కేరళకు పెద్ద కష్టం… అతి భారీ వరదకు 385 మంది మృతి

నదులు, కాల్వలతో ప్రకృతి మధ్య పచ్చగా కనిపించే ‘దేవుని సొంత దేశం’ ఇప్పుడు కకావికలమైంది. భారీ వర్షాలు, వరదల తాకిడికి కేరళ అతలాకుతలమైంది. నగరాలు నదులయ్యాయి. కొండచరియలు ఆకుల్లా తెగిపడ్డాయి. భవనాలకు భవనాలు జారుడు బల్లల్లా నీటిలోకి జారి పోయాయి.  రోడ్లు ధ్వంసమయ్యాయి. రవాణా, కమ్యూనికేషన్ వ్యవస్థలు దెబ్బ తిన్నాయి. అన్నిటికీ మించి వందల ప్రాణాలు పోయాయి. ఒక రాష్ట్రంలోని మెజారిటీ ప్రాంతాలు వరద బారిన పడిన అరుదైన సందర్భం ఇది.

1924 తర్వాత అతి పెద్ద వరద బీభత్సాన్ని కేరళ గత కొద్ది రోజుల్లో చవి చూసింది. కేరళ చరిత్రలో 80 రిజర్వాయర్లనుంచి నీటిని వదిలిన ఒకే ఒక్క సందర్భం ఇది. వర్షాల సీజన్ ప్రారంభమైన నాటినుంచి ఈ శనివారం వరకు 385 మంది మరణించారు. జూలై చివరినుంచి కురుస్తున్న భారీ వర్షాలకు నదులు, ఏరులు పొంగి పొర్లాయి. ఓవైపు ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించే కార్యకలాపాలు సాగుతుండగానే భారీ వర్షాలు కొనసాగడంతో కొత్త ప్రాంతాలకు వరద ముప్పు వచ్చి పడింది. ఈ విధంగా 14 జిల్లాలు వరద బారిన పడటంతో రాష్ట్ర యంత్రాంగానికి కంటిమీద కునుకు లేకుండా పోయింది. వరద చుట్టుముట్టిన ప్రాంతాల ప్రజలను కాపాడటానికి సైన్యం సాయం అవసరమైంది.

ముఖ్యంగా ఆగస్టు ఎనిమిదో తేదీనుంచి గడచిన 10 రోజుల్లో కేరళ ఓ భయానక దృశ్యాన్ని చూసింది.  జాతీయ రాష్ట్ర రహదారులు, స్థానిక రోడ్లు కలిపి 65 వేల కిలోమీటర్లమేరకు దెబ్బ తిన్నాయి. కేరళ జనాభాలో సుమారు ఐదు శాతం మంది ఇళ్ళు వదిలి బయటకు రావలసి వచ్చింది. శనివారం నాటికి 3.31 లక్షల మంది సహాయ శిబిరాల్లో తలదాచుకున్నారు. 3.1 లక్షల మంది ఇళ్ళను కోల్పోయారు. 80 వేల మంది వరదల్లో చిక్కుకున్నారు. రక్షణ చర్యలు ఇంకా కొనసాగుతున్నాయి. త్రివేండ్రం, ఎర్నాకుళం మధ్య రైళ్ళను నిలిపివేశారు. జల సంద్రంలా మారిన కొచ్చిన్ ఎయిర్ పోర్టును మూసివేశారు.

శనివారం ఒక్కరోజే 58,506 మందిని సురక్షిత ప్రాంతాలకు చేర్చారు. 33 మంది చనిపోయారు. రాష్ట్ర ప్రభుత్వ యంత్రాంగానికి తోడు ఆర్మీ , నేవీ, ఎయిర్ పోర్స్, కోస్ట్ గార్డ్ దళాలు హెలికాప్టర్లు, విమానాలు, బోట్లతో రక్షణ చర్యల్లో పాలు పంచుకున్నాయి. ప్రధానమంత్రికి, కేంద్ర హోం, రక్షణ శాఖ మంత్రులకు రాష్ట్ర ప్రభుత్వం ప్రతి రోజూ అప్ డేట్స్ ఇస్తోంది.

రూ. 19,500 కోట్ల మేరకు నష్టం జరిగినట్టు ప్రాథమిక అంచనా వేసిన రాష్ట్ర ముఖ్యమంత్రి పినరయి విజయన్.. శనివారం ఏరియల్ సర్వేకోసం వచ్చిన ప్రధానిని సాయం కోరారు. తక్షణ సాయం కింద రూ. 2000 కోట్లు ఇవ్వాలని కోరగా.. ప్రధానమంత్రి రూ. 500 కోట్లు ప్రకటించారు. ఇంతకు ముందు కేంద్ర హోంమంత్రి రాజ్ నాథ్ సింగ్ ప్రకటించిన రూ. 100 కోట్లకు ఇది అదనం. అయితే, వరద తీవ్రతకు ఇది ఏమాత్రం పొంతన లేనిదన్న అభిప్రాయం సర్వత్రా వ్యక్తమైంది.

శనివారం వరద ఉధృతి తగ్గుముఖం పడుతుందని భావించినా.. మళ్ళీ భారీ వర్షాల హెచ్చరిక రావడంతో  11 జిల్లాల్లో రెడ్ అలర్ట్ విధించారు. శనివారం ముఖ్యమంత్రి పినరయి విజయన్ వెల్లడించిన ప్రకారం.. శుక్రవారం రాత్రి ఎనిమిది గంటల సమయానికే 70,085 కుటుంబాలకు చెందిన 3,14,391 మంది 2094 క్యాంపులలో ఉన్నారు. 82,442 మందిని వరద ప్రాంతాలనుంచి కాపాడి సురక్షిత ప్రాంతాలకు తరలించారు. కొన్ని ప్రాంతాలు ఇప్పటికీ నీటి మధ్య చిక్కుకున్నాయి.

Related posts