కొత్త డీజీపీ మాలకొండయ్య… ఈసారీ తాత్కాలికమే!

2 0
Read Time:4 Minute, 57 Second

రాష్ట్ర పోలీసు విభాగానికి కొత్త బాస్ రానున్నారు. నూతన పోలీసు డైరెక్టర్ జనరల్ (డీజీపీ)గా 1985 బ్యాచ్ ఐపిఎస్ అధికారి ఎం. మాలకొండయ్యను నియమించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ప్రస్తుత డీజీపీ నండూరి సాంబశివరావు ఈ నెలాఖరుకు ఉద్యోగ విరమణ చేయనున్న నేపథ్యంలో మాలకొండయ్య నియామకం ఖరారైంది. నండూరినే కొనసాగించాలని ప్రభుత్వం తొలుత భావించినా మారిన పరిస్థితుల్లో నిర్ణయం మార్చుకుంది. వచ్చే ఏడాది మధ్యలో రిటైర్ కానున్న మాలకొండయ్యకు డీజీపీగా అవకాశం ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వం భావించినట్టు తెలిసింది.

ప్రస్తుతానికి మాలకొండయ్య నియామకం కూడా తాత్కాలిక ప్రాతిపదికనే జరగనుంది. నండూరి నియామకం నుంచి ఇప్పటివరకు తాత్కాలిక డీజీపీగానే కొనసాగారు. పూర్తి స్థాయి డీజీపీ నియామకం విషయంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య నెలకొన్న పొరపొచ్చాలు ఇందుకు ప్రధాన కారణం. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదించిన జాబితాలను కేంద్ర ప్రభుత్వం రెండుసార్లు తిప్పి పంపిన నేపథ్యంలో… చట్ట సవరణకోసం ఆర్డినెన్స్ జారీ చేయాలని ఇటీవలే రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది.

డీజీపీ నియామకం విషయంలో రాష్ట్ర ప్రభుత్వ అభీష్ఠం మేరకు వ్యవహరించేలా ఈ ఆర్డినెన్స్ జారీ చేయాలని భావించారు. గత మంత్రివర్గ సమావేశంలో ఆర్డినెన్స్ జారీకి ఆమోదం తెలిపారు. తాజాగా ఈ ఆర్డినెన్స్ ను రాష్ట్ర గవర్నర్ నరసింహన్ ఆమోదించారు. 1953 ఎఐఎస్ చట్టం పరిధిలో డీజీపీ పదవీ కాలాన్ని నిర్ణయించేందుకు ఈ ఆర్డినెన్స్ వీలు కల్పిస్తుందని ప్రభుత్వం పేర్కొంది. ప్రతిపాదిత ఆర్డినెన్స్ ప్రకారమైతే కొత్త డీజీపీ మాలకొండయ్యకు రిటైర్మెంట్ తర్వాత కూడా అవకాశం కల్పించే వీలుంది. మరి ప్రభుత్వం మాలకొండయ్యకు ఆ అవకాశం ఇస్తుందా… లేక వచ్చే ఏడాది మధ్యలో రిటైర్మెంట్ సమయం వరకే డీజీపీగా కొనసాగుతారా?

ప్రస్తుతానికి ఉన్న సమాచారం ప్రకారం మాలకొండయ్య రిటైర్మెంట్ వరకు తాత్కాలిక డీజీపీగానే కొనసాగే అవకాశం ఉంది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల అభిప్రాయ భేదాల మాట ఎలా ఉన్నా డీజీపీల నియామకం విషయంలో సుప్రీంకోర్టు మార్గదర్శకాలకు విరుద్ధంగా వ్యవహరించలేరన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. అందుకే డీజీపీగా సాంబశివరావును కొనసాగించాలన్న రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయంలో మార్పు వచ్చినట్టు చెబుతున్నారు.

సౌమ్యుడే.. కానీ..!

పోలీసు అధికారులు అనగానే కాఠిన్యం గుర్తుకొస్తుంది. కానీ, మాలకొండయ్య సౌమ్యుడిగా పేరు తెచ్చుకున్నాడు. ప్రకాశం జిల్లాకు చెందిన మాలకొండయ్య గుంటూరులో కళాశాల విద్యను అభ్యసించారు. ఆంధ్ర విశ్వ విద్యాలయంనుంచి క్రిమినాలజీలో డాక్టరేట్ పొందారు. బ్యాంకు ఉద్యోగానికి ఎంపికై కొంత కాలం తర్వాత ఐపీఎస్ సాధించారు.

పోలీసు అధికారిగా వివిధ జిల్లాల్లో పని చేసిన ఆయన అవినీతి నిరోధక శాఖ డీజీగా బాధ్యతలు నిర్వర్తించారు. పోలీసు శాఖ వెలుపల పవర్ ట్రాన్స్ మిషన్ కార్పొరేషన్ సీఎండీగా పని చేసిన మాలకొండయ్య… ప్రస్తుతం ఏపీఎస్ ఆర్టీసీ ఎండీగా కొనసాగుతున్నారు. నిజాయితీపరుడిగా పేరు తెచ్చుకున్న మాలకొండయ్య నిరాడంబరుడు కూడా. అయితే, మనిషి సౌమ్యుడేగాని విధి నిర్వహణలో కచ్చితంగా ఉంటారని ఆయనతో పని చేసిన అధికారులు చెబుతారు.

Happy
Happy
50 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
50 %

Leave a Reply