అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తూర్పు ఆసియా పర్యటనకు వస్తున్న నేపథ్యంలో… ఆ దేశానికి చెందిన అత్యంత శక్తివంతమైన బి1బి బాంబర్లు కొరియా సరిహద్దుల్లో స్వైర విహారం చేశాయి. దక్షిణ కొరియా గగన తలంపై ఉత్తర కొరియాకు సరిహద్దుల్లో బాంబర్ల మోత ప్రతిధ్వనించింది. ఉత్తర కొరియాపై దాడికి ప్రాక్టీస్ చేస్తున్నట్టుగా బాంబులు వేశాయి. ఈ పరిణామంపై ఉత్తర కొరియా అధికారిక వార్తా సంస్థ కేసీఎన్ఎ స్పందించింది. అణుదాడితో తమ దేశాన్ని నాశనం చేసే లక్ష్యంతోనే అమెరికా బెదిరింపులకు, బ్లాక్ మెయిల్ కు పాల్పడుతోందని ఆ సంస్థ పేర్కొంది. అమెరికా వైమానిక దళం బాంబర్ల విహారాన్నినిర్ధారిస్తూనే… బాంబింగ్ ప్రాక్టీసు సాధారణంగా ఎప్పుడూ చేసేదేనని పేర్కొంది.
ఉత్తర కొరియాకు దగ్గర్లో అమెరికా వైమానిక విన్యాసాలు కొత్త కాదు. అయితే, ఇటీవల ఇరు దేశాల మధ్య సంబంధాలు మరింతగా క్షీణించడంతో యుద్ధ మేఘాలు కమ్ముకుంటున్నాయి. ఉత్తర కొరియాకు తన ఆయుధ శక్తిని చూపించడంకోసం అమెరికా ఇటీవల బి1బి బాంబర్లను, న్యూక్లియర్ సబ్ మెరైన్లను, యుద్ధ విమానాలను కొరియా ద్వీపకల్ప సమీపానికి తరలించింది. అక్టోబర్ 21వ తేదీన సియోల్ అంతర్జాతీయ ఏరో స్పేస్, డిఫెన్స్ ఎగ్జిబిషన్లో రెండు బి1బి లాన్సర్లు గగన విహారం చేశాయి. ఉత్తర కొరియాకు అమెరికా హెచ్చరికలు జారీ చేసింది.
గువామ్ దీవుల్లోని అమెరికా సైనిక స్థావరంలో ఉంచిన బి1బి బాంబర్లకు తాజాగా పనిపెట్టింది అమెరికా. గురువారం అవి జపాన్, దక్షిణ కొరియా యుద్ధ విమాానాలతో కలసి అనూహ్యంగా డ్రిల్స్ నిర్వహించాయి.