చంద్రబాబు అనుచరుడిగానే…! రేవంత్ వింత లాజిక్

తాను తెలుగుదేశం పార్టీని వీడి కాంగ్రెస్ పార్టీలో చేరడానికి ఎమ్మెల్యే రేవంత్ రెడ్డి ఓ వింత లాజిక్ చెప్పారు. తెలుగుదేశం పార్టీ అధినేత, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు అనుచరుడిగానే తాను తెలంగాణ సమాజ శ్రేయస్సు కోరి పార్టీ మారుతున్నట్టు చెప్పకొచ్చారు. ‘ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని అభివద్ధి చేయడానికి చంద్రబాబునాయుడు అమరావతిలో అహర్నిశలు కష్టపడుతుంటే.. ఇక్కడ కేసీఆర్ ఇచ్చిన హామీలను కూడా నెరవేర్చడంలేదు. ఆంధ్రప్రదేశ్ ను అహర్నిశలు కష్టపడి అభివద్ధి చేస్తున్న చంద్రబాబు అనుచరుడిగా తెలంగాణ సమాజంకోసం నేను ఈ నిర్ణయం తీసుకోవడం తప్పా?’ అని తెలంగాణ తెలుగుదేశం పార్టీ కార్యకర్తలను ఉద్దేశించి ప్రశ్నించారు.

మంగళవారం ఢిల్లీలో కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ సమక్షంలో రేవంత్ రెడ్డి కొత్త కండువా కప్పుకోనున్నారు. ఈ నేపథ్యంలో హైదరాబాద్ లో టీడీపీ కార్యకర్తలతో సమావేశం ఏర్పాటు చేశారు. కాంగ్రెస్ పార్టీలో చేరక ముందే కార్యకర్తల సమావేశానికి తెలంగాణ కాంగ్రెస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డిని ఆహ్వానించారు. అయితే, ఎవరి కండువాలు వారు కప్పుకొని ఈ సమావేశంలో మాట్లాడారు. రేవంత్ రెడ్డితోపాటు టీడీపీ సీనియర్ నేత వేం నరేందర్ రెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డితోపాటు కాంగ్రెస్ సీనియర్ నేత మల్లు రవి కూడా ఈ సమావేశానికి హాజరయ్యారు. రేవంత్, ఇతర నేతలు, కార్యకర్తలను ఉత్తమ్ కుమార్ రెడ్డి ఈ సమావేశంలోనే లాంఛనంగా కాంగ్రెస్ లోకి ఆహ్వానించారు.

రేవంత్ రెడ్డి ప్రసంగంలోని కొన్ని వ్యాఖ్యలు
 • గతంలో దేవెగౌడను ప్రధానిని చేసిన సమయంలోనే చంద్రబాబుకు అవకాశం వస్తే..ఆయన తెలుగు ప్రజలకోసమే వదులుకున్నారు.
 • నేను స్వతంత్రంగానే 2007లో జడ్పీటీసీగా, 2008లో ఎమ్మెల్సీగా గెలిచాను. ప్రతిపక్షంలో ఉంటేనే ప్రజలకోసం పని చేయగలమని టీడీపీలో చేరా.
 • చంద్రబాబుతో 10 సంవత్సరాలు పని చేసిన అనుభవం ఎప్పటికీ మరువలేను. తెలంగాణ సమాజంకోసమే ఇప్పడుు పార్టీ మారవలసి వస్తోంది.
 • ఇటీవల 50 రోజుల్లో తెలంగాణలో టీడీపీకి 10 లక్షల మంది క్రియాశీల కార్యకర్తలను చేర్చాం.
 • తెలంగాణ రైతులు, ప్రజల బాధలను చూసే… సోనియా గాంధీ ప్రత్యేక రాష్ట్రాన్ని ఇచ్చారు. ఉద్యమం చేసి సాధించిన తెలంగాణకు నేను సిఎం అయితేనే పురోగతి సాధించగలం అని కేసీఆర్ ప్రజలను నమ్మించారు. అక్కడక్కడా కేసీఆర్ లాంటి చీడ పురుగులు ఉంటారని తెలంగాణ ప్రజానీకానికి తర్వాత అర్ధమైంది.
 • అటు సోనియాగాంధీ వద్ద విధేయత ప్రకటించిన కేసీఆర్… మాట నిలబెట్టుకోలేదు. ఇటు ప్రజలకు ఇచ్చిన హామీలూ నెరవేర్చలేదు.
 • కేసీఆర్ కుటుంబానికి పదవులు, వేల కోట్ల వ్యాపారాలు పెంచుకున్నారు. 10 ఎకరాల్లో కట్టిన భవనానికి బుల్లెట్ ప్రూఫ్ అద్దాలు తగిలించుకున్నాడు. ఇదే ఆయన సాధించిన ప్రగతి.
 • తెలంగాణలో ఐదు పార్టీలున్నాయి. అధికార టీఆరెస్, ప్రధాన ప్రతిపక్షం కాంగ్రెస్, ఆ తర్వాత టీడీపీ, బీజేపీ, ఎంఐఎం.
 • కేసీఆర్ నరేంద్ర మోదీ పొద్దున తిట్టుకుంటారు. సాయంత్రం ముద్దు పెట్టుకుంటారు.
 • కమ్యూనిస్టులకు వచ్చినన్ని ఓట్లు కూడా బీజేపీకి రాలేదు. వాళ్ళంటారు టీడీపీతో పొత్తు వద్దని… ఎందుకంటే ఓవైపు విద్యాసాగరరావు, మరోవైపు మురళీధర్ రావు కేసీఆర్ ను మళ్ళీ సీఎం చేయడానికి కట్టుబడి ఉన్నారు.
 • నరేంద్ర మోదీ, కేసీఆర్ ఒక్కటే.. నాతో బీజేపీ అగ్రనేత ఒకరన్నారు. ఎన్డీయేలో టీడీపీ ప్రత్యక్షంగా ఉంది. టీఆరెస్ పరోక్షంగా ఉంది అని… అదెలాగంటే కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం తీసుకున్న ప్రతి చర్యనూ కేసీఆర్ బలపరిచారని గుర్తు చేశారు.
 • కేసీఆర్ తో కలసిన వాళ్ళతో నేను ఎలా కలసి పని చేసేది?

Related posts

Leave a Comment