కేంద్రంపై అవిశ్వాసానికి సిద్ధం

4 0
Read Time:4 Minute, 55 Second
ప్యాకేజీ జపం మాని హోదాకోసం పోరాడాలి

రాష్ట్రానికి కావవలసింది పావలా, అర్ధరూపాయి కాదు
చంద్రబాబు భాగస్వామి పవన్ కళ్యాణ్
కందుకూరు బహిరంగ సభలో జగన్

కేంద్ర ప్రభుత్వంపై అవిశ్వాస తీర్మానాన్ని పార్లమెంటులో ప్రవేశపెట్టడానికి తాము సిద్ధమని వై.ఎస్.ఆర్. కాంగ్రెస్ పార్టీ (వైసీపీ) అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రకటించారు. అవిశ్వాస తీర్మానాన్ని తాము ప్రవేశపెడితే తెలుగుదేశం పార్టీ (టీడీపీ) మద్ధతు ఇవ్వాలని, లేదూ తెలుగుదేశం పార్టీయే అవిశ్వాస తీర్మానాన్ని ప్రవేశపెడతానంటే తాము మద్ధతు ఇస్తామని జగన్ స్పష్టం చేశారు. టీడీపీ, వైసీపీలకు చిత్తశుద్ధి ఉంటే కేంద్ర ప్రభుత్వంపై అవిశ్వాసం పెట్టాలని జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ డిమాండ్ చేసిన నేపథ్యంలో జగన్ స్పందించారు.

ప్రజాసంకల్ప యాత్ర పేరిట పాదయాత్ర చేపట్టిన జగన్ ఆదివారం ప్రకాశం జిల్లా కందుకూరులో జరిగిన బహిరంగ సభలో మాట్లాడారు. వచ్చే పార్లమెంటు సెషన్లో రాష్ట్రానికి ప్రత్యేక హోదాను ప్రకటించకుంటే…ఏప్రిల్ ఆరో తేదీన తమ పార్టీ ఎంపీలు రాజీనామా చేస్తారని ఇదివరకే తాను చెప్పానని, అయితే కేంద్రంపై అవిశ్వాసం పెట్టాలని పవన్ కళ్యాణ్ అంటున్నారని జగన్ పేర్కొన్నారు. పవన్ ఏ ఉద్దేశంతో చెప్పినా… రాష్ట్రానికి మంచి జరుగుతుందంటే ఎవరి సలహా అయినా తీసుకోవడానికి సిద్ధమని చెప్పారు.

పవన్ కళ్యాణ్ ను చంద్రబాబు పార్టీకి సంబంధించినవాడిగా… చంద్రబాబు భాగస్వామిగా జగన్ అభివర్ణించారు. ‘‘నువ్వు కోరినట్టే మా పార్టీ ఎంపీలు అవిశ్వాసానికి సిద్ధంగా ఉన్నారు. మీ చంద్రబాబునాయుడుతో మాట్లాడి అవిశ్వాస తీర్మానానికి ఒప్పించు. ఎందుకంటే అవిశ్వాస తీర్మానం ఆమోదం పొందడానికి 54 మంది ఎంపీల సంతకాలు కావాలి. మా పార్టీ తరఫున గెలిచిన ఎంపీలను కూడా సంతలో పశువులను కొన్నట్టు చంద్రబాబునాయుడు కొన్నారు. మిగిలింది ఐదుగురు. ఆ ఐదుగురూ అవిశ్వాస తీర్మానానికి సిద్ధం’’ అని జగన్ వ్యాఖ్యానించారు.

పవన్ కళ్యాణ్ ఏర్పాటు చేసిన జాయింట్ ఫ్యాక్ట్ ఫైండింగ్ కమిటీ (జె.ఎఫ్.ఎఫ్.సి) ప్రయత్నాన్ని కోడిగుడ్డుపై ఈకలు పీకడమేనని ఎద్దేవా చేశారు. ‘‘చంద్రబాబు తానా అంటే పవన్ కళ్యాణ్ తందానా అంటున్నారు. పవన్ కళ్యాణ్ జాయింట్ ఫ్యాక్ట్ ఫైండింగ్ కమిటీ (జె.ఎఫ్.ఎఫ్.సి) ఏర్పాటు చేశారు. కేంద్రం ఏమిచ్చింది? రాష్ట్రం ఏం తీసుకుంది? అని నిర్ధారిస్తారట. ఇది కోడిగుడ్డుపైన ఈకలు పీకినట్టు ఉంది. మీరు చేయవలసింది… కోడిగుడ్డుపై ఈకలు పీకడం కాదు. ప్రత్యేక హోదా మా హక్కు అని పోరాడాలని నేను పవన్ కళ్యాణ్, చంద్రబాబులకు చెబుతున్నా’’ అని జగన్ పేర్కొన్నారు.

‘‘మీరుగానీ, మీ చంద్రబాబునాయుడుగారు గానీ ప్యాకేజీ పేరిట మోసం చేయవద్దు. రూపాయి, అర్దరూపాయి తక్కువ ఇచ్చారా అన్న అంశాన్ని, ప్యాకేజీని పక్కన పెట్టి హోదాకోసం ముందుకు రండి. ప్రత్యేక హోాదా రాష్ట్ర విభజన సమయంలో మన హక్కుగా ఇచ్చారు. బీజేపీ నేతలను అదే అడుగుతున్నా… ఇదే వెంకయ్యనాయుడు అప్పుడు ఐదేళ్ళు చాలదు. పదేళ్ళు కావాాలి… మేం అధికారంలోకి వస్తే పదేళ్ళు ఇస్తాం అని చెప్పారు. తిరుపతిలో నరేంద్రమోదీ సమక్షంలో చంద్రబాబు హోదా 15 సంవత్సరాలు కావాలని అడిగారు. ఇప్పుడు సిగ్గు లేకుండే హోదాను ఎలా తాకట్టు పెట్టారు?’’ అని జగన్ ధ్వజమెత్తారు.

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
100 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Leave a Reply