ఆదాయార్జన శాఖల పనితీరుపై సమీక్ష
వృద్ధిపై దృష్టి నిలపడమే కాకుండా వ్యయ నియంత్రణలో పట్టు సాధించాలని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు చెప్పారు. జీతభత్యాలకే సరిపోయేలా కొన్నిశాఖలలో వృద్ధి మందగమనంలో ఉండటం ఇబ్బందికరమని అన్నారు. ఖర్చులను అదుపుచేయడం అన్నింటికంటే పెద్ద కసరత్తు అని వ్యాఖ్యానించారు. సోమవారం రాత్రి ముఖ్యమంత్రి ఆదాయాన్ని ఆర్జించేశాఖలలో పురోగతిని సమీక్షించారు.
ప్రజల సంక్షేమం, అభివృద్ధి కోసం ఎన్ని నిధులైనా వెచ్చించాలని, అదే సమయంలో వివిధ శాఖలలో ఆదాయం సక్రమంగా లేక ఖర్చులు పెరిగిపోవడం మంచి సంకేతం కాదని, తక్షణం దానిపై నియంత్రణ సాధించాలని చెప్పారు. 2017-18 ఆర్థిక సంవత్సరం సెప్టెంబర్ వరకు సాధించిన ప్రగతిని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఆయా శాఖల అధికారులతో సోమవారం సాయంత్రం సమీక్షించారు.
స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖలో అక్రమాలను అరికట్టి ప్రజలకు మేలు చేయాలని, ముఖ్యంగా ఏది ప్రభుత్వ భూమి, ఏది ప్రైవేటు భూమి అనేది స్పష్టంగా తెలిసేలా సమగ్ర వివరాలు పబ్లిక్ డొమైన్‌లో అందుబాటులో ఉంచాలని ముఖ్యమంత్రి చెప్పారు. గంజాయి నిర్మూలనకు స్పష్టమైన కార్య ప్రణాళికతో ముందుకు వెళ్లాలని, నెలరోజులలో దీనిపై ఫలితాలు సాధించి చూపాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. జీఎస్‌టీ అమలు తరువాత రాష్ట్రంలో 81782 మంది డీలర్లు కొత్తగా నమోదయ్యారని అధికారులు చెప్పారు. దీంతో రాష్ట్రంలో డీలర్ల సంఖ్య 2,92,000కు చేరిందని తెలిపారు.