చంద్రబాబుకు రాజ్ నాథ్ ఫోన్… అమిత్ షా ఫోన్ ఒట్టి మాటే…!

2 0
Read Time:5 Minute, 16 Second

టీడీపీపీ సమావేశంలో ఉండగా వచ్చిన కేంద్ర హోంమంత్రి కాల్
బడ్జెట్ తర్వాత రాష్ట్ర ప్రజలు ఆగ్రహంగా ఉన్నారని చెప్పిన చంద్రబాబు
సత్వరం చర్యలు తీసుకోకపోతే ప్రజాభీష్ఠాన్ని అనుసరిస్తామని స్పష్టీకరణ
తాను శివసేనతో మాట్లాడానన్న ప్రచారాన్ని ఖండించిన సిఎం

బడ్జెట్ తర్వాత గరంగరంగా ఉన్న తెలుగుదేశం పార్టీ కేంద్రప్రభుత్వం నుంచి తప్పుకోవాలని యోచిస్తున్నట్టు వార్తలు వచ్చిన నేపథ్యంలో…ఆదివారం కేంద్ర హోం శాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుకు ఫోన్ చేశారు. తెలుగుదేశం పార్లమెంటరీ పార్టీ సమావేశం జరుగుతుండగానే ఈ ఫోన్ కాల్ వచ్చింది. సుమారు 10 నిమిషాలు సాగిన రాజ్ నాథ్, చంద్రబాబు సంభాషణలో ప్రధానంగా రాష్ట్ర విభజన సమస్యలు ప్రస్తావనకు వచ్చాయి. కేంద్ర బడ్జెట్లో కనీసంగా కనిపించాల్సిన కేటాయింపులు కూడా లేకపోవడంపట్ల చంద్రబాబు ఈ సందర్భంగా తీవ్ర స్థాయిలో అసంతృప్తి వ్యక్తం చేసినట్టు సమాచారం.

కేంద్ర బడ్జెట్ చూసిన తర్వాత రాష్ట్ర ప్రజల్లో ఆగ్రహం కనిపిస్తోందని చంద్రబాబు కేంద్ర మంత్రికి చెప్పారు. పరిస్థితి ఇలాగే కొనసాగితే తాము ప్రజాభీష్ఠానికి భిన్నంగా నడుచుకోలేమని కూడా చంద్రబాబు స్పష్టం చేసినట్టు సమాచారం. ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టంలో పేర్కొన్న అంశాలు, రాజ్యసభలో మాజీ ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ ఇచ్చిన హామల అమలు విషయమై అనేకసార్లు తాను ఢిల్లీ వచ్చిన విషయాన్ని చంద్రబాబు గుర్తు చేశారు. ఈ సమయంలో స్పందించిన రాజ్ నాథ్… రాష్ట్ర ప్రభుత్వం అన్ని ప్రయత్నాలూ చేసిందని, కేంద్ర ప్రభుత్వం కూడా ఇచ్చిన హామీల పట్ల చిత్తశుద్ధితో ఉందని పేర్కొన్నారు.

చివరి సంవత్సరం కూడా సాయం చేయకపోతే రాష్ట్రానికి ఇంకెప్పుడు న్యాయం జరుగుతుందని చంద్రబాబు ప్రశ్నించారు. ప్రతి విషయంలోనూ సర్దుకుపోతూ విన్నపాలతో పరిస్థితులను వివరిస్తూ మిత్రధర్మం పాటిస్తున్నామని, అదే సమయంలో కేంద్రంనుంచి మాత్రం అదే స్థాయిలో సహకారం అందడంలేదని చంద్రబాబు ఆవేదన వ్యక్తం చేశారు.

పునర్వ్యవస్థీకరణ చట్టం, ఇతర హామీల అమలుపై తక్షణమే సమీక్ష నిర్వహించాలని చంద్రబాబు కేంద్ర హోంమంత్రిని కోరారు. ఇంకా రాష్ట్రానికి ఇవ్వవలసిన అంశాలపై కార్యాచరణ ప్రణాళికను ప్రకటించాలని, పార్లమెంటు వేదికగా స్పష్టత ఇవ్వాలని చంద్రబాబు సూచించారు. ఇప్పటికే తమపై ఒత్తిడి ఉందని, పార్లమెంటు బడ్జెట్ సమావేశాలు ముగిసేలోగా స్పష్టత రాకపోతే అప్పటి పరిస్థితిని బట్టి తాము నిర్ణయాలు తీసుకుంటామని చంద్రబాబు స్పష్టం చేసినట్టు తెలిసింది. అయితే, తొందరపడవద్దని, కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన హామీలను అమలు చేసే విషయంలో అనుమానం అక్కర్లేదని రాజ్ నాథ్ సింగ్ ఒకటికి రెండుసార్లు చెప్పారు.

అమిత్ షా ఫోన్ ఒట్టిమాట

రాజ్ నాథ్ సింగ్ ఫోన్ సంభాషణను పార్టీ ఎంపీలతో పంచుకున్న చంద్రబాబునాయుడు… పార్లమెంటు వేదికగా పోరాటం చేయాలని సూచించారు. అమిత్ షా తనకు ఫోన్ చేసినట్టు వచ్చిన వార్తలు నిజం కాదని చంద్రబాబు స్వయంగా చెప్పారు. అలాగే తాను నిన్న (శనివారం) శివసేన అధ్యక్షుడు ఉద్ధవ్ థాకరేకు ఫోన్ చేసినట్టు వచ్చిన వార్తలనూ ఆయన ఖండించారు. పొత్తుల విషయమై తానెవరికీ ఫోన్ చేయలేదని చంద్రబాబు స్పష్టం చేశారు. కాగా, రాష్ట్ర పునర్వ్యవస్థీకరణ చట్టం అమలుకు సంబంధించి ప్రధానంగా చర్చించిన రాజ్ నాథ్ సింగ్… పార్టీకి సంబంధించిన అంశాలపై అమిత్ షా మాట్లాడతారని చంద్రబాబుకు చెప్పినట్టు తెలిసింది.

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Leave a Reply