ఢిల్లీ వాయు కాలుష్యం ఏ స్థాయిలో ఉందో శ్రీలంక క్రికెటర్లు ప్రపంచం మొత్తానికి చాటి చెప్పారు. ముఖాలకు మాస్కులు ధరించి ఆడుతున్న శ్రీలంక ప్లేయర్ల ఫొటోలను ప్రపంచవ్యాప్తంగా అన్ని మీడియా సంస్థలూ ప్రచురించాయి. ఇప్పుడది పొలిటికల్ సెటైర్లకూ కారణమవుతోంది. కాలుష్య తీవ్రత లంకేయులకు మంగళవారం మరింతగా అనుభవంలోకి వచ్చింది. పేసర్ సురంగా లక్మల్ ఏకంగా గ్రౌండ్ లోనే వాంతి చేసుకోవడం కలకలం రేపింది.
మూడో టెస్టులో ఇండియా సెకండ్ ఇన్నింగ్స్ ఆడుతుండగా మరోసారి మాస్కులతోనే శ్రీలంక ప్లేయర్లు బరిలోకి దిగారు. ఆరో ఓవర్ జరుగుతుండగా లక్మల్ ముందుకు వంగి వాంతి చేసుకున్నాడు. దీంతో శ్రీలంక టీమ్ డాక్టర్ పరుగున వచ్చి అతన్ని బయటకు తీసుకుపోయాడు. ప్రాథమిక చికిత్స తర్వాత లక్మల్ తిరిగి 11వ ఓవర్ జరుగుతున్న సమయానికి గ్రౌండ్ లోకి వచ్చాడు.
ఇదిలా ఉంటే…పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ఢిల్లీ కాలుష్యంలో శ్రీలకం ఆటగాళ్ళ ఇబ్బందిని ప్రస్తావిస్తూ ప్రధానమంత్రి నరేంద్ర మోదీపై వ్యంగ్యాస్త్రం సంధించారు. ‘‘స్వచ్ఛ భారత్ కార్యక్రమానికి ఏమైంది? దేశ రాజధానిలో శ్రీలంక క్రికెటర్లు ముఖాలకు మాస్కులు వేసుకొని ఆడుతున్నారు. ఢిల్లీ రాజకీయ కాలుష్యం నుంచి వాతావరణ కాలుష్యం వరకు అన్నిటికీ ప్రాతినిధ్యం వహిస్తోంది’’ అని మమత మంగళవారం కోల్ కత నగరంలో వ్యాఖ్యానించారు.
కాలుష్య కాసారంలా ఉన్న ఢిల్లీలో టెస్టు మ్యాచ్ నిర్వహించడంపై ఇప్పటికే జాతీయ గ్రీన్ ట్రిబ్యునల్ బీసీసీఐకి మొట్టికాయలు వేసింది. దీంతో… ఇక ముందు నిర్వహించబోయే మ్యాచులకు వాయు కాలుష్యాన్ని కూడా పరిగణనలోకి తీసుకొని ప్రణాళిక సిద్ధం చేసుకుంటామని బీసీసీఐ సెలవిచ్చింది.
శ్రీలంక ప్లేయర్లు మూడో టెస్టు మొదటి రోజునుంచే ఇబ్బంది పడుతున్నారు. తాము గాలి పీల్చుకోవడానికే గిలగిలలాడుతుంటే… కాస్తో కూస్తో అలవాటైన ఇండియన్ ప్లేయర్లు తమ బౌలర్లను ఉతికి ఆరేయడం శ్రీలంక ఆటగాళ్ళలో మరింత అసహనాన్ని కలిగిస్తోంది. మంగళవారం ఎనిమిది మంది ప్లేయర్లు మాస్కులతో బరిలోకి దిగారు. మిగిలిన ముగ్గురిలో లక్మల్ ఒకడు. మాస్కు వేసుకోని లక్మల్ వాంతి చేసుకొని బయటకు వెళ్లి రావలసి వచ్చింది.
మన కాలుష్యానికి అలవాటు పడనివారిపై వెంటనే ప్రభావం కనిపిస్తోంది. అలవాటు పడిన ఇండియన్లు ఏ స్థాయిలో ప్రమాదాన్ని దిగమింగుతున్నారో దీన్నిబట్టి అర్ధం చేసుకోవచ్చు. విశేషం ఏమిటంటే.. వాయు కాలుష్యంలో ఆడుతున్న సమయంలోనే ఇటు ఇండియా టీమ్ కెప్టెన్ విరాట్ కోహ్లీ, శ్రీలంక ఆటగాడు దినేష్ చండీమాల్ గంటల కొద్దీ బరిలో ఉండి తమ కెరీర్ బెస్ట్ స్కోరును నమోదు చేసుకున్నారు. విరాట్ కోహ్లీ 243 పరుగులతో ఆరో డబుల్ సెంచరీని ఇక్కడే సాధించగా చండీమాల్ 164 పరుగుల అత్యధిక వ్యక్తిగత స్కోరు సాధించాడు.