కొత్త డిజైన్లు ఓకేనా…!

అసెంబ్లీ, హైకోర్టు డిజైన్లు లండన్ లో ప్రదర్శన..
నార్మన్ ఫోస్టర్ టీమ్ తో సిఎం చంద్రబాబు భేటీ..
చర్చల్లో సినీ దర్శకుడు రాజమౌళి

అమరావతి పరిపాలనా నగరిలో ముఖ్యమైన ఐకానిక్ భవనాలు అసెంబ్లీ, హైకోర్టులకు డిజైన్లను ఖరారు చేయడంకోసం ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు లండన్ నగరంలో మంగళవారం నార్మన్ ఫోస్టర్ అండ్ పార్టనర్స్ తో సమావేశమయ్యారు. మూడు దేశాల అధికారిక పర్యటనలో చివరిగా ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు, ఆయన టీమ్ లండన్ చేరుకున్నారు. ఐకానిక్ భవనాలకు డిజైన్లపై చర్చకోసమే రెండు రోజుల వర్క్ షాపును ఈ సందర్భంగా ఏర్పాటు చేశారు.అందులో మొదటి రోజైన మంగళవారం తాజా పరిస్థితిని, ఎంపిక చేసిన నమూనాలను ఫోస్టర్స్ టీమ్ ప్రదర్శించింది. వీటిపై బాగా పొద్దుపోయేవరకు చర్చించారు.

ముఖ్యమంత్రితో పాటు ప్రముఖ సినీ దర్శకుడు ఎస్ఎస్ రాజమౌళి, అబుదాబి పారిశ్రామికవేత్త బీఆర్ షెట్టి, మంత్రులు యనమల రామక్రిష్ణుడు, పి. నారాయణ, ప్రభుత్వ సలహాదారు పరకాల ప్రభాకర్, ముఖ్యమంత్రి ముఖ్య కార్యదర్శి సాయిప్రసాద్, మౌలిక సదుపాయాలు-ఇంథన విభాగాల ముఖ్య కార్యదర్శి అజయ్ జైన్, ఏపీ ఎకనామిక్ డెవలప్ మెంట్ బోర్డు సీఈవో క్రిష్ణకిషోర్, సీఆర్డీయే కమిషనర్ శ్రీధర్ ఈ వర్క్ షాపులో పాల్గొన్నారు. నార్మన్ ఫోస్టర్స్ ఇదివరకు రూపొందించిన నమూనాలకు పలుమార్లు మార్పులు చేసిన ప్రభుత్వం.. సినీ దర్శకుడు రాజమౌళి సలహాలు కూడా తీసుకొని మరింత మెరుగ్గా తీర్చిదిద్దాలని సూచించింది. ఆమేరకు కొన్ని మార్పులతో అసెంబ్లీకోసమే 13 డిజైన్లను రూపొందించారు. వాటిని కొద్ది రోజుల క్రితం ప్రజాభిప్రాయం నిమిత్తం సీఆర్డీయే వెబ్ సైట్ లో ఉంచారు. ఈ నేపథ్యంలో.. ముఖ్యమంత్రి చంద్రబాబు లండన్ లోనే నార్మన్ ఫోస్టర్ టీమ్ ను కలిశారు.

గతంలో రూపొందించిన వివిధ నమూనాలను కాచి వడపోసి కొన్నిటికి నూతన హంగులను దిద్దిన ఫోస్టర్స్ టీమ్.. ముఖ్యమంత్రి ఎదుట మంగళవారం వాటిని ప్రదర్శించింది. ఐకానిక్ భవనాల డిజైన్లు, మొత్తం పరిపాలనా నగరి చిత్రాలను, వీడియోను ప్రదర్శించారు. ప్రజలకు గర్వకారణంగా నిలిచేలా అపూర్వంగా, గొప్పగా, భారతీయత ఉట్టిపడేలా, ప్రజాశక్తి ప్రతిబింబించేలా, నవ్యాంధ్ర ప్రజల ఆత్మవిశ్వాసాన్ని ద్విగుణీకృతం చేసేలా, సహజ వనరులను ఉపయోగించుకునేలా ఆకృతులను రూపొందిస్తున్నామని ముఖ్యమంత్రి చంద్రబాబుకు ఫోస్టర్ సంస్థ రూపకర్తలు క్రిస్ బాబ్, పిడ్రో వివరించారు.

నది సమీపంలో జల వనరుల వినియోగంతో రూపొందే పరిపాలనా నగరిలో శాసనసభ భవనం శోభాయమానంగా ఉంటుందని, సూర్యోదయ సమయంలో అది మరింత అందంగా కనిపిస్తుందని ఫోస్టర్ ప్రతినిధులు చెప్పారు. అసెంబ్లీ, హైకోర్టులకు వేర్వేరుగా రూపొందించిన నమూనాలపై బుధవారం మరోసారి కసరత్తు చేయనున్నారు.

ఫొటోలు ; పై చిత్రం హైకోర్టు నమూనా.
దిగువన అసెంబ్లీ నమూనాలు

పరిపాలనా నగరి 

Related posts

Leave a Comment