేరుతో జూదాలు, పందేలను ప్రోత్సహించడం మంచిదికాదని స్పష్టం చేశారు. సాధికారమిత్ర, సేవామిత్ర, జన్మభూమి కమిటీ సభ్యులు, స్థానిక సంస్థల ప్రతినిధులు ఈ విషయంలో సమన్వయంతో పనిచేయాలని సూచించారు.

జూదం ఒక వ్యసనం, ఒక బలహీనత. జూదాలను ప్రోత్సహిస్తే సమాజానికి కీడుచేసినవారు అవుతారు. సంపద పెరిగితే నేరాలు పెరగడం ఆందోళన కరం. ఆంధ్రప్రదేశ్ లో విచ్చలవిడి తనాన్ని సహించేదిలేదు. వ్యసనాలు సమస్యలకు దారితీస్తాయి. సమాజాన్ని అతలాకుతలం చేస్తాయి’’

ఇటీవల పార్టీ పరంగా నిర్వహించిన ‘ఇంటింటికీ తెలుగుదేశం’, ప్రభుత్వ పరంగా జరిగిన ‘జన్మభూమి’ కార్యక్రమాలు విజయవంతమయ్యాయని ముఖ్యమంత్రి సంతోషం వెలిబుచ్చారు. విభజన సమస్యలను అధిగమించి ప్రభుత్వం అన్నివర్గాలకూ సంక్షేమ కార్యక్రమాలను అమలు చేస్తోందని సోదాహరణంగా వివరించారు. రాష్ట్రంలోని 95.45 శాతం ఇళ్ళను ‘ఇంటింటికీ తెలుగుదేశం’ కార్యక్రమంలో భాగంగా పార్టీ నేతలు సందర్శించారని, ఎన్నికల్లో కూడా ఇన్ని ఇళ్ళకు వెళ్ళి ఉండరని, గతంలో ఎప్పుడూ లేనంతగా ఈ కార్యక్రమం విజయవంతమైందని చంద్రబాబు చెప్పారు.

తొలిసారి శాస్త్రీయంగా ప్రతి సమస్యకూ పరిష్కారం చూపేవిధంగా ‘ఇంటింటికీ తెలుగుదేశం’ కార్యక్రమం జరిగిందని, ప్రతి సమస్యనూ రికార్డు చేశామని, ఆర్థిక.. ఆర్థికేతర అంశాలను విభజించి నిర్దేశిత కాల పరిమితి ప్రకారం పరిష్కరిస్తామని చెప్పారు. ఇక ‘జన్మభూమి’కి వచ్చిన ఆదరణనైతే తన జీవితంలో మరచిపోలేనని సిఎం చెప్పారు. తాజాగా నిర్వహించిన జన్మభూమి కార్యక్రమం 23వదని, సమైఖ్యాంధ్రప్రదేశ్ లో 18 సార్లు జన్మభూమి కార్యక్రమం చేపట్టామని, నవ్యాంధ్రలో ఐదోసారి నిర్వహించామని తెలిపారు. ప్రజల ఆలోచనల్లో వస్తున్న మార్పునకు ఇటీవలి జన్మభూమి కార్యక్రమమే నిదర్శనమన్నారు.

Related posts

Leave a Comment