భారత క్రికెట్ కెప్టెన్ విరాట్ కోహ్లీ నాగపూర్ లో శ్రీలంకతో జరుగుతున్న రెండో టెస్ట్ మ్యాచ్ లో డబుల్ సెంచరీ నమోదు చేశారు. ఇది కోహ్లీకి ఐదో టెస్టు సెంచరీ. ఒకే కేలండర్ ఇయర్ లో 10 సెంచరీలు సాధించిన మొదటి ఆటగాడిగా ఈ మ్యాచ్ లోనే ప్రపంచ రికార్డు నెలకొల్పిన కోహ్లీ ఆ పరంపరను కొనసాగిస్తున్నాడు.
శ్రీలంకతో రెండో టెస్టు మూడో రోజున కోహ్లీ డబుల్ సెంచరీ నమోదు చేసే సమయానికి ఇండియా 567/4 స్కోరును సాధించి పటిష్ఠ స్థితికి చేరింది. విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ 150 పరుగులకు పైగా భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. కోహ్లీతోపాటు ఛటేశ్వర్ పుజారా కూడా సెంచరీ కొట్టగా రోహిత్ శర్మ 50 దాటారు. శ్రీలంకపై తొలి ఇన్నింగ్స్ లో భారీ ఆధిక్యం సాధించారు.
కాగా, డబుల్ సెంచరీ సాధించిన కొద్ది నిమిషాలకే కోహ్లీ ఔటయ్యారు. 213 పరుగుల వద్ద కోహ్లీ ఇన్నింగ్స్ ముగిసింది. అతని తర్వాత అశ్విన్ (5 పరుగులు) రూపంలో ఆరో వికెట్ కూడా వెను వెంటనే పడిపోయింది. అప్పటికి భారత స్కోరు 597కు చేరింది.